కొవిడ్‌ వార్డులో స్టాలిన్‌

తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌ కొవిడ్‌ వార్డును సందర్శించారు. పీపీఈ కిట్‌ ధరించి ఆదివారం కోయంబత్తూరు ఆసుపత్రిలో కరోనా రోగులను పరామర్శించారు.

Updated : 30 May 2021 23:59 IST

వైద్యులు, కరోనా రోగుల్లో అత్మస్థైర్యం పెంచేందుకేనన్న తమిళనాడు ముఖ్యమంత్రి

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌ కొవిడ్‌ వార్డును సందర్శించారు. పీపీఈ కిట్‌ ధరించి ఆదివారం కోయంబత్తూరు ఆసుపత్రిలో కరోనా రోగులను పరామర్శించారు. ఈఎస్‌ఐ ఆసుపత్రి, కోయంబత్తూరు వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నకొవిడ్‌ రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు.  కొవిడ్‌ వార్డు సందర్శనకు సంబంధించిన ఫొటోలను ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘‘కష్టకాలంలో ప్రాణాలను లెక్క చేయకుండా ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కొవిడ్‌ వార్డుకు వెళ్లాను. కొవిడ్‌ రోగులు, వారి కుటుంబాలకు ధైర్యం చెప్పాను. వ్యాధి నుంచి కోలుకోవడానికి మందులతో పాటు ఓదార్పు కూడా ఎంతో అవసరం. రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుంది’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ముఖ్యమంత్రి నేరుగా కొవిడ్‌ వార్డుకు వెళ్లడం తమిళనాడులో ఇదే తొలిసారి అని ప్రభుత్వం వెల్లడించింది.  కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన స్టాలిన్‌ నేరుగా కొవిడ్‌ వ్యాప్తిపై సమీక్ష నిర్వహించడం ఇది రెండోసారి. రాష్ట్రంలో కోయంబత్తూరు జిల్లాలో కొవిడ్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 3600 కొత్త కేసులు నమోదయ్యాయి.  పొరుగున ఉన్న తిరుప్పూర్‌, ఈరోడ్‌, సేలం జిల్లాల్లోనూ కేసుల సంఖ్య అధికంగానే ఉంటోంది.  సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్‌ తమంగ్‌ కూడా ఆరోగ్య శాఖ సిబ్బందిలో దైర్యం నింపేందుకు శనివారం పీపీఈ కిట్‌ ధరించి కొవిడ్ వార్డును సందర్శించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై సమీక్ష చేశారు. అక్కడ శనివారం కొత్తగా 273 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని