Published : 01 Jun 2021 19:02 IST

Corona: ఊరటనిచ్చే ‘పాజిటివ్‌’ న్యూస్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. పాజిటివిటీ రేటు దిగివస్తుండగా.. రికవరీ రేటు క్రమంగా పైకి దూసుకెళ్తోంది. కరోనా నివారణకు వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. డిసెంబర్‌ నాటికల్లా అందరికీ టీకా వేస్తామని విశ్వాసం వ్యక్తం చేసింది. అలాగే, హైదరాబాద్‌కు ఈ రోజు దాదాపు 30లక్షల స్పుత్నిక్‌ వీ టీకాలు చేరుకున్నాయి. కరోనాతో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల్లో ఊరట కల్గించే కొన్ని పాజిటివ్‌ వార్తలు మీ కోసం.. 

👍 దేశాన్ని చిగురుటాకులా వణికించిన కరోనా ఉగ్రరూపం రోజురోజుకీ తగ్గుముఖం పడుతోంది. తాజాగా కొత్త కేసులతో పాటు మరణాల్లో కూడా గణనీయమైన తగ్గుదలే కనిపించింది. సోమవారం 1,22,510మంది వైరస్‌ బారిన పడగా.. 2795మరణాలు నమోదయ్యాయి. అలాగే, 2.55లక్షల మందికి పైగా కోలుకున్నారు. వరుసగా 19వ రోజూ కోలుకున్నవారి సంఖ్యే భారీగా ఉండటం విశేషం. మరోవైపు, దేశంలో పాజిటివిటీ రేటు తగ్గుతుండగా.. రికవరీ రేటు పెరుగుతోంది. ప్రస్తుతం భారత్‌లో రికవరీ రేటు 92.09శాతంగా ఉంది.

👍 ఆంధ్రప్రదేశ్‌లో కోటికి పైగా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 94,92,944మందికి తొలి డోసు అందించగా.. 25,24,768 మందికి రెండు డోసులూ ఇచ్చినట్టు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,17,712 డోసులు పంపిణీ చేశామని, ప్రతి ఏడుగురిలో ఒకరికి కనీసం ఒక్కడోసును పంపిణీ చేయగలిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. 

👍 భారత్‌లో కరోనా పాజిటివిటీ రేటు వరుసగా ఎనిమిదో రోజూ 10శాతం కన్నా తక్కువే (6.62%) నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 344 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువగా ఉన్నట్టు తెలిపింది. గత వారం రోజులుగా 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో క్రియాశీల కేసుల్లో తగ్గుదల నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 34.67కోట్ల శాంపిల్స్‌ పరీక్షలు చేసినట్టు కేంద్రం తెలిపింది. అలాగే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 21.6కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్టు వివరించింది.

👍 వ్యాక్సిన్ల కొరత లేదని, జులై లేదా ఆగస్టు ప్రారంభం నాటికి రోజూ కోటి మందికి పంపిణీ చేసేందుకు అవసరమైన వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందని ఐసీఎంఆర్‌ చీఫ్‌ బలరాం భార్గవ తెలిపారు. డిసెంబర్‌ నాటికి అందరికీ టీకా వేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు, దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. గడిచిన 24గంటల వ్యవధిలో 27.8లక్షల మందికి టీకాలు వేశారు. ఇంత వరకు దేశవ్యాప్తంగా 23కోట్ల డోసులు సమకూర్చినట్టు కేంద్రం తెలిపింది. వాటిలో 21,51,48,659 డోసులు వినియోగం జరగ్గా (వృథాతో కలిపి).. ప్రస్తుతం ఆయా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 1.57కోట్లకు పైగా డోసులు వినియోగానికి సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. 

👍 దేశంలోనే అతి పెద్ద కొవిడ్‌ వ్యాక్సిన్‌ దిగుమతులకు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గో వేదికగా నిలిచింది. రష్యాకు చెందిన స్పుత్నిక్‌-V టీకాలు నేడు హైదరాబాద్‌ చేరుకున్నాయి. మూడో విడతలో భాగంగా 27.9లక్షల డోసులు దిగుమతి అయ్యాయి. వీటిని 90 నిమిషాల్లోనే డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌కు తరలించారు.

👍 నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఔషధం పంపిణీకి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో పంపిణీ విధానంపై నెల్లూరు కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో అధికారులు సమావేశం నిర్వహించారు. ముడి సరుకు సమీకరించి నాలుగైదు రోజుల్లో మందు పంపిణీ ప్రారంభిస్తామని కలెక్టర్‌ చక్రధర్‌ బాబు వెల్లడించారు. వికేంద్రీకరణ, ఆన్‌లైన్‌ విధానం ద్వారా ఈ మందును పంపిణీ చేస్తామన్నారు.

👍 కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న భయాందోళనల నేపథ్యంలో మరో సీరో సర్వే నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఈ నెలలో నాలుగో విడత సీరో సర్వే నిర్వహించనుంది. ఎంతమందిలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయో దీనిద్వారా తెలుసుకోనున్నారు. ఈ విడతలో చిన్నారులతో పాటు గ్రామీణ ప్రాంతాలపై ఐసీఎంఆర్‌ దృష్టి సారించనుంది. 

👍 కరోనా వైరస్‌ నియంత్రణకు వ్యాక్సిన్‌ ఒక్కటే అస్త్రం కావడంతో యూపీ ప్రభుత్వం భారీ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది. థర్డ్‌వేవ్‌తో మరింత ముప్పు పొంచి ఉందంటోన్న నిపుణుల హెచ్చరికలతో సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ అందించేందుకు ‘మిషన్‌ జూన్‌’ కార్యక్రమాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. జూన్‌లో రాష్ట్రంలోని 75 జిల్లాల్లో కోటి మందికి టీకా పంపిణీ చేయడమే ఈ ‘మిషన్‌ జూన్‌’ లక్ష్యం. 

👍 కొవిడ్ సంక్షోభంతో అవస్థలు ప‌డుతోన్న వారికి త‌న‌వంతు సాయం చేశారు ప్ర‌ముఖ నటి పూజా హెగ్డే. లాక్‌డౌన్ కార‌ణంగా స‌మస్య‌లు ఎదుర్కొంటున్న పేద కుటుంబాల‌కి అండ‌గా నిలిచారు. దాదాపు 100 కుటుంబాల‌కు నెల‌కు స‌రిప‌డా స‌రుకులను అందించి ఉదారతను చాటుకున్నారు. ఆ సరుకుల్ని తానే స్వయంగా ప్యాక్‌ చేసిన ఈ బుట్టబొమ్మ ఫొటోలు వైరల్‌గా మారాయి. 

👍 కరోనా కష్టకాలంలో రామకృష్ణ మిషన్‌ తన వంతు తోడ్పాటును అందిస్తోంది. కరోనా లక్షణాలు మధ్యస్థంగా ఉన్న రోగుల కోసం రెండు సేఫ్‌ హోమ్‌లను ఏర్పాటు చేసింది. పశ్చిమ్‌ బెంగాల్‌లోని బేలూరు మఠ్‌ ఒకటి కాగా.. నరేంద్రపూర్‌లో ఇంకో సేఫ్‌హోమ్‌ని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. 50 పడకలతో ఉచితంగా చికిత్స అందించనున్నట్టు వెల్లడించింది. ఆరు నెలల వరకు ఈ సేవలందించనున్నట్టు పేర్కొంది. సేఫ్‌హోమ్‌లో ఆక్సిజన్‌ సిలిండర్లు, ఇతర వైద్య సదుపాయాలు కల్పించినట్టు రామకృష్ణ మిషన్‌ కార్యదర్శి స్వామి సర్వలోకానంద తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని