UPSC civils exam: నేడే ఆఖరు.. సివిల్స్‌ పరీక్షకు దరఖాస్తు చేశారా?

upsc civil services exam దరఖాస్తులకు గడువు ముగుస్తోంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకొనేందుకు ఈ ఒక్కరోజే మిగిలి ఉంది.

Updated : 21 Feb 2023 09:58 IST

దిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగ నియామకాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (CSE) 2023కు దరఖాస్తుల గడువు నేటితో పూర్తికానుంది. మొత్తం 1,105 సివిల్ సర్వీస్‌ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 1 నుంచి మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ..  ఈరోజు (మంగళవారం) సాయంత్రం 6 గంటలతో ముగియనుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొందినవారు, ప్రస్తుతం డిగ్రీ ఆఖరి ఏడాది అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ పరీక్షకు  ఆన్‌లైన్‌లో https://upsconline.nic.in దరఖాస్తులు చేసుకోవచ్చు. 

ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల వయో పరిమితి 2023 ఆగస్టు 1 నాటికి 21 ఏళ్లు నిండి 32 ఏళ్ల మధ్య ఉండాలని యూపీఎస్సీ తెలిపింది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్‌ పరీక్ష మే 28న జరగనుంది. ఆ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో ప్రతిభ కనబరిచిన వారిని ఇంటర్వ్యూకు ఆహ్వానించి అభ్యర్థుల తుది ఫలితాలు వెల్లడిస్తారు. ప్రిలిమ్స్‌ పరీక్షకు మూడు వారాల ముందు ఈ-అడ్మిట్‌ కార్డులను జారీ చేయనున్నారు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి

ఇవి గుర్తుంచుకోండి..

  • వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) తప్పనిసరి. దీన్ని ఒకే ఒక్కసారి చేస్తే భవిష్యత్తులోనూ ఉపయోగపడుతుంది. మొదట ఓటీఆర్‌ చేసుకుని, ఆపై ఆన్‌లైన్‌ దరఖాస్తును నింపి పంపాలి. ఇంతకుముందే ఓటీఆర్‌ పూర్తి చేసుకుంటే నేరుగా దరఖాస్తులో వివరాలు నమోదు చేసి, పంపుకోవచ్చు.
  • ప్రిలిమినరీ పరీక్షకు చేసే దరఖాస్తులోనే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్ష కేంద్రాలను ఎంచుకోవాలి. తర్వాత వీటిని మార్చటానికి వీలుండదు.
  •  మెయిన్‌ పరీక్షలోనే ఆప్షనల్‌ సబ్జెక్టు ఉంటుంది. దాన్ని ఎంచుకోవటం మాత్రం ప్రిలిమినరీ దరఖాస్తులోనే చేయాలి. అందుకని ఆప్షనల్‌ సబ్జెక్టు విషయంలో ఇప్పుడే స్పష్టత ఏర్పరచుకోవాలి.
  • ప్రిలిమినరీ దరఖాస్తు నింపేటప్పుడే మెయిన్‌ పరీక్ష రాసే మాధ్యమాన్ని (మీడియం) ఎంచుకోవాలి. దీన్ని తర్వాత మార్చుకోవడం సాధ్యం కాదు.  
  • దరఖాస్తును పంపిన తర్వాత దాన్ని ఉపసంహరించుకోవడానికి వీలుండదు. గత ఏడాది వరకూ దీన్ని అనుమతించారు కానీ ఇప్పుడు సాధ్యం కాదు. దరఖాస్తు పంపినంతమాత్రాన దాన్ని అభ్యర్థి పరీక్ష ‘అటెమ్ట్‌’గా పరిగణించరు. అభ్యర్థి పరీక్ష జరిగే రోజున భౌతికంగా పరీక్ష కేంద్రానికి హాజరై రాస్తేనే అలా పరిగణిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని