Updated : 05 Jun 2021 20:34 IST

Corona: ఊరటనిచ్చే ‘పాజిటివ్‌’ న్యూస్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. గత కొన్ని వారాలుగా కొత్త కేసులు తగ్గడం.. రికవరీ అవుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఊరటనిస్తోంది. మరోవైపు, యాక్టివ్‌ కేసుల కొండ కరుగుతోంది. కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌తో సతమతమవుతున్న వేళ థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయడంపై ప్రభుత్వాలు దృష్టిసారించాయి. వైరస్‌ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న వేళ పలు రాష్ట్రాలు కొన్ని సడలింపులు ఇస్తూ లాక్‌డౌన్‌లను పొడిగిస్తున్నాయి. కరోనా కష్టకాలంలో ఉపశమనం కలిగించే కొన్ని వార్తలు మీకోసం.. 

👍 దేశంలో కరోనా పాజిటివిటీ రేటు క్రమంగా దిగి వస్తోంది. కొత్త కేసులు 58 రోజుల కనిష్ఠానికి చేరాయి. వరుసగా 23వ రోజూ కొత్త కేసుల కన్నా కోలుకున్నవారి సంఖ్యే భారీగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 20.84లక్షల టెస్ట్‌లు చేయగా.. దాదాపు 1.20లక్షల మందికి పైగా ఈ వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. వరుసగా తొమ్మిదో రోజూ 2లక్షల కన్నాతక్కువ కేసులే నమోదు కావడం గమనార్హం. రోజువారీ పాజిటివిటీ రేటు 5.78శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 6.89శాతంగా ఉంది. ఇప్పటివరకు 36.11కోట్ల పరీక్షలు చేశారు.

👍 తెలంగాణలో ఎంపికచేసిన 19 జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాగ్నొస్టిక్‌ కేంద్రాలను ఈనెల 7న ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. వీటిల్లో కరోనా పరీక్షలతో పాటు మొత్తంగా 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వైద్య సేవలు, పలు అంశాలపై ప్రగతిభవన్‌ నుంచి అధికారులతో చర్చించిన సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రోగం కంటే పరీక్షల ఖరీదే ఎక్కువైందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

👍 మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో 1179 గ్రామాలు కరోనాలేని గ్రామాలుగా మారాయి. ఈ జిల్లాల్లో మొత్తంగా 1604 గ్రామాలు ఉండగా.. 1179 గ్రామాలు కరోనా ఫ్రీ విలేజ్‌లుగా నిలిచాయని, కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో అయితే, 271 గ్రామాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని జిల్లా అధికారులు వెల్లడించారు. కరోనా విజృంభణతో నాందేడ్‌ జిల్లాలో ఇప్పటివరకు 90వేల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1800 మంది మృతిచెందినట్టు వివరించారు.  

👍 కరోనాతో పోరాడే యాంటీబాడీలను గుర్తించేందుకు సరికొత్త రాపిడ్‌ బ్లడ్‌ టెస్టును అమెరికాలోని జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీంతో 5నిమిషాల కన్నాతక్కువ వ్యవధిలోనే శరీరంలో యాంటీబాడీలను గుర్తించవచ్చు. కరోనా సోకిన రోగుల నుంచి సేకరించిన 400 రక్త నమూనాలను ఈ పద్ధతిలో పరీక్షించగా 87.5 శాతం కచ్చితత్వంతో యాంటీబాడీలను గుర్తించిందని తెలిపారు. ఇది బ్లడ్‌ గ్రూప్‌ తెలుసుకోవడానికి చేసే రక్తపరీక్షలాగే ఉంటుందట. రద్దీ ప్రదేశాలైన విమానాశ్రయాలు, స్టేడియాల్లో ప్రజలను పరీక్షించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

👍 కరోనా వైరస్‌పై పోరాటంలో వ్యాక్సినే కీలక అస్త్రం. కరోనా సెకండ్‌ వేవ్‌తో సతమతమవుతున్న భారత్‌కు మూడో ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో ప్రభుత్వాలు సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా వేసేలా చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 36,50,080 డోసుల వ్యాక్సిన్‌ పంపిణీ జరిగింది. మరోవైపు, దేశంలో ఇప్పటివరకు 22,78,60,317 టీకా డోసులు పంపిణీ జరగ్గా.. ఇంకా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 1.65కోట్ల మేర డోసులు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. అలాగే, రాష్ట్రాలకు ఇప్పటివరకు 24కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ను సమకూర్చినట్టు (రాష్ట్రాలు నేరుగా సేకరించుకున్నవాటితో కలిపి) వివరించింది.

👍 తమిళనాడు ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించింది. కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ ఈ నెల 14వరకు కొనసాగిస్తున్నట్టు సీఎం స్టాలిన్‌ వెల్లడించారు. అత్యధిక పాజిటివిటీ రేటు కలిగిన 11 జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమలుచేయనుండగా.. మిగతా జిల్లాల్లో సడలింపులు ఇస్తున్నట్టు తెలిపారు. మరోవైపు, దిల్లీలోనూ కరోనా అదుపులోకి రావడంతో అన్‌లాక్‌ ప్రక్రియను మొదలు పెట్టారు. మార్కెట్లు, మాల్స్‌ను సరి బేసి పద్ధతిలో తెరవాలని సీఎం కేజ్రీవాల్‌ నిర్ణయించారు. ప్రైవేటు కార్యాలయాలకు 50శాతం సిబ్బందితో  అనుమతిస్తున్నట్టు చెప్పారు. మరిన్ని సడలింపులతో జూన్‌ 14వరకు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నట్టు కేజ్రీవాల్‌ తెలిపారు.  హిమాచల్‌ప్రదేశ్‌లోనూ కరోనా కర్ఫ్యూని జూన్‌ 14వరకు  పొడిగించారు. అలాగే, 12వ తరగతి బోర్డు పరీక్షలను సైతం రద్దు చేస్తున్నట్టు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కూడా కరోనా కర్ఫ్యూని ఈ నెల 15వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గోవా కూడా ఈ నెల 14వరకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూని పొడిగించింది.

👍 హైదరాబాద్‌కు చెందిన హెటెరో గ్రూపు రష్యాకు చెందిన కొవిడ్‌-19 టీకా ‘స్పుత్నిక్‌ వి’ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ టీకాను ఉత్పత్తి చేసి, మన దేశంతో పాటు ఇతర దేశాలకు అందించడానికి రష్యా సంస్థ ఆర్‌డీఐఎఫ్‌తో హెటెరో గ్రూపు కొంతకాలం క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో హెటెరో సంస్థకు ఆర్‌డీఐఎఫ్‌ నుంచి స్పుత్నిక్‌ వి టీకా సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కావడంతో ‘స్పుత్నిక్‌ వి’ టీకా ఉత్పత్తి మొదలుపెట్టినట్లు హెటెరో గ్రూపు ఛైర్మన్‌ బి.పార్థసారధి రెడ్డి తెలిపారు. స్పుత్నిక్‌ వి టీకాతో పాటు స్పుత్నిక్‌ లైట్‌ టీకానూ ఉత్పత్తి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. దాదాపు 20 కోట్ల డోసుల స్పుత్నిక్‌ వి, స్పుత్నిక్‌ లైట్‌ టీకాల ఉత్పత్తికి వీలుగా పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన తెలిపారు.

👍 ఫార్మా సంస్థ బయోలాజికల్‌ ఇ. లిమిటెడ్‌(బీఇ) అభివృద్ధి చేస్తున్న కార్బివాక్స్‌ టీకా దేశంలోనే అత్యంత చౌకైన వ్యాక్సిన్‌ కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మూడో దశ ప్రయోగాల్లో ఉన్న ఈ టీకా ధర రెండు డోసులకు కలిపి రూ. 500గా ఉండనున్నట్లు ఓ ఆంగ్ల మీడియా సంస్థ కథనంలో పేర్కొంది. అంటే ఒక్కో డోసు ధర కేవలం రూ. 250 మాత్రమే. ఇంతకంటే తక్కువ కూడా ఉండొచ్చని సదరు మీడియా కథనం పేర్కొంది. అయితే ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు ఒకే ధరకు విక్రయించనున్నారా? లేదా? అనే అంశంపై మాత్రం స్పష్టత లేదు.

👍 కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో 4500 మంది ఖైదీలకు పెరోల్‌ను పొడిగిస్తున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 60 రోజుల పాటు పెరోల్‌ అవకాశం కల్పించిన ప్రభుత్వం.. కరోనా కేసులు పెరగడంతో తాజాగా మరో 30 రోజుల పాటు ఆ గడువును పెంచుతున్నట్టు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా తెలిపారు. ప్రస్తుతం పెరోల్‌పై ఉన్న ఖైదీలు జైలుకు వస్తే మిగతా వారికి వైరస్‌ సోకే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మరోవైపు, జైలులో ఉన్న ఖైదీలందరికీ ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 18వేల మంది ఖైదీలకు వ్యాక్సిన్‌ వేసినట్టు చెప్పారు.

👍 వ్యాక్సినేషన్‌ విషయంలో పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ వినూత్న చర్యలు చేపట్టింది. ‘వ్యాక్సినేషన్‌ ఆన్‌ వీల్స్‌’ పేరిట మార్కెట్ల వద్ద ప్రత్యేక ఏసీ బస్సులతో మొబైల్‌ వ్యాక్సినేషన్‌ సర్వీసు ఏర్పాటు చేసింది. మొబైల్‌ క్లీనిక్‌ తరహాలో ఏర్పాటు చేసిన ఈ బస్సుల్లోనే రవాణా సిబ్బందితో పాటు కూరగాయలు విక్రయించేవారు, నిత్యావసరాలు, చేపలు అమ్మేవారు, తదితరులకు వ్యాక్సిన్‌ అందిస్తున్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని