Corona: ఊరటనిచ్చే ‘పాజిటివ్‌’ న్యూస్‌!

దేశంలో తీవ్ర కల్లోలం రేపిన కరోనా వైరస్‌ క్రమంగా అదుపులోకి వస్తున్నట్టు కనబడుతోంది. కొత్త కేసులు తగ్గి.. రికవరీలు పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసుల కొండ కరుగుతోంది.......

Published : 10 Jun 2021 20:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో తీవ్ర కల్లోలం రేపిన కరోనా వైరస్‌ క్రమంగా అదుపులోకి వస్తున్నట్టు కనబడుతోంది. కొత్త కేసులు తగ్గి.. రికవరీలు పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసుల కొండ కరుగుతోంది. మరోవైపు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ క్రమంగా పుంజుకొంటోంది. డిసెంబర్‌ కల్లా 200 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి వస్తాయని జేపీ నడ్డా వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కొందరిలో వెలుగుచూస్తున్న బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు కేంద్రం మరోసారి రాష్ట్రాలకు అదనంగా ఔషధాలను కేటాయించింది.  కొవిడ్ వేళ ఉపశమనం కలిగించే ఇలాంటి కొన్నివార్తలు మీకోసం..

* దేశంలో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గుతోంది. వరుసగా మూడో రోజూ కొత్త కేసులు ‘లక్ష’ మార్కు దాటలేదు. బుధవారం 20,04,690శాంపిల్స్‌ పరీక్షించగా.. 94,052మందిలో వైరస్‌ ఉన్నట్టు తేలింది. పాజిటివిటీ రేటు 17వ రోజు కూడా 10శాతం కన్నా తక్కువే (4.69శాతం) నమోదు కాగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 5.43కి తగ్గింది. వరుసగా 28వ రోజూ కొత్త కేసుల కన్నా కోలుకున్నవారి సంఖ్యే భారీగా కొనసాగింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 33,79,261 డోసుల టీకాను అందించగా.. ఇప్పటివరకు 24.27కోట్ల డోసులు పంపిణీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది.

*  మన దగ్గర ప్రస్తుతం నెలకు కోటి వ్యాక్సిన్‌ డోసులు ఉత్పత్తి అవుతున్నాయని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు.  ‘‘జులై-ఆగస్టు నాటికి ఆ సామర్థ్యం 6 నుంచి 7కోట్లకు చేరుతుంది.  సెప్టెంబర్‌ నాటికి నెలకు 10కోట్ల డోసులు ఉత్పత్తి అవుతాయని భావిస్తున్నాం. గతంలో రెండు సంస్థలే టీకాను ఉత్పత్తి చేసేవి.. ఆ సంఖ్య ప్రస్తుతం 13కి చేరింది. డిసెంబర్‌ నాటికి ఆ సంఖ్య  19కి చేరుతుంది. డిసెంబర్‌ కల్లా 200 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులోకి వస్తాయి. ఇదే మా రోడ్‌ మ్యాప్‌’’ అని నడ్డా వివరించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో భాజపా నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన గురువారం పాల్గొన్నారు.

* టీఎస్‌ ఎంసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఎంసెట్‌ కన్వీనర్‌  గోవర్దన్‌ తెలిపారు. తెలంగాణ ఎంసెట్‌కు ఇప్పటివరకు 2,20,027 దరఖాస్తులు, ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు 1,46,541, అగ్రికల్చర్‌కు 73,486 దరఖాస్తులు వచ్చాయని వివరించారు.

* పిల్లలకు పాలిచ్చే తల్లులకు కూడా కరోనా టీకా సురక్షితమేనని కేంద్రం వెల్లడించింది. వ్యాక్సినేషన్‌ ద్వారా కరోనాపై పోరాడేందుకు వారి శరీరంలో యాంటీబాడీలు తయారవ్వడమే కాకుండా తల్లి పాలద్వారా అవి పిల్లలకు కూడా అందుతాయని తెలిపింది.

* టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే అథ్లెట్లకు జులై ప్రారంభానికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయనున్నట్టు  భారత క్రీడల ముఖ్య అధికారి నరేందర్‌ బాత్రా వెల్లడించారు. జులై 23 నుంచి ఆగస్టు 8వరకు జరిగే ఈ ఒలింపిక్స్‌కు భారత్‌ నుంచి దాదాపు 200 మంది అథ్లెట్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది వెళ్లనున్నారు.

* లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ఏర్పాటు చేసిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సీనియర్  నేత జానారెడ్డి ప్రారంభించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని BLR బ్రదర్స్ ఆధ్వర్యంలో 1200 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలు అందించారు. కరోనాను నిర్మూలనకు ప్రభుత్వం పాటు పడుతున్నప్పటికీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొవిడ్  బాధితులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో BLR బ్రదర్స్  గత కొన్నిరోజులుగా అండగా నిలుస్తున్నారని తెలిపారు.

* కరోనా నుంచి కోలుకున్నప్పటికీ వెంటాడుతున్న బ్లాక్ ఫంగస్‌ చికిత్సలో వాడే ఆంఫోటెరిసిన్‌-బి వయల్స్‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అదనంగా 1.7లక్షల వయల్స్‌ కేటాయించింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. కర్ణాటకకు అదనంగా 15,520 వయల్స్‌ను కేటాయించడంతో ఇప్పటివరకు ఆ రాష్ట్రానికి మొత్తంగా ఇచ్చిన ఇంజెక్షన్ల సంఖ్య 40,470కి చేరిందని పేర్కొన్నారు.

* వ్యాక్సిన్ల కొరతతో అల్లాడుతున్న తమిళనాడుకు 95వేల కొవాగ్జిన్‌ డోసులు అందడం ఊరటనిస్తోంది. హైదరాబాద్‌ నుంచి చెన్నై విమానాశ్రయానికి గురువారం ఉదయం 95,120 డోసులు చేరాయి. రాష్ట్రంలో కరోనా టీకా నిల్వలు లేకపోవడంతో 36 జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ నిలిపివేసినట్టు సమాచారం. ఒక్క చెన్నైలో మాత్రమే 1060 డోసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు.

* కరోనా ప్రభావంతో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలుగా మారిన చిన్నారులకు అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వశర్మ అండగా నిలిచారు. అలాంటి పిల్లలను గుర్తించి సాయం చేసేందుకు వీలుగా శిశుసేవా పథకం అన్నిజిల్లాల్లో అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన 11మంది చిన్నారులకు ఆర్థిక సాయానికి సంబంధించిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లు, చెక్కులను అందజేశారు. ఒక్కొక్కరికి రూ. 7,81,002 ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, ల్యాప్‌టాప్‌, ఈ నెలకు సాయంగా రూ.3,500 అందజేశారు.

* దిల్లీలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. 75,133 శాంపిల్స్‌ పరీక్షించగా.. 305 కొత్త కేసులు; 44 మరణాలు నమోదయ్యాయి. దేశ రాజధానిలో పాజిటివిటీ రేటు 0.41శాతంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు