Published : 11 Jun 2021 20:03 IST

Corona: ఊరటనిచ్చే ‘పాజిటివ్‌’ న్యూస్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా వైరస్‌ కొత్త కేసుల గ్రాఫ్‌ దిగొస్తోంది. రికవరీలు పెరగడంతో యాక్టివ్‌ కేసులు భారీగా తగ్గుతున్నాయి. పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోంది. రికవరీ రేటు దాదాపు 95 శాతానికి చేరింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కాస్త వేగం పుంజుకొంది. మూడు రోజుల్లో రాష్ట్రాలకు మరో 38లక్షల టీకాలు అందుబాటులోకి రానున్నాయి. కరోనా కాలంలో ఉపశమనమిచ్చే ఇలాంటి కొన్ని వార్తలు మీకోసం..

* భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టినట్టే కనబడుతోంది. వరుసగా నాలుగో రోజూ లక్ష కన్నా దిగవనే కొత్త కేసులు నమోదు కొనసాగింది. గత వారంలో కొత్త కేసులు సగటున 31శాతం తగ్గినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌అగర్వాల్‌ వెల్లడించారు. దేశంలో క్రియాశీల కేసులు తగ్గుతున్నాయన్నారు. మే 10 నాటికి 37.45లక్షలు ఉండగా.. ప్రస్తుతం 70శాతం తగ్గి 11.21లక్షలకు చేరాయన్నారు. మరోవైపు, రికవరీ రేటు భారీగా పెరుగుతోంది. మే 3 నాటికి 81.8శాతంగా ఉన్న రికవరీ రేటు స్థిరంగా పెరిగి ప్రస్తుతం 94.9శాతానికి చేరింది. మార్చి నాటికి రోజుకు సగటున 7లక్షలకు పైగా టెస్ట్‌లు చేయగా.. ప్రస్తుతం మే/జూన్‌ నాటికి రోజూ సగటున 19లక్షలకు పైగా పరీక్షలు చేస్తున్నారు.

కరోనాతో అతలాకుతలమై వ్యాక్సిన్‌ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ప్రపంచ దేశాలకు జీ-7 దేశాలు భరోసా ఇవ్వనున్నాయి. 2022 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల డోసుల్ని వివిధ మార్గాల ద్వారా పంపిణీ చేయాలని సభ్య దేశాలు నిర్ణయించనున్నట్టు సమాచారం. అందుకనుగుణంగా ఉత్పత్తి వేగవంతానికి చర్యలు తీసుకొంటున్నట్టు తెలుస్తోంది. ప్రపంచదేశాలు కొవిడ్‌తో అల్లాడుతున్న వేళ ధనిక దేశాలు మిగులు టీకాలను నిల్వ చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఈ జీ7 దేశాల శిగరాగ్ర సదస్సులో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇందులో దాదాపు సగం టీకాలు అమెరికా నుంచే రానున్నాయి.

దేశవ్యాప్తంగా తదుపరి సిరో సర్వేను ఐసీఎంఆర్‌ ప్రారంభిస్తుందని నీతి ఆయోగ్‌ (ఆరోగ్యం) సభ్యుడు వీకే పాల్‌ వెల్లడించారు. రాష్ట్రాలు కూడా తమ స్థాయిల్లో ఈ సర్వేను ప్రోత్సహించాలని కోరారు. ఈ సిరో సర్వే జాతీయ స్థాయిలో కరోనా ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకొనేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. పార్టీలు చేసుకొనేందుకు ఇది సమయం కాదని, అన్ని సమయాల్లోనూ మాస్క్‌లు ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో కొవిడ్‌ కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో 1,24,066 శాంపిల్స్‌ పరీక్షిస్తే.. 1,707 మందికి పాజిటివ్‌గా తేలినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. అలాగే, కరోనాతో నిన్న  16 మంది మరణించారు. 

దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ క్రమంగా పుంజుకొంటోంది. గత 24గంటల్లో 32.7లక్షల డోసులు పంపిణీ చేశారు. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 25.60 కోట్ల డోసులు పంపిణీ చేయగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 24.61కోట్ల డోసుల వినియోగం (వృథాతో కలిపి) జరిగినట్టు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 1,17,56,911 డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రాలకు 38,21,170 డోసులు పంపిణీ చేయనున్నట్టు కేంద్రం వెల్లడించింది.

తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని  శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానంలో పూజలు ప్రారంభమయ్యాయి. కరోనా ఉద్ధృతితో ఏప్రిల్‌ నెలాఖరు నుంచి మూసివేసిన ఈ ఆలయంలో ఈ రోజు నుంచి భక్తులను శుక్రవారం ఉదయం 6గంటల నుంచి అనుమతిస్తున్నట్టు ఆలయ ఈవో వేండ్ర అప్పారావు తెలిపారు. రోజూ ఉదయం 6గంటల నుంచి 11.30గంటల వరకు రోజువారీ దర్శనాలు కొనసాగుతాయన్నారు.

తెలంగాణలో పాలిసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా  ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పాలిసెట్‌ కార్యదర్శి శ్రీనాథ్‌ తెలిపారు. తెలిపారు. రూ.100 ఆలస్య రుసుముతో ఈనెల 20 వరకు, రూ.300 ఆలస్య రుసుముతో ఈనెల 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.

కరోనా ఉందో లేదో 15 నిమిషాల్లోనే తెలుసుకునేందుకు ఉపయోగపడే పరీక్ష కిట్‌ కొవిఫైండ్‌కు ఐసీఎంఆర్‌ ఆమోదం లభించినట్టు మెడ్‌టెక్‌ సంస్థ మెరిల్‌ వెల్లడించింది. ఇంటి వద్ద కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేసుకునేందుకు, కచ్చితమైన ఫలితాన్ని ఇచ్చే కొవిఫైండ్‌ను రూ.250కే విక్రయిస్తామని ఆ సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భట్‌ తెలిపారు. 2 వారాల్లో ఔషధ దుకాణాలు, ఇ-ఫార్మసీల్లోనూ ఇవి అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.

దిల్లీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 77,112 శాంపిల్స్‌ పరీక్షించగా.. 238 మందికి పాజిటివ్‌గా తేలింది. అలాగే, కొత్తగా 24 మంది మరణించగా.. 504 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశరాజధాని నగరంలో 3922 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కొవిడ్‌ పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు కొనసాగుతాయని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. చిక్కమగుళూరు, శివమొగ్గ, దావణగెర, మైసూరు, చమరాజనగర, హస్సన్‌, దక్షిణ కన్నడ, బెంగళూరు రూరల్‌, మాండ్య, బెళగావి, కొడగుల జిల్లాల్లో మినహా మిగతా జిల్లాల్లో జూన్‌ 14న ఉదయం 6గంటల నుంచి జూన్‌ 21 ఉదయం 6గంటల సడలింపులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని