Corona pandemic: నేటి ‘పాజిటివ్‌’ న్యూస్‌!

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేలాదిగా నమోదవుతున్న మరణాలు ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు వ్యాక్సిన్ల కొరత.. ...

Published : 21 May 2021 20:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేలాదిగా నమోదవుతున్న మరణాలు ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు వ్యాక్సిన్ల కొరత.. ఆస్పత్రుల్లో ఔషధాల సమస్య వేధిస్తున్నాయి. రోజురోజుకీ కొత్త కేసులు తగ్గుతున్నా.. మరణాలు పెరుగుతుండటం కలవర పెడుతోంది. మరోవైపు, బ్లాక్‌ ఫంగస్‌ కేసులు కొవిడ్‌ బాధితులను మరింత ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని వార్తలు ఊరట కలిగిస్తున్నాయి. కొవిడ్‌ వేళ... కొన్ని పాజిటివ్‌ వార్తలు మీకోసం.. 

* కరోనా యాంటీ బాడీలను గుర్తించేందుకు డీఆర్‌డీవో కొత్త కిట్‌ను అభివృద్ధి చేసింది. ‘డిప్‌కొవాన్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ కిట్‌ కరోనా ఎక్స్‌పోజర్‌ను అంచనా వేసేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. దిల్లీలోని వాన్‌గార్డ్‌ డయాగ్నొస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీతో కలిసి దీన్ని రూపొందించింది. మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ కిట్‌కు ఏప్రిల్‌లోనే ఐసీఎంఆర్ ఆమోదం లభించింది.

* దేశంలో గత ఆరు రోజులుగా కొత్త కేసుల కన్నా రికవరీ అవుతున్నవారి సంఖ్య భారీగా నమోదవుతోంది. కరోనా ప్రవేశించిన తర్వాత దేశంలోనే తొలిసారి అత్యధికంగా మే 18న 4.22లక్షల మంది కోలుకోవడం విశేషం. మే 17 నుంచి ఇప్పటివరకు రోజువారీగా వస్తున్న కేసులు 3లక్షల లోపు ఉంటుండగా.. రికవరీ అవుతున్నవారి సంఖ్య 3.5లక్షల మందికి పైగా ఉంటుండటంతో క్రియాశీల కేసులు తగ్గుతున్నాయి. 

* కరోనా విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆయుర్వేదం ఆధారిత విధానాలు, పరిష్కారాలను సూచించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ కమ్యూనిటీ సపోర్ట్‌ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. 14443 నంబర్‌ అన్ని రోజుల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఉదయం 6గంటల నుంచి అర్ధరాత్రి వరకు పనిచేస్తుందని.. ఆయుర్వేదం, హోమియోపతి, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపింది. ప్రజలు సంప్రదించి ఆయా రంగాల నిపుణుల సేవలను పొందవచ్చని ఆయుష్‌ శాఖ పేర్కొంది. నిపుణులు కేవలం రోగులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడమే కాకుండా నివారణ చర్యలను సూచిస్తారని, సమీపంలో ఆయుష్‌ సంబంధిత సేవల లభ్యత గురించి కూడా చెబుతారని ఓ ప్రకటనలో వెల్లడించింది. 

* కరోనా సెకండ్‌ వేవ్‌లో  ముఖ్యంగా ఆక్సిజన్‌ అందక ఇబ్బందులు పడుతున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. అందుకే మన శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయిలు తెలిపే పల్స్‌ ఆక్సీమీటర్లు, స్మార్ట్‌ వాచ్‌లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిపోయింది. దీంతో అమాంతంగా వాటి ధరలు పెరిగిపోయాయి. ఈ ఇబ్బందులేవీ లేకుండా సింపుల్‌గా మన ఫోన్‌లోని ఒక యాప్‌తో శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయి, పల్స్‌, శ్వాసక్రియల రేట్లు తెలిసేలా ‘కేర్‌ప్లిక్స్‌ వైటల్స్‌ యాప్‌’అనే యాప్‌ అందుబాటులోకి వచ్చింది. కోల్‌కతాకు చెందిన ‘కేర్‌ నౌ హెల్త్‌కేర్‌’ అనే అంకుర సంస్థ ఈ యాప్‌ను రూపొందించింది. 

* భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ డిమాండ్‌కు సరిపడా డోసులు అందుబాటులోకి రావడం లేదు. వీటిపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం.. అందుబాటులో ఉన్న వనరులను  సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌.జయశంకర్‌ ఈనెల 24 నుంచి ఐదురోజుల పాటు అమెరికాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అమెరికా ప్రభుత్వంతో పాటు వ్యాక్సిన్‌ కంపెనీలతో ఆయన సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. భారత్‌లో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి, వ్యాక్సిన్‌ల కొరత ఏర్పడిన సమయంలో విదేశాంగ మంత్రి అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

* కరోనా సంక్షోభం వేళ ప్రభుత్వం ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు భారతీయ రిజర్వ్‌బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నుంచి భారీగా నిధులు రానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 99,122 కోట్ల మిగులు ద్రవ్యాన్ని ఆర్‌బీఐ కేంద్రానికి డివిడెంట్‌ రూపంలో చెల్లించనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదముద్ర పడింది. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయిన వేళ ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.  

* కరోనా విజృంభణతో ఉక్కిరిబిక్కిరైన దేశ రాజధాని నగరానికి మహమ్మారి నుంచి కాస్త ఉపశమనం కలిగింది. దిల్లీలో ఏప్రిల్‌ మాసంలో దాదాపు 36శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు తాజాగా 4.7శాతానికి తగ్గడం విశేషం. గడిచిన 24గంటల వ్యవధిలో 3009 కేసులు రాగా.. 252 మరణాలు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 4 తర్వాత పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ నమోదుకావడం ఇదే తొలిసారి. 5శాతం కన్నా తక్కువ ఉంటే సేఫ్‌ జోన్‌లో ఉన్నట్టేనని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. 

* కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత్‌కు సహకారం అందించేందుకు ఐఎంఎఫ్‌ ముందుకొచ్చింది. టీకా ప్రచారాన్ని వేగవంతం చేయడంతో పాటు ఆరోగ్య రంగానికి ఆర్థిక వనరులు అందించడం అవసరమని తెలిపింది. కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన పూర్తి సాంకేతిక సహకారం అందిస్తామని ఐఎంఎఫ్‌ ప్రతినిధి జెర్రీ రైజ్‌ తెలిపారు.

* ‘సూపర్‌ స్ప్రెడర్లు’.. తమకు తెలియకుండానే ఏదైనా వ్యాధిని తమ ద్వారా ఎక్కువమందికి వ్యాప్తి చేసే వాహకులను ఇలా పిలుస్తారు. తెలంగాణలో ఈ తరహా సుమారు 7-8 కేటగిరీలకు చెందిన సూపర్‌ స్ప్రెడర్లు (వైరస్‌ వాహకులు) సుమారు 15 లక్షలమంది ఉంటారని అంచనా. ‘సూపర్‌ స్ప్రెడర్లు’గా భావిస్తున్న వ్యక్తులకు తొలుత టీకాలందించడానికి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. దీనివల్ల వ్యాప్తిని చాలావరకూ అరికట్టవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. 

లాలాజలాన్ని పరీక్షించడం ద్వారా కరోనా ఉనికిని ఒక్క సెకనులోనే గుర్తించే వినూత్న సాధనాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలన్నింటిలో ఇదే అత్యంత వేగవంతమైనదిగా పేర్కొన్నారు. అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ సాధనాన్ని రూపొందించారు. కొవిడ్‌ నిర్ధారణకు ప్రామాణిక విధానంగా రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ పాలీమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్‌టీ-పీసీఆర్‌)ను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే దీని ద్వారా ఫలితాన్ని తెలుసుకోవడానికి కొన్ని గంటలు లేదా రోజులు పడుతోంది. ఈ సమస్యను కొత్త విధానం పరిష్కరిస్తుందని పరిశోధనలో పాలుపంచుకున్న మింగాన్‌ షియాన్‌ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు