Corona Pandemic: నేటి ‘పాజిటివ్‌’ న్యూస్‌! 

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేలాదిగా సంభవిస్తున్న మరణాలు ప్రజల్ని కలవరపెడుతున్నాయి. ఇప్పటికే దేశంలో కొవిడ్‌ మృతుల సంఖ్య 3లక్షల మార్కును దాటేసింది. ......

Updated : 24 May 2021 19:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కట్టడికి కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతితో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాలు తీసుకొంటున్న పలు చర్యలు, నిపుణులు చేస్తున్న ప్రకటనలు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. కొవిడ్‌ వేళ కొన్ని పాజిటివ్‌ వార్తలు మీకోసం..

* దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టే కనబడుతోంది. గత 17 రోజులుగా కొత్త కేసులు స్థిరంగా తగ్గుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాలే ఇందుకు ఉదాహరణ. గత 15 వారాలుగా దేశంలో కరోనా పరీక్షలు 2.6రెట్లు పెరగ్గా.. గత రెండు వారాలుగా వీక్లీ పాజిటివిటీ రేటు  తగ్గుముఖం పట్టినట్టు కేంద్ర గణాంకాలు సూచిస్తున్నాయి.

* దేశంలో రాబోయే థర్డ్‌ వేవ్‌లో కరోనా వైరస్‌ చిన్నారులపైనే అధిక ప్రభావం చూపుతోందన్న ఆందోళనల నేపథ్యంలో దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. థర్డ్‌వేవ్‌లో ఈ వైరస్‌ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న సూచనలు ఇప్పటికైతే ఏమీ లేవని స్పష్టంచేశారు. పిల్లలకు అధిక ముప్పు ఉంటుందంటూ వస్తోన్న వార్తలు వాస్తవాల ఆధారంగా చెప్పింది కాదని పిడియాట్రిక్స్‌ అసోసియేషన్‌ పేర్కొంటోందన్నారు. కరోనా వైరస్‌ చిన్న పిల్లలపై ప్రభావం చూపించకపోవచ్చని, ప్రజలు భయపడొద్దని ఆయన సూచించారు. 

* నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఔషధంలో హానికారమైన పదార్థాలేవీ లేవని ఆయుష్‌ విభాగం స్పష్టం చేసింది. ఔషధం కోసం మొత్తం 18 మూలికలు వాడినట్లు తెలిపింది. వాటిపై పూర్తిగా చర్చించామని, వివరాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి తెలిపామని ఆయుష్‌ కమిషన్‌ రాములు మీడియాకు వెల్లడించారు. మరో నాలుగైదు రోజుల్లో పూర్తి నివేదిక వస్తుందన్నారు. ఆ మందుతో లబ్ధి జరిగిందని ఎక్కువ మంది చెబుతున్నారని ఆయన అన్నారు.

* టీకా పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 44 ఏళ్ల వయసు ఉన్న వారు ఎలాంటి ముందస్తు నమోదు లేకుండా ప్రభుత్వ కొవిడ్ వ్యాక్సిన్‌ కేంద్రాల వద్దే ఆన్‌సైట్‌ లేదా వాక్‌-ఇన్‌ (అప్పటికప్పుడు) రిజిస్ట్రేషన్‌ చేసుకొని టీకా వేయించుకోవచ్చని తెలిపింది. వ్యాక్సిన్‌ వృథాను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.

* కొవిడ్‌ రోగులకు చికిత్సలో ఉపయోగించే యాంటీబాడీ కాక్‌టెయిల్‌ (కాసిరివిమాబ్‌, ఇమ్డివిమాబ్‌) భారత మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఔషధ తయారీ సంస్థ రోచ్‌ ఇండియా, సిప్లా సంయుక్తంగా ఈ ఔషధాన్ని మార్కెట్‌లోకి విడుదల చేశాయి. దీని ధర డోసుకు రూ.59,750గా నిర్ణయించినట్లు ఈ సంస్థలు ప్రకటించాయి. తొలి బ్యాచ్‌లో భాగంగా లక్ష ప్యాక్‌లను ప్రస్తుతం మార్కెట్‌లోకి విడుదల చేశారు. జూన్‌ మధ్య కాలం నాటికి రెండో బ్యాచ్‌ ప్యాక్‌లు అందుబాటులోకి తెస్తామని ఆ సంస్థలు ప్రకటించాయి. ఒక్కో ప్యాక్‌ను ఇద్దరు రోగులకు అందించవచ్చు. 

* కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన పలు వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయినా కొత్తరకాలు వెలుగు చూడడం, వ్యాక్సిన్‌ల వల్ల పొందే రోగనిరోధక సామర్థ్యం కొంతకాలం వరకే పరిమితమవుతుందన్న నిపుణుల అంచనాలతో బూస్టర్‌ డోసుల అవసరం ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ సంస్థలు ఇప్పటికే వాటిపై దృష్టి పెట్టాయి. తాజాగా స్వదేశంలో అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ బూస్టర్‌ డోసు ప్రయోగాలను భారత్‌ బయోటెక్‌ ప్రారంభించింది. ఇందుకోసం దాదాపు 190 మందిపై ఆరు నెలలపాటు అధ్యయనం చేపట్టనున్నారు. 

* కరోనా సమయంలో రేషన్‌ దుకాణాల వద్దకు వచ్చి ఆహార ధాన్యాలు తీసుకోలేని వారి విషయంలో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఇంటి వద్దకే వెళ్లి ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు గోవా పౌరసరఫరాల శాఖమంత్రి గోవింద్‌ గౌడె తెలిపారు. దుకాణాల  వద్దకు వచ్చి దాదాపు 90శాతం మంది  ఆహార ధాన్యాలను తీసుకెళ్తున్నారని, 10శాతం మంది మాత్రమే రాలేకపోతున్నారని వివరించారు. వీరిలో కరోనా రోగులు, సీనియర్‌ సిటిజన్లు ఉన్నారని, వారికి తమ సిబ్బందే స్వయంగా ఇంటి వద్దకు వెళ్లి రేషన్‌ అందజేస్తారని మంత్రి వివరించారు. 

* దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్న వేళ టీకాల బ్లాక్‌ మార్కెట్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మై హెచ్చరించారు. ఎవరైనా బ్లాక్‌ మార్కెట్‌కు పాల్పడినట్టు తెలిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో నెలకొన్న టీకా కొరత సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు.  ప్రభుత్వ/ ప్రైవేటు ఆస్పత్రుల్లో కింది స్థాయి ఉద్యోగులు కొందరు వ్యాక్సిన్‌ దుర్వినియోగం/ బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నారన్నారు. దురదృష్టవశాత్తూ వీరిలో కొందరు వైద్యులు కూడా ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇప్పటికే కొన్ని కేసులు నమోదు కాగా.. దర్యాప్తు కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. వ్యాక్సిన్లు ప్రాణాలను కాపాడే ఔషధాలని, వీటి వినియోగం, నిర్వహణపై జవాబుదారీతనం అవసరమన్నారు.

* కరోనా కట్టడికి బిహార్‌లో లాక్‌డౌన్‌ మరోసారి పొడిగించారు. లాక్‌డౌన్‌తో అమలుచేస్తున్న కఠిన ఆంక్షలు సత్ఫలితాలు ఇస్తున్నందున  జూన్‌ 1వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు చేయాలని నిర్ణయించినట్టు సీఎం నీతీశ్‌ కుమార్‌ ట్విటర్‌లో ప్రకటించారు. మరోవైపు, ఉత్తరాఖండ్‌లోనూ లాక్‌డౌన్‌ పొడిగించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కర్ఫ్యూ మంగళవారం ఉదయం 6గంటలతో ముగియనుండటంతో.. లాక్‌డౌన్‌ను జూన్‌ 1 వరకు పొడిగిస్తూ అక్కడి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. 

* దేశంలో కరోనా వైరస్‌ రెండో దశ విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో సరైన వైద్య సదుపాయాలు లేక నిత్యం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో అవసరమైన వైద్యశాలలకు  దశల వారీగా 2 వేల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు (10 లీటర్ల సామర్థ్యం గలవి) అందజేస్తామని బీసీసీఐ సోమవారం ప్రకటించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని