Corona: ఉపశమనం ఇచ్చే ‘పాజిటివ్‌’ న్యూస్‌!

దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. టెస్ట్‌లు పెరుగుతుండగా.. కేసులు, మరణాల్లో తగ్గుదల కనబడుతోంది. కొత్త కేసుల కన్నా రికవరీలు అధికంగా కొనసాగుతుండటంతో యాక్టివ్‌ కేసుల ...

Updated : 23 Jun 2021 19:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. టెస్ట్‌లు పెరుగుతుండగా.. కేసులు, మరణాల్లో తగ్గుదల కనబడుతోంది. కొత్త కేసుల కన్నా రికవరీలు అధికంగా కొనసాగుతుండటంతో యాక్టివ్‌ కేసుల గ్రాఫ్‌ దిగొస్తోంది. మరోవైపు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకొంది. గత మూడు రోజులుగా 50లక్షలకు పైగా డోసుల పంపిణీ జరిగింది. థర్డ్‌వేవ్‌ ముప్పు నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. హైదరాబాద్‌ జంటనగరాల్లో ఎంఎంటీఎస్‌ రైళ్ల పరుగులు మొదలయ్యాయి. కరోనా కాలంలో ఊరటనిచ్చే కొన్ని వార్తలు మీకోసం..

* భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగం పుంజుకొంది. వరుసగా మూడో రోజూ 50లక్షలకు పైగా డోసులు పంపిణీ జరిగినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ సాయంత్రం 4గంటల వరకు 51లక్షల డోసులు పంపిణీ చేశారు. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే ఈరోజు 9 లక్షలకు పైగా డోసులు ఇవ్వడం విశేషం. ఈ నెల 21న దేశ వ్యాప్తంగా 88లక్షల వ్యాక్సిన్‌ డోసుల పంపిణీతో రికార్డు నమోదు చేయగా.. ఈ నెల 22న 54.2లక్షల డోసులు పంపిణీ జరిగింది.

* తెలంగాణలో పాజిటివిటీ రేటు 1 శాతానికి తగ్గిందని, రోజుకు సగటున 1.17లక్షల పరీక్షలు జరుగుతున్నట్టు ప్రజా ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు హైకోర్టుకు నివేదించారు. వ్యాక్సినేషన్‌ కూడా చురుగ్గా కొనసాగుతోందని చెప్పారు. ‘‘రాష్ట్రంలో ఇప్పటివరకు 28.76లక్షల మందికి రెండు డోసులు, 68.48లక్షల మందికి ఒక డోసు పూర్తి చేశాం. ఇంకా 1.94కోట్ల మందికి ఇంకా టీకాలు ఇవ్వాల్సి ఉంది. ఈ నెల 29 నాటికి కేంద్రం నుంచి మరో 10.76లక్షల డోసులు రావాల్సి ఉంది. నీలోఫర్‌ సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా 6వేల పడకలు సిద్ధం చేశాం. పిల్లల వైద్యులతో కమిటీ ఏర్పాటు చేసి సలహాలు తీసుకొంటున్నాం. ఔషధాలు సిద్ధంగా ఉంచాం’’ అని తెలిపారు.

* ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌లో భారీగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నెల 20న ఒక్కరోజే 13.74లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 22వరకు రాష్ట్రానికి 41,10,530 వ్యాక్సిన్‌ డోసులు అందగా.. 39,89,671 డోసులు పంపిణీ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. 

* హైదరాబాద్‌ జంటనగరాల్లో మళ్లీ ఎంఎంటీఎస్‌ రైళ్ల కూత ప్రారంభమైంది. అతితక్కువ ఖర్చుతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఈ రైళ్లు 15 నెలల తర్వాత బుధవారం నుంచి పాక్షికంగా అందుబాటులోకి వచ్చాయి. గతంలో 121 సర్వీసులు తిరగ్గా.. ప్రస్తుతం 10 సర్వీసులే అందుబాటులోకి వచ్చాయి. ఈ రైళ్లలో ప్రయాణాలకు టిక్కెట్లను యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌, ఏటీవీఎంలలో బుకింగ్‌ చేసుకొనేవారికి అదనపు బోనస్‌ను కూడా అందిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

* ప్రజలంతా కరోనా టీకాలు వేసుకునేలా ప్రోత్సహించడంతో పాటు ప్రయాణికులను ఆకర్షించేలా దేశీయ అతిపెద్ద బడ్జెట్‌ విమానయాన సంస్థ ఇండిగో సరికొత్త ఆఫర్‌ ప్రకటించింది. ఒకటి లేదా రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్న కస్టమర్లకు ‘వాక్సీఫేర్‌’ పేరిట ప్రత్యేక డిస్కౌంట్‌లో భాగంగా టికెట్ల బుకింగ్‌ సమయంలో 10 శాతం తగ్గింపును ప్రకటించింది. బుధవారం నుంచే ఇది వర్తింపజేస్తున్నట్టు తెలిపింది. బుకింగ్ సమయంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ సమర్పించడంతో పాటు ప్రయాణ సమయంలోనూ కౌంటర్‌ వద్ద చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. 

* దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసుల కన్నా రికవరీలు పెరగడంతో క్రియాశీల కేసుల కొండ కరుగుతోంది. మంగళవారం 19లక్షలకు పైగా శాంపిల్స్‌ పరీక్షించగా.. 50,848 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. అలాగే, 1358 మరణాలు సంభవించాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య 6.43లక్షలకు దిగొచ్చింది. దేశంలో రికవరీ రేటు 96.56%గా ఉండగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 2.67%గా ఉంది.

* తెలంగాణలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, పరీక్షలకు గరిష్ఠ ధరలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. సాధారణ వార్డులో ఐసోలేషన్‌, పరీక్షలకు రోజుకు రూ.4వేలు, ఐసీయూ గదికి రోజుకు రూ.7500, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గది రూ.9వేలు, పీపీఈ కిట్‌ ధర రూ.273 మించరాదని పేర్కొంది. హెచ్‌ సీటీ రూ.1995, డిజిటల్‌ ఎక్స్‌ రే 1300, సాధారణ జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సుకు కి.మీ.కు రూ.75 (కనీసం రూ.2 వేలు), ఆధునిక జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సుకైతే రూ.125 (కనీసం రూ.3వేలు) చొప్పున నిర్ణయించింది.

* కరోనా సంక్షోభంలో సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు మహారాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. జులై నుంచి వారి వేతనంపై రూ.1000 ఇంక్రిమెంట్‌తో పాటు స్మార్ట్‌ఫోన్‌, రూ.500 కొవిడ్‌ భత్యం ఇవ్వనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపె వెల్లడించారు. దీంతో 68వేల మందికి పైగా కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లకు లబ్ధి చేకూరనుంది. మంత్రి చేసిన ప్రకటనతో తమ డిమాండ్లపై వారం రోజుల నిరసనను ఉపసంహరించుకొంటున్నట్టు తెలిపారు. కరోనాతో మృతిచెందిన ఆశా వర్కర్లకు రూ.50లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది జులైలో మరో రూ.500 ఇంక్రిమెంట్‌ వేయనున్నట్టు మంత్రి హామీ ఇచ్చారు. 

* కరోనా థర్డ్‌ వేవ్‌ మరికొన్ని వారాల్లో రానుందని, పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న నిపుణుల హెచ్చరికలతో బెంగాల్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. జులై నాటికి రాష్ట్రంలో 1300 పీడియాట్రిక్‌ వార్డులు ఏర్పాటు చేయనున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్‌కే ద్వివేది తెలిపారు. బెంగాల్‌లో కరోనా పాజిటివిటీ రేటు 3.61శాతానికి తగ్గిందన్నారు. ఆక్సిజన్‌ లభ్యతకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

* ముంబయిలో అతిపెద్ద మురికివాడ ధారవిలో ఈ రోజు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని బీఎంసీ వెల్లడించింది. ఇప్పటివరకు ధారవిలో 6875 కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 10 యాక్టివ్‌కేసులు ఉన్నాయి. జూన్‌ నెలలో సున్నా కేసులు నమోదు కావడం ఇది మూడోసారి. గతంలో జూన్‌ 14, 15 తేదీల్లో కూడా సున్నా కేసులు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని