Updated : 19 Jun 2021 20:17 IST

Corona: ఉపశమనం ఇచ్చే ‘పాజిటివ్‌’ న్యూస్‌! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు, మరణాలు తగ్గుతుండగా.. రికవరీలు పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను క్రమంగా సడలిస్తున్నాయి. తెలంగాణలో పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దేశంలో యాక్టివ్‌ కేసులు 74 రోజుల కనిష్ఠానికి చేరాయి. ఏపీలో రేపు ఒక్కరోజే 10లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయించడమే లక్ష్యంగా మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టనున్నారు. కరోనా కష్ట సమయంలో ఊరటనిచ్చే కొన్ని వార్తలు మీకోసం.. 

* తెలంగాణలో కరోనా పూర్తిగా అదుపులోకి రావడంతో లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. వైద్యశాఖ అందించిన నివేదికను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంచేసింది. ఆదివారం నుంచి సంపూర్ణంగా లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. జులై 1నుంచి అన్ని కేటగిరీల విద్యా సంస్థలు పూర్తి సన్నద్ధతతో ప్రారంభించాలని ఈ మేరకు విద్యాశాఖను కేబినెట్‌ ఆదేశించింది. లాక్‌డౌన్‌ ఎత్తివేసినంత మాత్రాన ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని, మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని విజ్ఞప్తి చేసింది.

ఏపీలో ఆదివారం ఒక్కరోజే 10లక్షల మందికి టీకా వేయించడమే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలు ఉన్న తల్లులతో పాటు 45 ఏళ్లు దాటిన అందరికీ వ్యాక్సిన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేశారు. వీరితో పాటు విదేశాలకు వెళ్లేవారు కూడా తమ సమీపంలోని టీకా కేంద్రానికి వచ్చి వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని అధికారులు తెలిపారు. 

*  నిజామాబాద్ జిల్లా బికనెల్లి గ్రామ సర్పంచ్ తమ గ్రామాన్ని మాస్క్ ఫ్రీ విలేజ్‌గా ప్రకటించారు. కరోనా మొదటి, రెండో వేవ్‌లో తీసుకున్న పటిష్ట చర్యల వల్లే గ్రామంలో ఎవరికీ కొవిడ్ సోకలేదని సర్పంచ్ నాగకళ తెలిపారు. తమ గ్రామంలో మాస్క్‌లు వాడకుండానే తిరుగుతున్నామని, బయటి గ్రామాలకు వెళ్లేటప్పుడు మాత్రం తప్పకుండా మాస్క్‌లు ధరిస్తున్నట్టు ఆమె స్పష్టం చేశారు. 

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24గంటల వ్యవధిలో 1647 మరణాలే నమోదు కావడం కాస్త ఊరటనిస్తోంది. అలాగే, యాక్టివ్‌ కేసుల సంఖ్య దాదాపు 74 రోజుల కనిష్ఠానికి (7.6లక్షలు) చేరింది. దేశంలో కొత్తగా 60.7 వేల కేసులు నమోదు కాగా.. రికవరీ రేటు 96.16శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.98%కి దిగగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 3.58శాతంగా ఉంది. 

*  రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా 2.87 కోట్ల డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదనంగా మరో 52.26 లక్షల డోసులను రాష్ట్రాలకు మూడు రోజుల్లో పంపిణీ చేయనున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇకపోతే నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా దాదాపు 33లక్షల డోసుల టీకాను పంపిణీ చేశారు.

భారీ వ్యాక్సినేషన్‌తోనే కరోనా మహమ్మారిని కట్టడి చేయగలమన్న నిపుణుల సూచనల నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆ దిశగా చర్యలు వేగవంతం చేస్తున్నాయి. ఇందులో భాగంగా అసోంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ పది రోజుల్లోనే వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ ఆదేశించారు. జులై 1నుంచి కార్యాలయాలన్నీ పూర్తిస్థాయిలో పనిచేసేందుకు వీలుగా ఈ ఆదేశాలు ఇచ్చారు. అలాగే, జూన్‌ 21నుంచి రోజుకు మూడు లక్షల చొప్పున టీకాలను వేయాలన్నారు. నెలలో రాష్ట్రంలోని సగం మందికి వ్యాక్సిన్‌ వేయాలని భావిస్తోంది. అలాగే, ఈ నెలాఖరు నాటికి ప్రభుత్వ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదేశించారు. 

*  కరోనా సెకండ్‌ వేవ్‌ ఉగ్రరూపం దాల్చిన సందర్భంలో ఆక్సిజన్‌ అందక అల్లాడిన రాష్ట్రాలకు ప్రాణవాయువు పంపిణీ చేసేందుకు కేంద్రం ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.అయితే, ఇప్పటివరకు ఈ రైళ్ల ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు 18వేల మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ (ఎల్‌ఎంఓ) సరఫరా చేసినట్టు రైల్వేశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తంగా 32,464 మెట్రిక్‌ టన్నులు సరఫరా చేసినట్టు తెలిపింది. మొత్తం 448 ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోని 1854 ట్యాంకర్లతో 15 రాష్ట్రాలకు ఆక్సిజన్‌ సకాలంలో అందజేసినట్టు పేర్కొంది. తెలంగాణకు 3300 మెట్రిక్‌ టన్నులు, ఏపీకి 4100 మెట్రిక్‌ టన్నుల చొప్పున పంపిణీ చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. 

తెలంగాణలో కరోనా కేసులు మరింత తగ్గాయి. గడిచిన 24గంటలల్లో 1,23,005 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1362 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 10మంది మృతి చెందగా.. 1813మంది కోలుకున్నారు. ప్రస్తుతం 18,568 క్రియాశీల కేసులు ఉన్నాయి.

*  మహారాష్ట్రలోని ఠానే పురపాలక శాఖ అధికారులు హిజ్రాల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు డాక్టర్‌ సురేశ్‌ ఠాకూర్‌ తెలిపారు. మరోవైపు, త్రిపురలో 10, 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి రతన్‌లాల్‌ నాథ్‌ ప్రకటించారు. పరీక్ష రాయాలనుకొనే విద్యార్థుల కోసం పరిస్థితులు సద్దుమణిగాక నిర్వహిస్తామని తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని