Corona: ‘ఊరటనిచ్చే పాజిటివ్‌ న్యూస్‌’

కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. అందుబాటులో ఉన్న మేరకు టీకాలు వేయడంతో పాటు వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నాయి. మరోవైపు......

Updated : 25 May 2021 19:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. అందుబాటులో ఉన్న మేరకు టీకాలు వేయడంతో పాటు వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నాయి. మరోవైపు, భయపెడుతున్న బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు ఔషధాలను సమకూర్చుకోవడంతో పాటు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యతా వర్గాలను గుర్తిస్తూ ముందుకెళ్తున్నాయి. కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో ఉపశమనం కలిగించే కొన్ని వార్తలు మీ కోసం.. 

* దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. 40 రోజుల తర్వాత తొలిసారి రోజూవారీ కొత్త కేసుల సంఖ్య 2 లక్షల దిగువకు నమోదయ్యాయి. మరణాలు కూడా తగ్గడం ఉపశమనం కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా సోమవారం  1,96,427 కొత్త కేసులు రాగా.. 3511 మరణాలు నమోదయ్యాయి. అలాగే, తాజాగా 3.26లక్షల మందికి పైగా కోలుకున్నారు.

* కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేస్తోంది. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలో సూపర్‌ స్ప్రెడర్లకు ప్రత్యేక టీకా డ్రైవ్‌ చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటివరకు 30లక్షల మందిని సూపర్‌ స్ప్రెడర్లుగా గుర్తించారు. మొదట జీహెచ్‌ఎంసీలోని సూపర్‌ స్ప్రెడర్లకు టీకాలు వేయనున్నారు. 

సూపర్‌ స్ప్రెడర్లు వీరే: ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు, బస్‌ డ్రైవర్లు, హోటళ్లు, సెలూన్ల సిబ్బంది, కూరగాయలు, పండ్లు, పూల వ్యాపారులు, హమాలీలు, కిరాణా, మాంసాహార దుకాణదారులు, రేషన్‌ డీలర్లు, ఎల్పీజీ గ్యాస్‌ సరఫరా సిబ్బంది, మద్యం దుకాణాల్లో అమ్మకందారులు తదితరులను సూపర్‌ స్ప్రెడర్లుగా గుర్తించారు.

* ప్రముఖ వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కరోనా పోరులో భాగంగా  తనవంతు సాయం ప్రకటించింది. ఆస్పత్రుల్లో అవసరమైన మెడికల్‌ సామాగ్రి కోసం రూ.8కోట్లు అందించనున్నట్లు ప్రకటించింది.  గురుగ్రామ్‌ (దిల్లీ-ఎన్సీఆర్‌), చంగల్‌పట్టు (తమిళనాడు)లలో ఆరోగ్య మౌలిక వసతుల కల్పనకు కృషి చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

* కరోనాకు తోడు దేశాన్ని కలవరపెడుతున్న బ్లాక్‌ఫంగస్‌ చికిత్సకు వినియోగించే యాంపోటెరిసిన్‌-బి ఔషధాన్ని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం అదనంగా 19,420 వయల్స్‌ కేటాయించింది. మే 21న 23,680 వయల్స్‌ను రాష్ట్రాలకు కేటాయించిన ఔషధాలకు ఇవి అదనమని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖమంత్రి సదానంద గౌడ వెల్లడించారు. తాజాగా కేటాయించిన వాటిలో ఏపీకి 1840 వయల్స్‌ కేటాయించగా.. తెలంగాణకు 700 వయల్స్‌ కేటాయించారు. 

* ప్రైవేటు సంస్థల్లో వ్యాక్సినేషన్‌కు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అనుమతి ఇచ్చింది. తమ సిబ్బందికి పని ప్రదేశాల్లోనే టీకాలు వేసేందుకు ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చింది. వ్యాక్సినేషన్‌కు ప్రైవేటు ఆస్పత్రులతో సంస్థలు అనుసంధానం కావాలని అధికారులు సూచించారు. 18 ఏళ్లు నిండిన వారి వివరాలు కొవిన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు. 

* మద్యం తాగి వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు పోలీసులు శ్వాస పరీక్ష నిర్వహిస్తుంటారు కదా..! అదే తరహాలో ఒక్క నిమిషంలోనే కొవిడ్‌-19ను గుర్తించే ఓ వినూత్న సాధనాన్ని సింగపూర్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది ఒక వ్యక్తి శ్వాసను విశ్లేషించి, కరోనా వైరస్‌ ఆనవాళ్లను పట్టేస్తుంది. ఈ పరీక్షకు సింగపూర్‌ ప్రభుత్వం సోమవారం తాత్కాలిక అనుమతి మంజూరు చేసింది. ఈ సాధనాన్ని అభివృద్ధి చేసిన బృందంలో భారత సంతతికి చెందిన ప్రొఫెసర్‌ టి.వెంకీ వెంకటేశన్‌ కూడా ఉండటం విశేషం.

* కరోనా నియంత్రణకు ఉపయోగించనున్న 2డీజీ ఔషధం వచ్చే నెల మొదటి వారంలో అందుబాటులోకి వస్తుందని డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ ఛైర్మన్‌ తనకు హామీ ఇచ్చారని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ఓ నెటిజన్‌ ట్విటర్‌లో అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు.  2డీజీ ఇంకా మార్కెట్లోకి రాలేదని తెలిపారు.

* కరోనా వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయిన తమ సంస్థ ఉద్యోగుల కుటుంబాలకు టాటా స్టీల్స్‌ అండగా నిలుస్తోంది. కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు సామాజిక భద్రతను కల్పించనున్నట్టు తెలిపింది. ఉద్యోగి రిటైర్మెంట్‌ వయస్సు వచ్చే వరకు అతడు తన చివరి నెల వేతనం రూపంలో తీసుకొన్న మొత్తాన్ని ఆ కుటుంబానికి ప్రతి నెలా ఇవ్వనున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే, కంపెనీలో పనిచేస్తూ కొవిడ్‌తో మరణించిన ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల పిల్లలు గ్రాడ్యుయేషన్‌ వరకు చదివేందుకు అవసరమైన మొత్తాన్ని కంపెనీయే భరించనుంది. 

* కరోనా ఉగ్రరూపంతో క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పలు ఉద్దీపనలు ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం. కరోనా సెకండ్‌ వేవ్‌లో తీవ్రంగా ప్రభావితమైన రంగాలను ఆదుకొనేందుకు కేంద్రం మరో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్నట్టు బ్లూమ్‌బర్గ్‌ కథనం పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో పాటు పర్యాటకం, విమానయానం, ఆతిథ్యరంగాలకు ఉద్దీపనలు ప్రకటించేందుకు కేంద్ర ఆర్థికశాఖ ప్రతిపాదనలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.

* కరోనా నియంత్రణ టీకాలు వేయించుకున్నవారినే పలు దేశాలు అనుమతిస్తున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్య, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారికి (18 నుంచి 45 ఏళ్ల లోపువారికి) ముందుగా వ్యాక్సిన్‌ వేయించేలా వారిని ప్రాధాన్యతా జాబితాలో చేర్చింది. వీరితో పాటు ప్రభుత్వ శాఖలకు చెందిన మరో 10 వర్గాలను కూడా ఈ ప్రాధాన్యతా జాబితాలో చేరుస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని