Updated : 22 Jun 2021 20:51 IST

Corona: ఊరటనిచ్చే ‘పాజిటివ్‌’ న్యూస్‌! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుతోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య దిగొస్తుండగా.. రికవరీ కేసుల పెరుగుదల కొనసాగుతోంది. మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరందుకుంది. నిన్న ఒక్కరోజే 88లక్ష టీకాలు పంపిణీ చేసి భారత్‌ రికార్డు సృష్టించింది. రాష్ట్రాల వద్ద ఇంకా 2.14కోట్ల డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. కొవిడ్ సమయంలో ఊరటనిచ్చే కొన్ని వార్తలు మీకోసం..

* ఫార్మా దిగ్గజ కంపెనీ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా కరోనా వైరస్‌పై 77.8శాతం సమర్థతతో పనిచేస్తున్నట్టు మూడో దశ క్లినికల్‌ ట్రయిల్స్‌లో తేలినట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. దేశ వ్యాప్తంగా 25,800మంది వాలంటీర్లపై మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. ఈ ప్రయోగాల సమాచారాన్ని గత వారం భారత్‌ బయోటెక్‌ డీసీజీఐకి సమర్పించింది. ఆ వివరాలను నిపుణుల కమిటీ ఈరోజు సమీక్షించింది. కొవాగ్జిన్‌ మూడో దశ ప్రయోగాల్లో కొవిడ్‌పై 77.8% ప్రభావశీలత కనబరిచినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

* కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గుతోంది. కొత్తగా16.6లక్షల శాంపిల్స్‌ పరీక్షించగా.. 42,640 మందిలో వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో 91 రోజుల తర్వాత తొలిసారి కొత్త కేసులు 50వేల దిగువకు చేరాయి. కొవిడ్‌ మరణాలు కూడా తగ్గుదల కొనసాగుతోంది. సోమవారం 1167 మంది కొవిడ్‌తో మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.56శాతంగా ఉంది. 79 రోజుల తర్వాత యాక్టివ్‌ కేసులు  7లక్షల దిగువకు యాక్టివ్‌ కేసులు చేరాయి. కొత్త కేసుల కన్నా రికవరీ అయినవారి సంఖ్య వరుసగా 40వ రోజు కూడా కొనసాగింది. రికవరీ రేటు 96.49గా ఉంది. 

జీహెచ్‌ఎంసీ పరిధిలో వ్యాక్సినేషన్‌ కేంద్రాలను పెంచారు. మరో 40 కేంద్రాల్లో టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం టీకా కేంద్రాల సంఖ్య 100కి చేరింది. ఈ రోజు హైదరాబాద్‌లో 48,091మందికి వ్యాక్సిన్లు వేయగా.. ఇప్పటివరకు 9,34,852మందికి వేసినట్టు అధికారులు వెల్లడించారు.

* ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు కొత్తగా వెలుగు చూసిన అన్ని కరోనా రకాల వేరియంట్ల నుంచి స్పుత్నిక్‌ V టీకా రక్షణ కల్పిస్తోందని టీకా అభివృద్ధి సంస్థ గమలేయా ప్రకటించింది. టీకా తీసుకున్న తర్వాత అభివృద్ధి చెందే యాంటీబాడీలు అన్ని  వేరియంట్లపైనా పనిచేస్తున్నాయని తెలిపింది. కొత్త రకం వేరియంట్లపై వ్యాక్సిన్లు ఏమేరకు పనిచేస్తున్నాయనే విషయంపై చర్చ నడుస్తోన్న తరుణంలో స్పుత్నిక్‌ V ఊరటనిచ్చే విషయాన్ని తెలిపింది. మరోవైపు, భారత్‌లో వినియోగంలో ఉన్న కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు కూడా డెల్టా వేరియంట్‌ నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

* కరోనాపై పోరాటంలో పలు సంస్థలు అండగా నిలుస్తున్నాయి. అశోక్‌ లేలాండ్‌, అపోలో టైర్స్‌ సంస్థలు సంయుక్తంగా ఓ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాయి. ట్రక్‌ డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులకు కరోనా సంబంధమైన అంశాలు,  వ్యాక్సినేషన్‌ విషయంలో సలహాలు ఇచ్చేందుకు వీలుగా హెల్ప్‌ లైన్‌ను ఏర్పాటు చేసినట్టు ఆ సంస్థలు ప్రకటించాయి. తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ, అస్సామీ మొత్తం ఐదు భాషల్లో భాషల్లో సేవలు అందుబాటులో ఉంటాయని, టెలీరాడ్‌ ఫౌండేషన్‌ సాంకేతిక భాగస్వామ్యాన్ని అందిస్తోందని  పేర్కొంది. ట్రక్కు డ్రైవర్లు లేదా వారి కుటుంబ సభ్యులెవరైనా కరోనా వైరస్‌, వ్యాక్సినేషన్‌పై 7028105333 నంబర్‌ను  సంప్రదించి వైద్య సిబ్బంది సలహాలు తీసుకోవచ్చని తెలిపింది. 

ఫైజర్‌ టీకా వినియోగం కోసం భారత ప్రభుత్వంతో త్వరలోనే ఒప్పందం కుదురుతుందని ఆ సంస్థ సీఈఓ ఆల్బర్ట్‌ బౌర్లా వెల్లడించారు. దీంతో అత్యవసర వినియోగం కింద మరికొన్ని రోజుల్లోనే భారత్‌లో తమ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ తుది దశకు చేరినట్టు తెలిపారు. భారత్‌లో ఇప్పటికే మూడు వ్యాక్సిన్‌లు వినియోగంలో ఉన్నప్పటికీ వ్యాక్సిన్‌ల కొరత వేధిస్తోంది. ఈ సమయంలో విదేశీ టీకాలకు అనుమతి ఇవ్వడం ద్వారా ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చని  కేంద్రం భావిస్తోంది. 

లాక్‌డౌన్‌ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కళాకారులకు కర్ణాటక సీఎం యడియూరప్ప ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. రూ.6.23 కోట్ల ప్యాకేజీలో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 20వేల మంది కళాకారులకు ఒక్కొక్కరికి రూ.3వేలు చొప్పున అందించనున్నారు. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నట్టు సీఎంవో ఓ ప్రకటనలో వెల్లడించింది. 

రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ఇంకా 2.14 కోట్ల డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రాలకు కేంద్రం 29.35 కోట్ల డోసులు సమకూర్చగా.. రానున్న మూడు రోజుల వ్యవధిలో మరో 33,80,590 డోసులు అదనంగా సమకూరుస్తామని తెలిపింది. 

జూన్‌ 15 నుంచి 21 మధ్య వారంలో 5శాతం కన్నా తక్కువ పాజిటివిటీ రేటు 553 జిల్లాల్లో ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. జూన్‌ 20 నాటికి కేవలం 135 జిల్లాల్లోనే 100కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నట్టు గుర్తించామంది. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 88.09లక్షల డోసుల టీకాను పంపిణీ చేసినట్టు తెలిపింది. 

ప్రపంచ దేశాలకు 5.5కోట్ల డోసుల కొవిడ్‌ టీకాను కేటాయించనున్నట్టు అమెరికా ప్రకటించింది. ఇందులో భారత్‌ సహా బంగ్లాదేశ్ వంటి ఆసియా దేశాలకు 1.6కోట్ల డోసులు ఇస్తామని తెలిపింది. ఇప్పటికే 2.5కోట్ల డోసులను వివిధ దేశాలకు కేటాయించింది. తాజా ప్రకటనతో ఆ కేటాయింపు 8 కోట్ల డోసులకు చేరనుంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని