Afghanisthan: హఠాత్తుగా వచ్చి మాపై దాడి చేశారు

కల్లోలిత అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఆరాచకాలు రోజురోజుకీ పేట్రేగిపోతున్నాయి

Published : 27 Aug 2021 01:41 IST

ఇద్దరు జర్నలిస్టులపై తాలిబన్ల ఆరాచకం

కాబుల్‌: కల్లోలిత అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఆరాచకాలు రోజురోజుకీ పేట్రేగిపోతున్నాయి. కాబుల్‌ విమానాశ్రయంలో జరిపిన కాల్పుల కారణంగా చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికన్‌ సైన్యాలకు సహకరించిన విలేకరులపై కూడా దాడికి దిగుతున్నారు. తాజాగా కాబుల్‌లో ఇద్దరు విలేకరుల మీద దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ వార్తా సంస్థలో పనిచేసే రిపోర్టర్‌ జియార్‌ యాద్‌, కెమెరామెన్‌పై దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని జియార్‌ యాద్‌ తన ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

‘విధి నిర్వహణలో భాగంగా కాబుల్‌కు వెళ్లాను. అక్కడ తాలిబన్లు మాపై దాడి చేశారు. కెమెరాలు, సాంకేతికపరికరాలు, ఫోన్లు లాక్కొన్నారు. కొంతమంది మేము చనిపోయినట్లు ప్రచారం కూడా చేశారు’ అని తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్నారు. ‘తాలిబన్లు హఠాత్తుగా వచ్చి మమ్మల్ని ఎందుకు కొట్టారో ఇప్పటికీ తెలియట్లేదు. ఈ విషయాన్ని తాలిబన్ల నాయకులకు చెప్పాను. అయితే, వారిని ఇంకా అరెస్టు చేయలేదు. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛకు తీవ్రమైన ముప్పు’ అని జియార్‌ తెలిపారు.

ఇదిలా ఉండగా తాలిబన్లు ఈ ఘటనపై స్పందించారు. దీన్ని తీవ్రమైన సంఘటనగా పరిగణించి విచారిస్తామన్నారు. ఈ విషయాన్ని భద్రతా సంస్థలకు తెలియజేశామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిగిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అఫ్గాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక చాలా మంది జర్నలిస్టులు చనిపోయారు. రాయిటర్స్‌ చీఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న భారత్‌కు చెందిన దానిశ్‌ సిద్దీఖీ.. అఫ్గాన్‌ దళాలు, తాలిబన్ల మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. జర్నలిస్టుల ఇళ్లపై కూడా తాలిబన్లు దాడికి దిగారు. వారి కుటుంబ సభ్యులను పొట్టనపెట్టుకున్నారు. తాలిబన్లు 1996-2001 మధ్య అధికారంలో ఉన్నప్పుడే టెలివిజన్‌ను, వార్తల ప్రసారాలను నిషేధించారు. అయితే, సామాజిక మాధ్యమాలను, మీడియాను అనుమతిస్తామని తాలిబన్లు వాగ్దానం చేసినప్పటికీ ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని