నిరసనలు వాయిదా వేసి.. చర్చలకు రండి 

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో సాగు చట్టాల వ్యతిరేకంగా ఆందోళనల్ని రైతు సంఘాలు వాయిదా వేసుకోవాలని .....

Updated : 11 Apr 2021 07:26 IST

కొవిడ్ ఉద్ధృతి‌ వేళ రైతులకు కేంద్రమంత్రి తోమర్‌ సూచన

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనల్ని రైతు సంఘాలు వాయిదా వేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ సూచించారు. ఆందోళనలు చేస్తున్న రైతులు కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. సాగు చట్టాలపై రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని తెలిపారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా దిల్లీ సరిహద్దుల్లో నిరసనల్లో పాల్గొంటున్న రైతుల పిల్లలు, వృద్ధుల్ని ఇళ్లకు పంపాలని రైతు సంఘాల ప్రతినిధుల్ని గతంలో అనేకసార్లు కోరినట్టు ఆయన గుర్తుచేశారు. నిరసనలు వాయిదా వేసి ప్రభుత్వంతో చర్చలకు రావాలని కోరారు.

దేశంలో అనేక రైతు సంఘాలతో పాటు ఆర్థికవేత్తలు నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇస్తున్నారన్నారు. కొందరు రైతులు మాత్రమే వీటికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని ఆక్షేపించారు. రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం 11 విడతలుగా చర్చలు జరిపిందని గుర్తు చేశారు. ఈ మూడు చట్టాల్లో రైతులకు సమస్యాత్మకంగా ఉన్న అంశాలపై చర్చించేందుకు, మార్పులు చేసేందుకు తాము సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ రైతు సంఘాలు అంగీకరించడం లేదని తోమర్‌ తెలిపారు. మరోవైపు, కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ దాదాపు నాలుగు నెలలకు పైగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని