Published : 08 Jul 2021 02:11 IST

CPEC: పాక్‌లో కష్టమే..!

 సీపెక్‌పై పెదవి విరిచిన చైనా కంపెనీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: పాక్‌- చైనా స్నేహానికి సీపెక్‌ (చైనా- పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌)ను ఉదాహరణగా చెబుతారు. కానీ, ఇప్పుడు ఆ సీపెక్‌లోని ప్రాజెక్టులే ఇబ్బందుల్లో పడే పరిస్థితి నెలకొంది. ఇక్కడ ప్రాజెక్టులు చేపట్టిన కంపెనీలు తమ కార్యాలయాలను పాక్‌ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భావిస్తున్నాయి. అందులో ఓ కంపెనీ అయిన చైనా హర్బర్‌ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌ (సీహెచ్‌ఈసీ) పలు ఇబ్బందులను గుర్తించి పాక్‌ను వీడే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇది చైనా కమ్యూనికేషన్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి అనుబంధ సంస్థ. 

సీహెచ్‌ఈసీ సంస్థ బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టులో తలమానికంగా భావించే గ్వాదర్‌ పోర్టు పనులను చేస్తోంది. మొత్తం ఎనిమిది అంశాల్లో పాక్‌ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని తెలిపింది. ఇమ్రాన్‌ ప్రభుత్వం తీవ్ర రాజకీయ అస్థిరత్వాన్ని ఎదుర్కోవడం, ఉగ్ర దాడుల కారణంగా సామాజిక అస్థిరత్వం, ఆర్థిక అస్థిరత కారణంగా రుణాలు చెల్లించలేకపోవడం, పాక్‌ కరెన్సీ విలువ కోల్పోవడం, పడిపోతున్న ఫారెక్స్‌ నిల్వలు, చైనా సంస్థలపై భారీగా పన్నులు విధించడం, ప్రాజెక్టులో జాప్యాలు, కొవిడ్‌ నియంత్రణకు పరిమితంగానే చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో సీహెచ్‌ఈసీ పలు సూచనలు కూడా చేసింది. పాక్‌ ప్రజల్లో చైనీయుల ఇమేజ్‌ను పెంచడం, భద్రతా పరమైన చర్యలు చేపట్టడం, చైనీయులకు పాక్‌ చట్టాలపై అవగాహన కల్పించడం వంటివి చేయాలని పేర్కొంది. ఇటీవల చైనాకు చెందిన హెనాన్‌ నార్మల్‌ యూనివర్శిటీ, పీఎల్‌ఏ ఇన్ఫర్మేషన్‌ ఇంజినీరింగ్‌ యూనివర్సిటీ ఒక సర్వే చేపట్టాయి. ఇవి కూడా పాక్‌లో తీవ్ర అస్థిరత నెలకొందని వెల్లడించాయి.

దాదాపు 47 బిలియన్‌ డాలర్లతో చేపట్టిన సీపెక్‌ ప్రాజెక్టు ఖర్చు 2020 నాటికి 62 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటికే పవర్‌ ప్రాజెక్టులు, స్పెషల్‌ ఎకనామిక్ కారిడార్లను సిద్ధం చేశారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌- భారత్‌ సరిహద్దు వెంబడి ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. దీనివల్ల హిందూ మహాసముద్రానికి చేరుకునే మార్గం చైనాకు దక్కుతుంది. సీపెక్‌తో తమ దేశంలో మౌలికవసతులు వృద్ధి చెందుతాయని పాకిస్థాన్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీపెక్‌ భద్రతను చైనా దళాలే చూసుకొంటున్నాయి. దీని రక్షణ కోసం ఇరుదేశాలు 25వేల మంది సైనికులను మోహరించాలని గతంలో నిర్ణయించాయి. చైనా, పాకిస్థాన్‌ ఎస్‌ఎస్‌డీఎన్‌ (స్పెషల్‌ సర్వీసెస్‌ డివిజన్‌ నార్త్‌), ఎస్‌ఎస్‌డీఎస్‌ (స్పెషల్‌ సర్వీసెస్‌ డివిజన్‌ సౌత్‌) బలగాలను సీపెక్‌ వెంబడి మోహరిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ రెండు డివిజన్లలో మొత్తం ఆరుగురు బ్రిగేడియర్లు, పాకిస్థాన్‌ కమాండర్లు, రేంజర్లు, ఫ్రాంటియర్‌ కార్ప్స్, పారామిలిటరీ దళాలు ఉండనున్నాయి. 

మరోపక్క పాక్‌ ప్రభుత్వ అప్పులు ప్రమాదకర స్థాయికి చేరుకొన్నాయని నిపుణులు చెబుతున్నారు. 2020 డిసెంబర్‌ నాటికి అప్పులు 294 బిలియన్‌ డాలర్లకు చేరుకొన్నాయి. ఇది పాకిస్థాన్‌ జీడీపీలో 109 శాతానికి సమానం. దేశీయ రుణదాతలకే 158.9 బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంది. విదేశీ అప్పులు దాదాపు 115 బిలియన్‌ డాలర్లు ఉన్నాయి. పారిస్‌ క్లబ్‌ నుంచి 11 బిలియన్‌ డాలర్లు, వివిధ దేశాల నుంచి 33 బిలియన్‌ డాలర్లు, ఐఎంఎఫ్‌ నుంచి 7 బిలియన్‌ డాలర్లకు పైగా పాక్‌ సమీకరించింది. అంతేకాదు, బాండ్ల రూపంలో కూడా అంతర్జాతీయంగా 12 బిలియన్‌ డాలర్ల నిధులను తీసుకొచ్చింది. ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉండటంతోనే సీహెచ్‌ఈసీ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని