వారి జీవితాలతో ఫుట్‌బాల్‌ ఆడుకోవద్దు.. కేంద్రంపై సుప్రీం ఆగ్రహం

Superem court On NEET:  నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్ష-2021లో చివరి నిమిషంలో కేంద్రం మార్పులు చేపట్టడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.

Updated : 27 Sep 2021 21:38 IST

దిల్లీ: నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ పరీక్ష-2021లో చివరి నిమిషంలో కేంద్రం మార్పులు చేపట్టడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. పరీక్ష విధానంలో చివరి నిమిషంలో మార్పులు చేయడం పట్ల అసహనం వ్యక్తంచేసింది. విద్యార్థుల జీవితాలతో ఫుట్‌బాల్‌ ఆడొద్దని హితవు పలికింది. సంబంధిత అధికారులతో చర్చించి అక్టోబర్‌ 4లోగా సమాధానం ఇవ్వాలని సూచించింది. 41 మంది పీజీ వైద్యులు వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

2018లో నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ (నీట్‌ ఎస్‌ఎస్‌) పరీక్షలో 40 శాతం ప్రశ్నలు జనరల్‌ మెడిసిన్‌ నుంచి, 60శాతం ప్రశ్నలు సూపర్‌ స్పెషాలిటీ విభాగం నుంచి ఇచ్చారు. ఈసారి అన్ని ప్రశ్నలూ జనరల్‌ మెడిసిన్‌ నుంచి ఇచ్చే విధానాన్ని చివరి నిమిషంలో మార్పులు చేశారని పీజీ వైద్య విద్యార్థులు పిటిషన్‌ వేశారు. జులై 23న నీట్‌ ఎస్‌ఎస్‌-2021ను ప్రకటించగా.. పరీక్షకు (నవంబర్‌ 13, 14) రెండు నెలల ముందు ఆగస్టు 31న పరీక్షా విధానంలో మార్పులు చేపట్టారని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌  బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం కేంద్రంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. యువ వైద్యుల జీవితాలతో ఫుట్‌ బాల్‌ ఆడుకోవద్దని కేంద్రానికి సూచించింది. పరీక్ష విధానంలో వచ్చే ఏడాది నుంచి ఎందుకు మార్పు చేయకూడదని ప్రశ్నించింది. యువ వైద్యులతో సున్నితంగా వ్యవహరించాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని