
Jammu Kashmir: కశ్మీర్ లోయలో మరో ఎన్‌కౌంటర్.. కీలక ఉగ్రవాది హతం
శ్రీనగర్: కశ్మీర్ లోయలో దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద మూకలను భద్రతాదళాలు ఏరిపారేస్తున్నాయి. తాజాగా జమ్ము-కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో జైషే-ఈ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక ఉగ్రవాది శామ్ సోఫీ మరణించినట్లు ఐజీపీ విజయ్‌కుమార్ వెల్లడించారు. పుల్వామాలోని అవంతిపురలో ఉన్న తుల్రాన్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి ఉన్నట్లుగా భద్రతా దళాలకు సమాచారం అందింది. ఈ మేరకు అక్కడ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాద ముఠా నాయకుడిని మట్టుబెట్టామని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఉగ్రవాదులు భద్రతా దళాలపై ఎదురుకాల్పులు జరపడంతో ఓ భద్రతా సిబ్బంది కూడా మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
కశ్మీర్‌లో వరుస ఉగ్ర దాడుల నేపథ్యంలో భద్రతాదళాలు తనిఖీలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దాదాపు 700 మంది ఉగ్ర సానుభూతిపరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం షోపియాన్ జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో అయిదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. సోమవారం బందిపొరా, అనంత్‌నాగ్‌లో నిర్వహించిన ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు.