Published : 03 Jun 2021 20:01 IST

Corona: ఉపశమనం ఇచ్చే ‘పాజిటివ్‌’ న్యూస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. ఈ మహమ్మారికి కళ్లెం వేయడమే లక్ష్యంగా దేశమంతా కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌కు తోడు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొంటున్న పలు చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. దీంతో రోజురోజుకీ పాజిటివిటీ రేటు దిగి వస్తుండగా.. రికవరీ రేటు పెరుగుతుండటం ఊరటనిస్తోంది. మరోవైపు, కొవిడ్‌పై పోరాటంలో పలు సంస్థలు తమ వంతు సహకారం అందిస్తున్నాయి. కొవిడ్‌ వేళ.. ఉపశమనం కలిగించే కొన్ని వార్తలు మీ కోసం.. 

👍 దేశంలో కరోనా వైరస్‌ కొత్త కేసుల తగ్గుదల ట్రెండ్‌ కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజూ 2 లక్షల కేసుల కన్నా తక్కువే నమోదయ్యాయి. మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడం ఊరటనిచ్చే అంశం. మంగళవారం 24గంటల్లో 3,207 మరణాలు నమోదు కాగా.. నిన్న 2,887 కొవిడ్‌ మరణాలు వెలుగుచూడటం గమనార్హం. కొత్త కేసుల కన్నా రికవరీ అయినవారి సంఖ్య 21వ రోజూ భారీగానే కొనసాగింది. మరోవైపు, గడిచిన 24గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 21.59లక్షల టెస్ట్‌లు చేయగా.. 22లక్షలకు పైగా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశారు. 

👍  కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ సత్ఫలితాలను ఇస్తోందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. గడిచిన 24గంటల వ్యవధిలో 2261 కేసులు, 18 మరణాలు నమోదయ్యాయన్నారు. పాజిటివిటీ రేటు 2శాతానికి తగ్గిందని, గ్రామాల్లోనూ పటిష్ట లాక్‌డౌన్‌ అమలు కావాలన్నారు. వచ్చే వారంలో కేసులు తగ్గితే లాక్‌డౌన్‌ ఎత్తివేసే అవకాశం ఉందని తెలిపారు. 

👍 కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంకా అదుపులోకి రాకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం లాక్‌డౌన్‌ని మరోసారి పొడిగించింది. జూన్‌ 14 ఉదయం 6గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని సీఎం యడియూరప్ప వెల్లడించారు. దేశంలోనే అత్యధిక క్రియాశీల కేసులు ఇక్కడే ఉండటం గమనార్హం. 

👍  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ తమ సంస్థ ఉద్యోగులకు ఆపన్నహస్తం అందించింది. కరోనా వేళ తమ ఉద్యోగుల కుటుంబ సభ్యుల భద్రతకు పెద్దపీట వేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాకు బలైన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకుంటామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ భరోసా ఇచ్చారు. ఆ పిల్లలు డిగ్రీ పూర్తి చేసేదాక (దేశంలో ఎక్కడైనా) విద్యకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని, మృతి చెందిన ఆ ఉద్యోగి చివరిసారి తీసుకున్న జీతాన్నే ఐదేళ్ల పాటు వారి కుటుంబానికి అందిస్తామని ఉద్యోగులకు భరోసా ఇస్తూ ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు లేఖ రాశారు.

👍  ఫైజెర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వంటి టీకా తయారీ సంస్థలతో కేంద్ర ప్రభుత్వం టచ్‌లో ఉందని విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. ఈ టీకాలను స్థానికంగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బగాచీ మాట్లాడుతూ.. భారత్‌లో స్పుత్నిక్‌-వి టీకాను వేగవంతంగా ప్రవేశపెట్టడానికి సాయం చేశాం. స్థానికంగా టీకా ఉత్పత్తి చేసే అంశంపై ఫైజర్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మోడెర్నాలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. 

👍  దేశంలో వ్యాక్సిన్‌ కొరత నెలకొన్న వేళ రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ -V టీకా తయారు చేసేందుకు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సంసిద్ధత తెలిపింది. ఇందుకోసం డీసీజీఐని అనుమతి కోరుతూ ఆ సంస్థ దరఖాస్తు చేసింది. అలాగే, స్పుత్నిక్‌ V ప్రయోగ ఫలితాల విశ్లేషణకు కూడా అనుమతి కోరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొవిషీల్డ్‌ టీకాను సీరమ్‌ సంస్థ భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.

👍  కరోనా వైరస్‌పై పోరాటంలో ముందుండి పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రత్యేక నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. సెకండరీ గ్రేడ్‌ కానిస్టేబుల్‌ నుంచి ఇన్‌స్పెక్టర్ల స్థాయి అధికారుల వరకు అందరికీ రూ.5వేలు చొప్పున కొవిడ్‌ ఇన్సెంటివ్ కింద ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్‌ చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,17,184 మంది పోలీసులకు ఈ ప్రోత్సాహకం అందనుంది.

👍 కరోనా విపత్తు వేళ రోగుల చికిత్స కోసం లార్డ్స్‌ చర్చి అందించిన 30 మొబైల్ ఐసీయూ బస్సులను తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హైదరాబాద్‌లో ప్రారంభించారు. వెరా స్మార్ట్ హెల్త్ కేర్ సహకారంతో లార్డ్స్‌ చర్చి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఒక్కో బస్సులో 10 ఆక్సిజన్‌ పడకలు, సీసీటీవీ, లైవ్‌ ఇంటరాక్షన్‌ వీడియో సదుపాయంతో పాటు డ్యూటీ డాక్టర్లు, నర్సింగ్‌ స్టాఫ్‌, టెక్నిషియన్‌ తదితర సిబ్బంది ఉంటారు. అధునాతన సేవలతో కూడిన ఈ బస్సులను సమకూర్చిన లార్డ్స్‌ చర్చికి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

👍  కరోనా వైరస్‌కు కళ్లెం వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకొంటున్నాయి. కరోనా కష్టకాలంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు పలు సలహాలు, సూచనలు ఇచ్చి మార్గదర్శనం చేసేందుకు వీలుగా ఆరు జాతీయస్థాయి హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటుచేసింది. ఆరోగ్యశాఖ జాతీయ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1075; చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098; సీనియర్‌ సిటిజన్స్‌ హెల్ప్‌లైన్‌ 14567; మానసిక సమస్యలు 08046110007; ఆయుష్‌ కౌన్సిలింగ్‌ హెల్ప్‌లైన్‌ 14443తో పాటు MyGov వాట్సాప్‌ హెల్ప్‌ డెస్క్‌ 9013151515లను ఏర్పాటు చేసింది.

👍  కరోనా విలయానికి తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలుగా మిగిలిన చిన్నారుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. వారిని గుర్తించేందుకు ప్రత్యేక సర్వే చేపట్టాలని, వారి ప్రొఫైల్‌తో పాటు అవసరాలను డేటాబేస్‌లో పొందుపరచాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. కొవిడ్‌ బారిన పడి తల్లిదండ్రులు అనారోగ్యం పాలైతే అలాంటి చిన్నారుల కోసం చైల్డ్‌ కేర్‌ సెంటర్‌లు ఏర్పాటు చేయాలంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని