Omicron: 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌.. మొత్తం 101 కేసులు నమోదు

యావత్‌ ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌.. దేశంలో శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్‌ 11 రాష్ట్రాలకు పాకగా మొత్తంగా 101 కేసులు

Updated : 17 Dec 2021 20:41 IST

అనవసర ప్రయాణాలు వద్దని కేంద్రం హెచ్చరిక

దిల్లీ: యావత్‌ ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌.. దేశంలో శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్‌ 11 రాష్ట్రాలకు పాకగా మొత్తంగా 101 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 32, దిల్లీలో 22 కేసులు బయటపడినట్లు తెలిపింది. ఆ తర్వాత రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 8, తెలంగాణలో 8, గుజరాత్‌లో 5, కేరళలో 5 కేసులు వెలుగుచూశాయి. ఆంధ్రప్రదేశ్‌, చండీగఢ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. 

దేశంలో కరోనా తాజా పరిస్థితులపై ఆరోగ్యశాఖ నేడు మీడియాతో మాట్లాడింది. గతంలో బయటపడిన డెల్టా కంటే ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోందని, ఇప్పటికే 91 దేశాలకు ఈ వేరియంట్‌ పాకిందని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల్లో 2.4శాతం ఈ వేరియంట్‌ కేసులేనని తెలిపారు. 

జాగ్రత్త తప్పదు..

ఒమిక్రాన్‌ వ్యాప్తి వేళ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం కోరింది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. అత్యవసరం కాని ప్రయాణాలను కొంతకాలం వాయిదా వేస్తే మంచిదని తెలిపింది. ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఒకచోట గుమిగూడొద్దని కోరింది. పండగల వేళ మరింత అప్రమత్తంగా ఉండాలని, కొత్త సంవత్సర వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని సూచించింది. 

87.6శాతం మందికి తొలి డోసు పూర్తి..

దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 136 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 87.6శాతం మందికి తొలి డోసు పూర్తయినట్లు తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సినేషన్‌ రేటు భారత్‌లోనే ఉందని పేర్కొంది. అమెరికాతో పోలిస్తే 2.8రెట్లు, యూకేతో పోలిస్తే 12.5 రెట్లు అధిక వ్యాక్సినేషన్‌ రేటు భారత్‌లో ఉందని లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 3లక్షలకు పైగా వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఉండగా.. ఇందులో 74శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు.

యాక్టివ్‌ కేసుల్లో 40శాతం ఒక్క కేరళలోనే..

దేశంలో గత 20 రోజులుగా కొత్త కేసుల సంఖ్య 10వేల కంటే దిగువనే ఉందని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. 4 వారాలుగా పాజిటివిటీ రేటు 1శాతం కంటే తక్కువే ఉందన్నారు. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం వైరస్‌ తీవ్రత ఎక్కువగానే ఉందన్నారు. 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5-10శాతం ఉండగా.. 5 జిల్లాల్లో 10శాతానికి పైనే ఉందని తెలిపారు. ఇక యాక్టివ్‌ కేసుల్లో 40శాతం ఒక్క కేరళలోనే ఉన్నట్లు వెల్లడించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని