Himachal pradesh: హిమాచల్‌ను ముంచెత్తుతున్న వర్షాలు.. ధర్మశాలలో 214.6మి.మీ వర్షపాతం

హిమాచల్‌ ప్రదేశ్‌లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. కాంగ్రా జిల్లాలోని ధర్మశాలలో అత్యధికంగా 214.6మి.మీ వర్షపాతం నమోదైంది.

Published : 07 Jul 2024 00:04 IST

శిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ను (Himachal Pradesh) వర్షాలు ముంచెత్తుతున్నాయి. కాంగ్డా జిల్లాలోని ధర్మశాల (Dharmasala), పాలాంపుర్‌లో (Palampur) 200మి.మీ కంటే ఎక్కువ వర్షం కురిసింది. కొండచరియలు విరిగిపడే అవకాశమున్న పలు చోట్ల.. అధికారులు 150 రహదారులను మూసివేశారు. మండి జిల్లాలో 111, సిర్‌మౌర్‌లో 13, శిమ్లాలో 9, చంబా, కులులో 8, కాంగ్డా జిల్లాలో ఒకటి చొప్పున రోడ్లను మూసివేసినట్టు అధికారులు వెల్లడించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రమాదకర పరిస్థితులు తలెత్తితే.. సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని కేంద్రం అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో పలుచోట్ల 334 ట్రాన్స్‌ఫార్మర్లు పాడైనట్లు  తెలిపింది. మొత్తం 55 మంచినీటి సరఫరా పథకాల నిర్వహణకు ఆటంకం ఏర్పడినట్లు పేర్కొంది.

ధర్మశాలలో అత్యధికంగా 214.6మి.మీ వర్షపాతం నమోదు కాగా.. పాలాంపుర్‌లో 212.4మి.మీ,  జోగీందర్‌ నగర్‌లో 169 మి.మీ, కాంగ్డా పట్టణంలో 157.6మి.మీ, బైజ్యనాథ్‌లో 142 మి.మీ, జోత్‌లో 95.2 మి.మీ, నగ్రోటా సూరియన్‌లో 90.2 మి.మీ, సుజన్‌పుర్‌లో 72 మి.మీ, ధౌలకాన్‌లో 70 మి.మీ, ఘమ్‌రోర్‌లో 68.2 మి.మీ, నాదౌన్‌లో 63 మి.మీ, బెర్తిన్‌లో 58.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో శిమ్లా వాతావరణశాఖ జులై 12 వరకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్య పర్యాటక ప్రదేశాలైన డల్హౌసీలో 31 మి.మీ, మనాలీలో 30 మి.మీ,  కౌసౌలిలో 24 మి.మీ వర్షపాతం నమోదైంది.

వాతావరణశాఖ గణాంకాల ప్రకారం.. 2.5 మి.మీ నుంచి 15.5 మి.మీ మధ్య వర్షపాతం నమోదైతే దానిని సాధారణ వర్షపాతంగా పేర్కొంటారు. 15.6మి.మీ- 64.4 మి.మీ మధ్య మోస్తరు వర్షపాతంగా, 64.5 మి.మీ -115 మి.మీ మధ్య నమోదైతే భారీ వర్షపాతంగా, 115.6 మి.మీ నుంచి 204.4 మి.మీ మధ్య నమోదైతే అతి భారీ వర్షపాతంగా, 204.5 కంటే ఎక్కువైతే.. అత్యంత భారీ వర్షపాతంగా పరిగణిస్తారు. ధర్మశాల, పాలాంపుర్‌లో 200 కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనందున ఆయా చోట్ల అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యవసర ప్రతిస్పందన దళాలను సిద్ధం చేసి ఉంచారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నంత వరకు పర్యాటకులు రాకపోవడమే ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని