Corona: 2 నెలల్లో 577 మంది అనాథలయ్యారు..!

కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేస్తోంది. చిన్నారులను అనాధలుగా మారుస్తోంది. వృద్ధులకు అండ లేకుండా చేస్తోంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర మహిళా, శిశు సంక్షేమ.......

Published : 26 May 2021 11:01 IST

మహమ్మారితో తల్లిదండ్రులను కోల్పోతున్న చిన్నారులు

దిల్లీ: కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేస్తోంది. చిన్నారులను అనాథలుగా మారుస్తోంది. వృద్ధులకు అండ లేకుండా చేస్తోంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. వారికి కావాల్సిన సాయాన్ని అందిస్తామని భరోసానిచ్చింది. అందుకోసం నిధులకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేసింది.

ఏప్రిల్‌ 1 నుంచి మే 25 మధ్యాహ్నం 2 గంటల సమయానికి దేశవ్యాప్తంగా కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 577 మంది పిల్లలను గుర్తించినట్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రాపాలిత ప్రాంతాల నుంచి నివేదికలు అందాయని పేర్కొన్నారు. వీరంతా ప్రస్తుతం జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. వారికి అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌ నుంచి కౌన్సిలింగ్‌ ఇప్పంచడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలిపాయి. వీరి బాగోగులపై రాష్ట్ర, జిల్లా యంత్రాంగాల నుంచి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం సమాచారం తెప్పించుకుంటోందని వెల్లడించాయి.

కొవిడ్‌ రెండో ఉద్ధృతిలో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ చిన్నారులను, ఏ ఆసరా లేని వృద్ధులను ఇతర బాధిత వర్గాలను ఆదుకోవాలని కేంద్ర హోంశాఖ ఇటీవల రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. వారికి అవసరమైన వైద్యం, భద్రత కల్పించాలని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ సాయం ఎలా పొందాలో మార్గనిర్దేశం చేయాలని సూచించింది. పోలీస్‌ స్టేషన్లలో మహిళలకు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని