Puja Khedkar: తప్పుడు ధ్రువీకరణలు సమర్పించిన ట్రెయినీ ఐఏఎస్‌.. పూజా వ్యవహారంలో మరో ట్విస్ట్‌

గొంతెమ్మ కోర్కెలతో ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రెయినీ కలెక్టర్‌ పూజాకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఉద్యోగంలో చేరేందుకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 

Updated : 11 Jul 2024 12:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన గొంతెమ్మ కోర్కెలతో మహారాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రెయినీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌ (Puja Khedkar)కు సంబంధించి మరిన్ని వివాదాలు తెరపైకి వచ్చాయి. ఆమె తనకు నేత్ర, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలున్నట్లు అఫిడవిట్‌ ఇచ్చినట్లు ఆంగ్ల పత్రికల్లో కథనాలొస్తున్నాయి. వీటిని నిర్ధరించే తప్పనిసరి వైద్య పరీక్షలకు ఏకంగా ఆరుసార్లు ఆమె డుమ్మా కొట్టారు. 

2022 ఏప్రిల్లో తొలిసారి దిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్‌ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు వైద్య పరీక్షలకు హాజరు కాలేదు. చివరికి ఆరోసారి పిలుపురాగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకొన్నారు. దృష్టి లోపాన్ని అంచనావేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరుకాలేదు. కానీ, ఆమె సివిల్‌ సర్వీసెస్‌ అపాయింట్‌మెంట్‌ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్‌ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్‌ఫర్మ్‌ చేసుకొంది. ఇక పూజా ఓబీసీ ధ్రువీకరణపైనా వివాదాలున్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్‌ వచ్చినా ఐఏఎస్‌ హోదాను పొందగలిగింది. 

పుణెలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహించిన ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారిణి డాక్టర్‌ పూజా ఖేద్కర్‌ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే తన ఆడి కారుకు రెడ్‌-బ్లూ బీకన్‌ లైట్లు, వీఐపీ నంబర్‌ప్లేటు ఏర్పాటుచేసుకున్నారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం’ అనే స్టిక్కర్‌ అమర్చారు. తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బందితోపాటు ఓ కానిస్టేబుల్‌తో అధికారిక ఛాంబర్‌ను కేటాయించాలని పట్టుబట్టారు. అదనపు కలెక్టర్‌ అజయ్‌ మోర్‌ లేని సమయంలో.. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఆయన గదిలో తన నేమ్‌ప్లేట్‌ పెట్టుకొని దాన్నే తన ఛాంబర్‌గా వినియోగించుకొన్నారు. పూజ వ్యవహారాన్ని పుణె కలెక్టర్‌ డాక్టర్‌ సుహాస్‌ దివాసే చీఫ్‌ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆమెను పుణె నుంచి వాశిమ్‌ జిల్లాకు బదిలీ చేశారు. ప్రొబేషన్‌ కాలం పూర్తయ్యేవరకు అక్కడే సూపర్‌ న్యూమరరీ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పూజ వ్యవహరిస్తారని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని