Transcouple: తల్లిదండ్రులైన ట్రాన్స్‌జెండర్ల జంట

కేరళలోని ఓ ట్రాన్స్‌జెండర్‌ (Transcouple) జంట తల్లిదండ్రులయ్యారు. కోజీకోడ్‌లోని (Kerala) ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు ట్రాన్స్‌జెండర్లలో ఒకరు వెల్లడించారు. అయితే, పుట్టింది ఆడబిడ్డా..? మగబిడ్డా..? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

Published : 09 Feb 2023 01:40 IST

కొయ్‌కోడ్‌: మరికొన్ని రోజుల్లోనే తల్లిదండ్రులం కాబోతున్నామని పేర్కొంటూ కేరళకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్‌ జంట (Transcouple) ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జంట ఓ బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. కొయ్‌కోడ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రాన్స్‌జండర్లలో ఒకరైన జహాద్‌ బుధవారం (ఫిబ్రవరి 8న) ఉదయం బిడ్డకు జన్మనిచ్చారు. దేశంలో ఓ ట్రాన్స్‌జెండర్‌ జంట తల్లిదండ్రులు కావడం ఇదే తొలిసారి అవడం విశేషం.

కేరళకు చెందిన జహాద్‌ (Zahhad), జియా పావల్‌ (Ziya Paval) అనే ట్రాన్స్‌జెండర్‌ జంట గత మూడేళ్ల నుంచి కలిసి ఉంటోంది. సంతానం కావాలని భావించిన వారు తొలుత ఎవరినైనా దత్తత తీసుకోవాలని భావించారు. అయితే, నిబంధనలు కఠినంగా ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. తర్వాత జియా పావెల్‌ అబ్బాయిగా మారేందుకు హార్మోన్‌ థెరపీ చేయించుకోవాలని అనుకున్నారు. కానీ, సొంతంగా సంతానం కనాలని నిర్ణయించుకున్న ఆ జంట ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అబ్బాయిగా మారే ప్రయత్నాన్ని అందులో ఒకరు (జహాద్‌) విరమించుకున్నారు.

ఈ క్రమంలో త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నామని ఇటీవల ప్రకటించిన ఈ జంట అందర్నీ ఆశ్చర్యపరిచారు. ‘‘తల్లి కావాలనుకునే నా కల, తండ్రి కావాలనుకునే తన కోరిక త్వరలోనే తీరనునున్నాయి’ అంటూ అందులో ఒకరైన జియా పావల్‌ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. ఇది జరిగిన కొన్ని వారాలకే ఓ బిడ్డకు జన్మనిచ్చి చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం బేబీ, జహాద్‌లిద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. దేశంలో తొలిసారి ఈ తరహా సంఘటన చోటుచేసుకోవడంపై ట్రాన్స్‌జెండర్‌ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని