అధికార మార్పిడి మళ్లీ ట్రంప్‌కేనట!

అమెరికాలో అధికార మార్పిడికి ససేమిరా అంటున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ‘సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌’ మైక్‌ పాంపియో బాసటగా నిలుస్తు్న్నారు. ఎన్నికల్లో తానే గెలిచానన్న ట్రంప్‌ వ్యాఖ్యలకు పరోక్షంగా మద్దతు పలికారు...........

Published : 11 Nov 2020 12:00 IST

సెక్రటరీ ఆఫ్ స్టేట్‌ మైక్‌ పాంపియో వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: అమెరికాలో అధికార మార్పిడికి ససేమిరా అంటున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ‘సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌’ మైక్‌ పాంపియో బాసటగా నిలుస్తున్నారు. ఎన్నికల్లో తానే గెలిచానన్న ట్రంప్‌ వ్యాఖ్యలకు పరోక్షంగా మద్దతు పలికారు. రెండో దఫా అధికారం చేపట్టబోతున్న ట్రంప్‌ పాలనా యంత్రాంగానికి అధికార మార్పిడి సజావుగా సాగుతుందని వ్యాఖ్యానించారు. అందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అమెరికాలో ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం గమనిస్తోందన్నారు. అన్ని ఓట్లను లెక్కించాల్సిందేనన్నారు. విదేశీ వ్యవహారాల్ని బైడెన్ యంత్రాంగానికి అప్పగిస్తారా లేక జాప్యం చేస్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

2000 సంవత్సరంలో ఎన్నికల ప్రక్రియ ముగిసేందుకు 37 రోజులు పట్టిందని పాంపియో గుర్తుచేశారు. అదే తరహాలో ఈసారి కూడా ప్రతి చట్టబద్ధమైన ఓటు లెక్కిస్తారని భావిస్తున్నామన్నారు. చట్టబద్ధంకాని ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దన్నారు. ఓవైపు ఎన్నికల ఫలితాలపై రగడ కొనసాగుతుండగానే.. ఆయన ఏడు రోజుల విదేశీ పర్యటనకు వెళుతున్నట్లు ప్రకటించారు. పశ్చిమాసియాలో సుస్థిర శాంతిస్థాపన దిశగా.. ఆయా దేశప్రభుత్వాలతో చర్చలు జరగనున్నాయన్నారు.

ఎవరూ ఆపలేరు.. బైడెన్‌

మరోవైపు అధికార బదిలీని ఎవరూ ఆపలేరని అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ అన్నారు. ట్రంప్‌ ఓటమిని అంగీకరించకపోవడం ఆయనకే ఇబ్బందికరంగా మారిందన్నారు. 2016లో గెలిచిన తర్వాత.. విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లడం ఇదే మొదటిసారన్నారు. తాను ఇప్పటికే ప్రపంచ దేశాల అధినేతలతో మాట్లాడడం ప్రారంభించానని బైడెన్‌ తెలిపారు. ప్రతి ఒక్కరూ అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థపై బలమైన విశ్వాసం వ్యక్తం చేశారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని