Corona: నీటిలో మృతదేహాలు.. వైరస్‌ సంక్రమిస్తుందా?

నీటిలో మృతదేహాలు లభ్యం కావడం తీవ్రమైన విషయమయినప్పటికీ నీటి ద్వారా కరోనా వైరస్‌ సంక్రమణపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.

Updated : 13 May 2021 12:40 IST

గంగానది ఘటనపై ఆందోళన వద్దంటున్న నిపుణులు

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. నదుల్లో మృతదేహాలు లభ్యం కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా అవి కొవిడ్‌ సోకి చనిపోయిన వారి మృతదేహాలన్న అనుమానం నదీ పరివాహక ప్రాంత ప్రజలకు మరింత భయానికి కారణమయ్యింది. ఈ నేపథ్యంలో నీటిలో మృతదేహాలు లభ్యం కావడం తీవ్రమైన విషయమయినప్పటికీ నీటి ద్వారా కరోనా వైరస్‌ సంక్రమణపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.

నదిలో మృతదేహాలు ప్రవహించే సమయంలో నీటిలో కరోనా వైరస్‌ బలహీన పడడం వల్ల సంక్రమణ చెందే ప్రభావం అంతగా ఉండదని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప్రొఫెసర్‌ సతీష్‌ తారే అభిప్రాయపడ్డారు. ప్రవాహ సమయంలో నీరు శుద్ధికావడం సాధారణ ప్రక్రియలో భాగమని చెప్పారు. అక్కడ కొందరు ప్రజలు తాగునీటి కోసం నేరుగా నది నుంచే తీసుకునే సందర్భాలు ఉన్నాయని.. అలాంటి సందర్భాల్లో కొంత జాగ్రత్త పాటించాలన్నారు. కరోనా వైరస్‌తో దేశం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో గంగా, వాటి ఉపనదుల్లో మృతదేహాలు వేయడం తీవ్రమైన విషయమని పేర్కొన్నారు. అయినప్పటికీ నీటి ద్వారా వైరస్‌ సంక్రమణపై ఇవి గణనీయమైన ప్రభావాన్ని చూపవని పునరుద్ఘాటించారు. గంగా, యమునా నదుల్లో మృతదేహాలను వేయడం కొత్తేమీ కాదని.. కానీ, గత దశాబ్ద కాలం నుంచి వీటి సంఖ్య తగ్గిందన్నారు. ఇవి నదుల కాలుష్యానికి కారణమవుతున్నాయని చెప్పారు.

నీటి ద్వారా వైరస్‌ సంక్రమణపై ఆందోళన అక్కర్లేదని నీతి ఆయోగ్‌ సభ్యులు (ఆరోగ్యం) వీకే పాల్‌ ఈ మధ్యే వెల్లడించారు. ఇలాంటి మాధ్యమాల ద్వారా వైరస్‌ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు విజయ రాఘవన్‌ స్పష్టంచేశారు. ఇద్దరు వ్యక్తులు అతిదగ్గరగా ఉండి మాట్లాడుకునే సందర్భంలో, లేదా అలా మాట్లాడినప్పుడు సూక్ష్మబిందువులు పడిన ప్రదేశాన్ని మరో వ్యక్తి తాకడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే ఆస్కారం ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా నీటిలో డైల్యూషన్‌ కారణంగా సూక్ష్మజీవులు పలుచన పడిపోవడం వల్ల వైరస్‌ సంక్రమణ ప్రమాదం తక్కువేనని పేర్కొన్నారు.

బిహార్‌లోని బక్సర్‌ జిల్లాలో గంగానదిలో దాదాపు 71 మృతదేహాలు కొట్టుకువచ్చిన విషయం తెలిసిందే. అవి కొవిడ్‌ సోకి మరణించిన వారి మృతదేహాలనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో నదీ పరివాహక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నీటిలో వైరస్‌ వ్యాప్తి ప్రమాదం తక్కువేనని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని