ఈ టాయిలెట్స్‌ బహు విచిత్రం!

పుర్రెకో బుద్ధి.. చిహ్వాకో రుచి అని పెద్దలు అన్నారు. ఎవరి ఆలోచనలు వారికుంటాయి. అయితే అవి బయటపడినప్పుడే వారి సృజన ఎలాంటిదో తెలుస్తుంది. పై ఫొటో కనిపిస్తున్న ఆ టాయిలెట్‌ కూడా ఒకరి సృజనాత్మకతకు రూపం. దీని గురించి తెలుసుకుంటే

Updated : 21 Aug 2020 12:11 IST

జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అని పెద్దలు అంటుంటారు. ఎవరి ఆలోచనలు వారికుంటాయి. అయితే అవి బయటపడినప్పుడే వారి సృజన ఎలాంటిదో తెలుస్తుంది. పై ఫొటో కనిపిస్తున్న ఆ టాయిలెట్‌ కూడా ఒకరి సృజనాత్మకతకు రూపం. దీని గురించి తెలుసుకున్న తర్వాత ‘ముందు హవ్వా.. ఇదేం దరిద్రపు టాయిలెట్’ అంటారు. ఆ తర్వాత ‘భలే ఉందే’ అని మెచ్చుకుంటారు.

జపాన్‌.. సృజనాత్మకత, పరిశుభ్రతకు పెట్టింది పేరు. ఏం చేసినా కొత్తగా.. విభిన్నంగా చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి యత్నమే ఇది. ఇటీవల నిప్పాన్‌ ఫౌండేషన్‌ అనే సంస్థ పబ్లిక్‌ టాయిలెట్స్‌ వల్ల కలిగే ఇబ్బందులను గమనించింది. పబ్లిక్‌ టాయిలెట్స్‌ రూమ్‌లోకి వెళ్లాలంటే పరిశుభ్రంగా ఉందో లేదో అని అనుమానం ఉంటుంది. అలాగే అక్కడికి వెళ్లాక లోపల ఎవరైనా ఉన్నారో లేదో తెలుసుకోవడం మరింత ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. వీటికి పరిష్కారం చూపుతూ నిప్పాన్‌ ఫౌండేషన్‌ టోక్యోలోని షిబుయా ప్రాంతంలో 17 చోట్ల వినూత్న టాయిలెట్స్‌ నిర్మించ తలపెట్టింది. స్థానిక ప్రభుత్వం సహకారంతో 16 మంది ఆర్కిటెక్చర్లకు ఈ టాయిలెట్స్‌ డిజైన్‌ పని అప్పగించింది. ఇటీవల నాలుగు డిజైన్లు ఖరారై.. పలు చోట్ల ఈ టాయిలెట్స్‌ను నిర్మించేశారు. వాటిలో అందరినీ ఆకట్టుకుంటున్న టాయిలెట్‌.. ఆర్కిటెక్చర్‌ షిగెరు బాన్‌ రూపొందించిన ‘ట్రాన్స్‌పరెంట్‌ టాయిలెట్‌’.

ట్రాన్స్‌పరెంట్‌ టాయిలెట్‌.. పేరుతోనే దీన్ని ఎలా నిర్మించారో అర్థమైపోతుంది. నిజమే ఈ టాయిలెట్‌ గోడల స్థానంలో ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన రంగుల అద్దాలను అమర్చారు. ఇవి పారదర్శకంగా ఉంటాయి. బయట నుంచి లోపలి దృశ్యాలు.. లోపలి నుంచి బయట దృశ్యాలు కనిపిస్తాయి. అయితే ఎవరైనా లోపలికి వెళ్లి లాక్‌ వేయగానే ట్రాన్సపరెంట్‌ అద్దాలు కాస్త పూర్తి రంగులోకి మారిపోతాయి. దీని వల్ల బయట వాళ్లకు లోపల దృశ్యాలు కనిపించవు. ఎప్పుడైతే అన్‌లాక్‌ చేస్తారో అప్పుడు మళ్లీ అద్దాలు పారదర్శకంగా మారతాయి. అంటే అద్దం పూర్తి రంగులోకి మారితే టాయిలెట్‌ రూమ్‌లో ఎవరో ఉన్నారని అర్థం. పారదర్శకంగా ఉంటే టాయిలెట్స్‌ ఎంత శుభ్రంగా ఉన్నాయో బయట నుంచే చూడొచ్చు. నిప్పాన్‌ ఫౌండేషన్‌ పేర్కొన్న రెండు సమస్యలకు ఈ టాయిలెట్స్‌ పరిష్కారం చూపినట్టే ఉంది కదా! వీటిని ప్రస్తుతం రెండు కమ్యూనిటీ పార్కుల్లో ఏర్పాటు చేశారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని