దిల్లీలో తీవ్ర భూప్రకంపనలు.. పరుగులు తీసిన ప్రజలు

Earthquakes tremors: దేశ రాజధాని దిల్లీలో మంగళవారం తీవ్ర భూప్రకంపనలు సంభవించాయి. పొరుగున ఉన్న నేపాల్‌లో వరుస భూకంపాలతో ఉత్తర భారత్‌లోని పలు చోట్ల ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

Updated : 03 Oct 2023 16:36 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో మంగళవారం తీవ్ర భూప్రకంపనలు (strong tremors) సంభవించాయి. పొరుగున ఉన్న నేపాల్‌లో గంట వ్యవధిలో వరుసగా నాలుగు భూకంపాలు (Earth quake) సంభవించాయి. దీంతో మంగళవారం మధ్యాహ్నం సమయంలో దిల్లీ- ఎన్‌సీఆర్‌ (Delhi-NCR) పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు భూమి బలంగా కంపించింది. ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉత్తర భారతదేశంలోని పలు చోట్ల ఈ ప్రకంపనలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ, హాపుర్‌, అమ్రోహా, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.

నేపాల్‌లో ఈ మధ్యాహ్నం 2.25 ప్రాంతంలో తొలిసారి భూకంపం సంభవించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెస్మాలజీ గుర్తించింది. తొలుత అది 4.6 తీవ్రతతో రికార్డయ్యింది. పది కిలోమీటర్లు లోతులో అది కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్‌సీఎస్‌ పేర్కొంది. ఇది గుర్తించిన అరగంటలోపే.. మధ్యాహ్నం 2.51 గంటలకు అంతకంటే ఎక్కువగా 6.2 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది. ఇది భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్‌సీఎస్‌ గుర్తించింది. ఆ తర్వాత మధ్యాహ్నం 3.06, 3.19 గంటలకు మరో రెండుసార్లు స్వల్ప తీవ్రతతో భూమి కంపించినట్లు ఎన్‌సీఎస్‌ తెలిపింది.

‘రామసేతు’ వద్ద గోడ నిర్మించాలని PIL.. సుప్రీం కోర్టు ఏమందంటే..?

రెండోసారి చోటుచేసుకున్న భూకంపం తర్వాత దిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లు, ఆఫీసుల్లో ఉన్న ఫ్యాన్లు, లైట్లు ఊగాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకంపనలపై దిల్లీ పోలీసులు సోషల్‌మీడియాలో స్పందించారు. ప్రజలెవరూ కంగారుపడొద్దని, సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు