NEET: ‘నీట్‌’పై నేడు సుప్రీంలో విచారణ

ఎంబీబీఎస్, బీడీఎస్‌.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)- యూజీ 2024ను సవాల్‌ చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ నిర్వహించనుంది.

Published : 13 Jun 2024 06:20 IST

 గ్రేస్‌ మార్కులను సవాల్‌ చేసిన ‘ఫిజిక్స్‌ వాలా’
 మొత్తం మూడు పిటిషన్లపై జరగనున్న వాదనలు

దిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్‌.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)- యూజీ 2024ను సవాల్‌ చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ నిర్వహించనుంది. జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ ఈ పిటిషన్లపై వాదనలు విననుందని బుధవారం సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తెలిపింది. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, ఇతర అక్రమాలపై అబ్లుల్లా మహమ్మద్‌ ఫైజ్, కార్తీక్‌ వేర్వేరు పిటిషన్లు వేశారు. వీరితో పాటు.. నీట్‌-యూజీ (2024) పరీక్షలో కొంత మందికి గ్రేస్‌ మార్కులు కేటాయించడంపై ‘ఫిజిక్స్‌ వాలా’ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్‌ పాండే కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ‘‘సుమారు 1500 మంది విద్యార్థులకు ర్యాండమ్‌గా 70 నుంచి 80 గ్రేస్‌ మార్కులు ఇచ్చారు. ఇలా ఏకపక్షంగా మార్కులు ఇవ్వడాన్ని మేం సవాల్‌ చేస్తున్నాం’’ అని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. గ్రేస్‌ మార్కులివ్వడం ఏకపక్షమని.. నీట్‌ పరీక్షా ప్రక్రియ, ఫలితాలపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. గురువారం విచారణలో ఈ పిటిషన్‌పైనా సుప్రీంకోర్టు వాదనలు విననుంది. నీట్‌ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67 మంది విద్యార్ధులు 720కి 720 మార్కులు సాధించారు. హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్‌ రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంత మంది టాప్‌ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్‌ మార్కులు కారణమని ఆరోపిస్తూ దిల్లీలో ఈ నెల 10న విద్యార్థులు ఆందోళన చేశారు. సుప్రీంకోర్టుతో పాటు. దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. బుధవారం దిల్లీ హైకోర్టులోనూ నీట్‌ పిటిషన్లపై విచారణ జరిగింది. అయితే దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో ఉన్న కేసులన్నీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని త్వరలో పిటిషన్‌ వేస్తున్నామని నీట్‌ పరీక్ష నిర్వహించిన జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) న్యాయస్థానానికి తెలిపింది.

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ కాలేదు: ఎన్టీఏ

నీట్‌-యూజీ(2024)లో 63 మంది విద్యార్థులు అక్రమ మార్గాలు అనుసరించారని, అందులో 23 మందిని డిబార్‌ చేసినట్లు బుధవారం  ఎన్టీఏ డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ కుమార్‌సింగ్‌ తెలిపారు. ప్రవేశ పరీక్ష పవిత్రతకు  విఘాతం కలగలేదని.. ప్రశ్నపత్రం లీక్‌ కాలేదన్నారు. మిగిలిన 40 మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపివేశామని వెల్లడించారు. నీట్‌ నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తడంతో గత వారం కేంద్ర విద్యాశాఖ నలుగురు సభ్యులతో కమిటీ వేసింది. కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్‌ మార్కులు పొందిన 1563 విద్యార్థులపై విచారణ జరిపింది. ‘‘కమిటీ తన నివేదికను ఇంకా సమర్పించలేదు. ఆ అభ్యర్థులకు తిరిగి పరీక్ష నిర్వహించడం లేదా ఇంకేదైనా విధానం అవలంబిస్తాం. ఏ అభ్యర్థికీ నష్టం కలగకుండా చూస్తాం’’ అని సింగ్‌ చెప్పారు. 720కి 720 మార్కులు సాధించి 67 మంది విద్యార్థులు టాప్‌ ర్యాంకులు సంపాదించడంపై మాట్లాడుతూ.. ‘‘గ్రేస్‌ మార్కులు పొందిన ఇద్దరు విద్యార్థులకే 718, 719 మార్కులు వచ్చాయి’’ అని పేర్కొన్నారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో గందరగోళం కారణంగా గ్రేస్‌ మార్కులు ఇచ్చామని ఎన్టీఏ అధికారులు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని