SupremeCourt: కేసు విచారణకు 40 ఏళ్లు.. 75 ఏళ్ల దోషికి సుప్రీం కోర్టు బెయిల్‌

హత్యాచారం కేసు విచారణలో తీవ్ర జ్యాప్యాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు 75 ఏళ్ల దోషికి బెయిల్‌ మంజూరు చేసింది.

Updated : 26 Sep 2023 19:14 IST

దిల్లీ: మేన కోడలిపై హత్యాచారం కేసు విచారణలో 40 ఏళ్ల తీవ్ర జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని పశ్చిమబెంగాల్‌కు చెందిన 75 ఏళ్ల దోషికి సుప్రీం కోర్టు (Supreme Court) బెయిల్‌ మంజూరు చేసింది. ఆయన అప్పీలుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోల్‌కతా హైకోర్టును సోమవారం ఆదేశించింది. దోషికి విధించిన శిక్షను రద్దు చేసేందుకు నిరాకరిస్తూ మే 2023లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. విచారణ పూర్తి చేసేందుకు ఇంత జాప్యం ఎందుకని పశ్చిమబెంగాల్‌ (West Bengal) ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హత్యాచార ఘటన 1983లో జరిగితే.. 40 ఏళ్ల తర్వాత కస్టడీకి తీసుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

అరుణాచల్‌ ఇప్పటికీ, ఎప్పటికీ.. భారత్‌లో అంతర్భాగమే: అనురాగ్‌

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సునీల్‌ ఫెర్నాండెజ్‌ వాదనలు వినిపించారు. ఈ కేసును హైకోర్టుకు బదిలీ చేయాలని కోర్టుకు విన్నవించారు. కేసు నమోదైన నాటి నుంచి అతడు బెయిల్‌పైనే ఉన్నాడని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా అతడిని మళ్లీ బెయిల్‌పై విడుదల చేయాలన్న ఆలోచనని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. 1983-1988 మధ్య కాలంలో ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, అప్పీలుదారు తన వద్ద ఇతర ఆధారాలున్నాయంటూ కోర్టును ఆశ్రయించారని, బాధితురాలు సూసైడ్‌ లేఖ రాసిందంటూ కొత్తవాదనను తెరమీదకు తెచ్చారని అన్నారు. అయితే, ఎఫ్‌ఐఆర్‌లో సూసైడ్‌ నోట్‌ ప్రస్తావన లేకపోవడంతో ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

ఆ తర్వాత 1988 నుంచి 2018 వరకు దీనిపై  విచారణ జరగలేదని వివరించారు. దీనిపై జస్టిస్‌ అభయ్‌ ఓకా స్పందిస్తూ.. స్టే కోసం దరఖాస్తు చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. బెయిల్‌ పొందేందుకు కచ్చితంగా ఇంతకాలంపాటు జైలుశిక్ష అనుభవించాలన్ని నియమం ఏమీ లేదని పేర్కొన్నారు. దీనిపై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వ న్యాయవాది రెండు వారాల గడువు కోరగా.. ధర్మాసనం తిరస్కరించింది. సంబంధిత అంశాలన్నీ ఇప్పటికే ట్రయల్‌ కోర్టు రికార్డుల్లో ఉన్నాయంటూ పిటిషనర్‌కు బెయిల్‌ మంజూరు చేశారు. దీనికి సంబంధించిన విచారణను వేగవంతం చేయాలని హైకోర్టును ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని