గాంధీ మార్గం.. అదే విజయ సూత్రం

జాతిపిత మహాత్మగాంధీ వర్థంతి నేడు. ఈ సందర్భంగా యావత్‌ భారతావని బాపూజీని స్మరించుకుంటోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా

Updated : 10 Sep 2022 14:47 IST

బాపూజీకి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు

దిల్లీ: జాతిపిత మహాత్మగాంధీ వర్థంతి నేడు. ఈ సందర్భంగా యావత్‌ భారతావని బాపూజీని స్మరించుకుంటోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా మహాత్ముడికి నివాళులర్పించారు. గాంధీజీ సిద్ధాంతాలైన శాంతి, అహింస మార్గాన్ని ప్రజలంతా పాటించాలని పిలుపునిచ్చారు. 

►> యావత్‌ దేశం తరఫున జాతిపితకు నివాళులర్పిస్తున్నా. గాంధీ ఆదర్శాలైన శాంతి, అహింస, నిరాడంబరత, స్వచ్ఛత, వినమ్రతను మనం ఎల్లప్పుడూ పాటించాలి. మహాత్ముడు చూపిన ప్రేమ, సత్య మార్గాన్ని అనుసరించేలా కృతనిశ్చయంతో ఉండాలి - రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

►> ‘అహింసే అత్యున్నత కర్తవ్యం. మనం దాన్ని పూర్తి స్థాయిలో సాధన చేయలేకపోయినా, దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మానవతా దృక్పథంతో హింసామార్గం నుంచి సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి’ అని మహాత్మ గాంధీ అన్నారు. శాంతి, అహింస, నిస్వార్థ సేవలకు ఆయన మార్గదర్శి. బాపూజీ తన స్ఫూర్తిదాయక మాటలు, చేతల ద్వారా కాలం మీద చెరగని ముద్ర వేసి, అహింసా మార్గం దిశగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ప్రేరేపించారు. అణగారిన, సామాజికంగా వెనుకబడిన, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంత కృషి చేశారు. గాంధీజీ జీవితం, సిద్ధాంతాలు ప్రపంచానికి స్ఫూర్తిని పంచుతున్నాయి. ఆయన వర్థంతి సందర్భంగా మహాత్ముని బోధనలను, ఆయన చూపిన మార్గాన్ని అనుసరించే దిశగా కంకణబద్ధులమవుదాం - ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

►> బాపూజీ పుణ్యతిథిన ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నా. ఆయన ఆదర్శాలు ఇప్పటికీ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయి. దేశ స్వాతంత్ర్యం, ప్రజల క్షేమం కోసం అహర్నిశలు శ్రమించి ప్రాణత్యాగం చేసిన అమరవీరులందరినీ  స్మరించుకుందాం - ప్రధానమంత్రి నరేంద్రమోదీ

►> మహాత్మ గాంధీ పుణ్య తిథిన వినయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నా - కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

►> సత్యం, అహింస, సహనం, ధైర్యం, సత్యాగ్రహం - గాంధీజీ ఆచరించిన సిద్ధాంతాలివి. వీటితో ఏ పోరాటంలోనైనా విజయం సాధించవచ్చు. బాపూజీ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నా - దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

1948 జనవరి 30న నాథూరాం గాడ్సే జరిపిన కాల్పుల్లో గాంధీజీ ప్రాణాలు కోల్పోయారు. ఆయన వర్థంతిని పురస్కరించుకుని ఏటా ఈ రోజున అమరవీరుల దినం జరుపుకొంటున్నాం.

ఇదీ చదవండి..

మానవతా శిఖరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని