Published : 29 May 2022 01:42 IST

Monkeypox: మంకీపాక్స్‌ను గుర్తించే ఆర్‌టీ-పీసీఆర్‌ కిట్‌..!

తయారు చేసిన ట్రివిట్రాన్‌ హెల్త్‌కేర్‌

(నమూనా చిత్రం)

దిల్లీ: కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న వేళ.. మంకీపాక్స్‌ వైరస్‌ యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు కలవరపెడుతోంది. ఇప్పటికే 20 దేశాలకు ఈ వైరస్‌ పాకగా.. 200లకు పైగా కేసులు వెలుగుచూశాయి. మరో 100 అనుమానిత కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్‌ గురించి ముమ్మర పరిశోధనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో దేశానికి చెందిన మెడికల్‌ పరికరాల తయారీ సంస్థ ట్రివిట్రాన్‌ హెల్త్‌కేర్‌.. మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఓ రియల్‌టైమ్ పీసీఆర్‌ కిట్‌ను రూపొందించింది.

‘‘ట్రివిట్రాన్ హెల్త్‌కేర్‌కు చెందిన రీసర్చ్ అండ్‌ డెవలప్‌మెంట్ బృందం.. మంకీపాక్స్‌ వైరస్‌ను గుర్తించేందుకు ఓ ఆర్‌టీ-పీసీఆర్‌ కిట్‌ను తయారుచేసింది. ఇది నాలుగు రంగుల ఫ్లోరోసెన్స్‌ ఆధారిత కిట్‌. ఇది వన్‌ ట్యూబ్‌ సింగిల్‌ రియాక్షన్‌ ఫార్మాట్‌లో స్మాల్‌పాక్స్‌, మంకీపాక్స్‌ తేడాను గుర్తిస్తుంది. ఈ కిట్‌ ద్వారా గంటలోనే ఫలితం తెలుసుకోవచ్చు’’ అని ట్రివిట్రాన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ కిట్‌తో టెస్టు చేసుకునేందుకు పొడి స్వాబ్‌లతో పాటు వీటీఎం(వైరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మీడియా) స్వాబ్‌లను కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ చంద్ర గంజూ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వైరస్‌ వ్యాప్తి కట్టడికి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచానికి సాయం చేసేందుకు భారత్ ఎల్లప్పుడూ ముందుంటుంది’’ అని తెలిపారు.

బ్రిటన్‌, స్పెయిన్‌, పోర్చుగల్‌, కెనడా, అమెరికా సహా 20 దేశాల్లో మంకీపాక్స్‌ కేసులు వెలుగుచూశాయి. వ్యాధి వ్యాప్తిని అరికట్టకపోతే ఇతరులకు సోకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి డాక్టర్‌ సైల్వై బ్రైండ్‌ అభిప్రాయపడ్డారు. మశూచికి వాడే టీకాలు మంకీపాక్స్‌పై పనిచేస్తున్నాయా? లేదా? అన్న విషయంపై బ్రిటన్‌, జర్మనీ, కెనడా, అమెరికాలు పరిశోధన ప్రారంభించిన నేపథ్యంలో.. డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం కూడా ఈ విషయమై పనిచేస్తోందని, త్వరలోనే మార్గదర్శకాలను అందిస్తామని చెప్పారు. మంకీపాక్స్‌ సోకిన వారిలో ఎక్కువగా జ్వరం, ఒళ్లునొప్పులు, చలి, అలసట వంటి లక్షణాలుంటాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ముఖం, చేతులపై దద్దుర్లు, చిన్నబొబ్బలు ఏర్పడవచ్చు. క్రమేపీ అవి ఇతర శరీర భాగాలకూ వ్యాపించవచ్చు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని