Updated : 12 Jan 2021 13:32 IST

రాజీనామాకు ట్రంప్‌ ససేమిరా!

 విమర్శలను లెక్కచేయని అధ్యక్షుడు

వాషింగ్టన్‌: స్వపక్ష, విపక్షాల నుంచి రాజీనామా డిమాండ్లు, ఛీత్కారాలు ఎదురవుతున్నా... సామాజిక మాధ్యమాలు అత్యంత అవమానకరంగా తన ఖాతాలను స్తంభింపజేసినా... అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం వేటినీ లెక్కచేయడం లేదు!

శ్వేతసౌధాన్ని వీడటానికి ముందే తనను పదవీచ్యుతుడిని చేసేందుకు విపక్ష డెమోక్రాటిక్‌ పార్టీ ఎత్తులు వేస్తున్నా, ఆయన ఎప్పట్లాగే తన సహజ ధోరణిని కనబరుస్తున్నారు. తనకు వ్యతిరేకంగా మరోసారి అభిశంసన తీర్మానం ప్రవేశపెడుతున్నారని తెలిసినా, ఆయన మాత్రం రాజీనామా ఊసెత్తలేదు. ఫేస్‌బుక్, ట్విటర్‌ ఖాతాలను స్తంభింపజేయడం పట్ల ఆయన గుర్రుగా ఉన్నారు. సదరు సంస్థలపై తనదైన శైలిలో ఎదురుదాడికి దిగారు. అధికారానికి దూరమయ్యే రోజులు దగ్గరపడుతున్న కొద్దీ ఆయన ప్రవర్తన విపరీతంగా ఉంటోందని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇవేవీ పట్టని అధ్యక్షుడు... మంగళవారం అలామో, టెక్సాస్‌లలో పర్యటించాలని భావిస్తున్నారు. మెక్సికో నుంచి అక్రమ వలసలను నిరోధించడానికి సరిహద్దు గోడ నిర్మాణం, ఇతరత్రా చర్యలను ఈ సందర్భంగా స్థానికులకు వివరించనున్నట్టు తెలిసింది.

‘ఉద్రిక్తతలను ఎగదోసే చర్య...’

ట్రంప్‌నకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలన్న ఆలోచన దురదృష్టకరమని రిపబ్లికన్‌ సెనేటర్‌ మాక్రో రూబియో పేర్కొన్నారు. ‘‘దేశాన్ని ఐక్యం చేస్తానని, అందరి అధ్యక్షునిగా ఉంటానంటూ బైడెన్‌ ఎన్నికల బరిలోకి దిగారు. మహమ్మారిని నియంత్రించడం వంటి ముఖ్యమైన పనులు ఆయన ముందున్నాయి. కానీ, కొద్దిరోజుల్లో పదవీకాలం ముగుస్తున్న అధ్యక్షుడిని తొలగించడంపై ఆయన, డెమోక్రాటిక్‌ పార్టీ నేతలు దృష్టి సారించారు. ఉద్రిక్త వాతావరణాన్ని అదుపు చేయడం మాని, దాన్ని ఎగదోసే చర్యలకు దిగడం సముచితం కాదు’’ అని ఆయన విమర్శించారు.

56% మంది నోట... ‘తొలగింపు’ మాట!

ట్రంప్‌ను పదవి నుంచి తొలగించే విషయమై ఏబీసీ న్యూస్‌/ఇప్‌సోస్‌ సర్వే చేపట్టాయి. ఇందుకు సంబంధించిన నివేదికను ఆదివారం బహిర్గతం చేశాయి. ‘‘అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించాలని 56% మంది, క్యాపిటల్‌పై జరిగిన దాడికి ట్రంపే కారకుడని 67% మంది అమెరికన్లు భావిస్తున్నారు’’ అని నివేదిక పేర్కొంది. అయితే, కాంగ్రెస్‌ భవనంపై జరిగిన దాడికి ట్రంప్‌ మాత్రం ఇప్పటికీ బాధ్యత తీసుకోలేదు.

క్యాపిటల్‌పై దాడి కలచివేసింది:  ప్రథమ మహిళ మెలానియా 

అమెరికా కాంగ్రెస్‌ భవనం క్యాపిటల్‌పై ట్రంప్‌ మద్దతుదారులు దాడి చేయడాన్ని... ఆయన భార్య, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ‘‘గతవారం జరిగిన పరిణామం నన్ను తీవ్రంగా కలచివేసింది. నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. క్యాపిటల్‌పై దాడిని వ్యతిరేకిస్తున్నా. హింస ఎప్పుడూ ఆమోదయోగ్యం కాదు. ఈ ధోరణిని ఆందోళనకారులు విడనాడాలి. కొందరు ఈ విషాద ఘటన చుట్టూ పుకార్లు పుట్టిస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఆరోపణలు చేస్తూ, నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. క్యాపిటల్‌పై దాడికి స్వయానా అధ్యక్షుడు ట్రంపే ఆందోళనకారులను పురికొల్పారన్న ఆరోపణలపై మాత్రం ఆమె స్పందించలేదు.

ఇవీ చదవండి..

బయలుదేరిన కరోనా టీకా!

వాణిజ్య విభేదాలపై భారత్‌తో విస్తృత చర్చలు

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని