75 ఏళ్ల తరవాత మరో యుద్ధం చేస్తున్నాం:ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అవకాశం దొరికితే చాలు అంతర్జాతీయ వేదికలపై చైనా చర్యలను ఎండగడుతుంటారు.

Published : 23 Sep 2020 13:01 IST

చైనాపై విరచుకుపడిన అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అవకాశం దొరికితే చాలు అంతర్జాతీయ వేదికలపై చైనా చర్యలను ఎండగడుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణకు ఆ దేశ చర్యలే కారణమంటూ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ చైనా వైరస్‌ వ్యాప్తికి ఐరాస ఆ దేశాన్ని జవాబుదారీ చేయాలంటూ డిమాండ్ చేశారు. అగ్రరాజ్యంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించడంతో 2లక్షల మంది అమెరికన్లు బలయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఆ సంఖ్య సుమారు 10లక్షలుగా ఉంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ఐరాస సర్వ ప్రతినిధి సభ 75వ వార్షిక సమావేశాల్లో వీడియో సందేశం ద్వారా చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 75 సంవత్సరాల తరవాత ప్రపంచం అతి పెద్ద సమస్యను ఎదుర్కోంటోంది. కనిపించని శత్రువైన ‘చైనా వైరస్‌’పై తీవ్ర పోరాటం చేస్తున్నాం. 188 దేశాల్లోని అనేక మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మన ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్‌ వ్యాప్తికి కారణమైన చైనాను జవాబుదారీ చేయాలి. ఈ మహమ్మారి ప్రారంభ దశలో చైనా దేశీయంగా ప్రయాణాలపై ఆంక్షలు విధించిన్పటికీ, అంతర్జాతీయంగా ఎలాంటి ఆంక్షలు విధించకుండా వైరస్‌ వ్యాప్తికి కారణమైంది’ అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అలాగే ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తీరును తప్పుబట్టారు. ఆ సంస్థ చైనా ఆడించినట్లు ఆడుతోందని విమర్శించారు. ‘చైనా ప్రభుత్వం, అది చెప్పినట్లు ఆడే ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదట్లో మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్‌ సోకినట్లు ఆధారాలు లేవని ప్రకటించాయి. తరవాత లక్షణాలు లేని వ్యక్తుల నుంచి ఈ వైరస్‌ వ్యాపించదని మరో తప్పుడు ప్రకటన చేశాయి. ఐరాస వారి చర్యలను పరిగణనలోకి తీసుకొని చైనాను జవాబుదారీ చేయాలి’ అంటూ చైనాపై మండిపడ్డారు.

అంతేకాకుండా పర్యావరణానికి తీవ్ర స్థాయిలో హాని కలిగించే విధంగా చైనా తీరు ఉందని ఆ దేశ చర్యలను దుయ్యబట్టారు. ‘యూఎస్‌ కంటే చైనా నుంచి కార్బన్ ఉద్గారాల శాతం రెట్టింపుగా ఉంది. ఆ పెరుగుదల కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆ దేశం మిలియన్ల కొద్ది టన్నుల్లో ప్లాస్టిక్‌ను సముద్రాల్లోకి విచ్చలవిడిగా కుమ్మరించడంతో పగడపు దిబ్బలకు హాని కలుగుతోంది. ఇతర దేశాల సముద్రజల్లాల్లోకి చొచ్చుకొని వచ్చి పరిమితికి మించి చేపలు పడుతుండటం తీవ్ర పరిణామం’ అంటూ చైనా చర్యలను ఖండించారు. 

కరోనా వైరస్‌ చైనాలోని వూహాన్‌ నుంచి ప్రపంచాన్ని కమ్మేసిందని నిపుణులు భావిస్తున్నారు. దీని కారణంగా ఆమెరికా తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కాగా, వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులోకి రానుందని, దాన్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి, వైరస్‌కు అమెరికా చరమగీతం పాడుతుందని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఏదో ఒక అంశంపై చైనాపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. చైనా కూడా ఆ విమర్శలను గట్టిగానే తిప్పికొడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని