Published : 06 Jan 2021 23:26 IST

పెన్స్‌కు ‘ట్రంప్‌’ తలనొప్పి!

ఉపాధ్యక్షుణ్ని పావుగా వాడుకోవాలనుకుంటున్న ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ విజయాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా యత్నిస్తున్నారు. అందుకు ఉన్న ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ని అందుకు పావుగా వాడుకోవాలనుకుంటున్నారు. కానీ, అందుకు ఆయన సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. బైడెన్‌ విజయాన్ని అడ్డుకునే అధికారం తనకు లేదని ఇప్పటికే ట్రంప్‌నకు తెలియజేసినట్లు సమాచారం. ట్రంప్‌ తీరుతో ఇప్పటికే రిపబ్లికన్‌ పార్టీలోని ఓ వర్గం తీవ్ర అసహనంలో ఉంది. ఉపాధ్యక్షుడి అధికారాలను దుర్వినియోగం చేయొద్దంటూ విన్నివించింది.

బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరించేందుకు బుధవారం అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభలు సమావేశం కానున్నాయి. ఈ ప్రక్రియ సెనేట్‌ అధ్యక్షుడు, దేశ ఉపాధ్యక్షుడు అయిన మైక్‌ పెన్స్‌ చేతుల మీదుగా జరగనుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ ఎన్నికల ఫలితాల్ని సీల్డు కవర్లలో కాంగ్రెస్‌కు సమర్పిస్తాయి. పెన్స్‌ ఆ కవర్లన్నింటినీ తెరిచి కాంగ్రెస్‌లో ప్రకటించాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కాంగ్రెస్‌ అధికారికంగా బైడెన్‌ను దేశాధ్యక్షుడిగా ప్రకటిస్తుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఎలక్టోర్‌ కాలేజీ ఓట్లను నమోదుచేసి.. బైడెన్ గెలుపును ఖరారు చేశాయి. ఆ ఫలితాలను కాంగ్రెస్‌కు అందజేయడం తప్ప మైక్‌పెన్స్‌ చేయగలిగిందేమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు.

అయితే ట్రంప్‌ మాత్రం దీన్ని ఓ అవకాశంగా భావిస్తూ కుట్ర పన్నుతున్నారు. పెన్స్‌ కూడా రిపబ్లికన్‌ పార్టీకి చెందినవారే కావడంతో ఆయన్ని అడ్డంపెట్టుకొని చక్రం తిప్పాలని చూస్తున్నారు. ‘‘పెన్స్‌ మా పక్కన చేరితే అధ్యక్ష పదవిని మేమే నిలబెట్టుకోగలుగుతాం. బైడెన్‌ గెలుపును ధ్రువీకరించిన చాలా రాష్ట్రాలు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాయి. అధ్యక్షుడి గెలుపును ఆయా రాష్ట్రాల చట్టసభలు ధ్రువీకరించాలి. కానీ, అలా జరగలేదు. ఈ నేపథ్యంలో పెన్స్‌ ఎన్నికల ఫలితాల్ని తిప్పి పంపొచ్చు’’ అని ట్వీట్‌ చేసిన ట్రంప్‌ తన కుట్రను బహిరంగంగానే వెల్లడించారు.

అయితే, ట్రంప్‌ కుట్రలో భాగమయ్యేందుకు పెన్స్‌ సిద్ధంగా లేరని ప్రముఖ పత్రిక ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పేర్కొంది. దీన్ని ట్రంప్‌ ఖండించారు. ఉపాధ్యక్షుడితో తనకు సయోధ్య ఉందని ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాల్ని తిప్పిపంపే అధికారం ఉపాధ్యక్షుడికి ఉందని చెప్పుకొచ్చారు. అక్రమంగా ఎన్నికైన ఎలక్టోరల్స్‌ను తిరస్కరించే అధికారం ఆయనకు ఉంటుందన్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మరోసారి ఆరోపిస్తూ.. అవసరమైతే ఫలితాల్ని తిరస్కరిస్తూ ప్రతినిధుల సభలో ‘ఒక రాష్ట్రం-ఒక ఓటు’ పద్ధతిలో అధ్యక్షుణ్ని ఎన్నుకొనేందుకు పెన్స్‌ ఆదేశించవచ్చని చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలపై పెన్స్‌ ఇప్పటి వరకు ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదు.

ఇవీ చదవండి..

ట్రంప్‌ మరో కీలక నిర్ణయం!

తప్పు చేశాం: కిమ్‌ అరుదైన ప్రకటన..

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని