Agnipath: సైన్యంలో సగటు వయసు తగ్గించేందుకే ఈ సంస్కరణలు: అగ్నిపథ్‌పై త్రివిధ దళాల ప్రకటన

సైన్యంలో (Indian Army) సగటు వయసు తగ్గించేందుకే సంస్కరణలు తీసుకొస్తున్నామని త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Updated : 19 Jun 2022 16:39 IST

దిల్లీ: సైన్యంలో (Indian Army) సగటు వయసు తగ్గించేందుకే సంస్కరణలు తీసుకొస్తున్నామని త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అగ్నిపథ్‌పై (Agnipath) రెండేళ్లుగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం ఇతర దేశాల సైన్యాలపైనా త్రివిధ దళాధిపతులు సమగ్ర అధ్యయనం చేశారన్నారు. సాయుధ దళాల నియామకాల కోసం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తోన్న సయమంలో వాటిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు త్రివిధ దళాలకు చెందిన అధికారులు నేడు మీడియా ముందుకు వచ్చారు.

‘ప్రస్తుతం సాయుధ దళాల్లో ఉన్నవారి సగటు వయసు 30ఏళ్లకు పైగా ఉంది. ఇలా కొనసాగడం ఆందోళనకర విషయం. యువ సైనికులు అయితే సైన్యంలో టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తారని భావించాం. సెల్‌ఫోన్లు, డ్రోన్లతో యువకులు అద్భుతాలు చేస్తున్నారు. అందుకే యువత సైన్యంలోకి రావటానికి, వెళ్లిపోవటానికి అవకాశాలు పెంచాం. ఈ క్రమంలో అనుభవం ఉన్నవారికి, యువశక్తికి సమాన ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నాం’ అని సైనిక వ్యవహారాల విభాగంలో అడిషినల్‌ సెక్రటరీగా ఉన్న లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ పూరీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సైన్యంలో వయసుకు సంబంధించి 1999 కార్గిల్‌ యుద్ధంపై ఓ కమిటీ ఇచ్చిన నివేదికను ఆయన ప్రస్తావించారు.

‘సైన్యంలో యువతను ఎక్కువగా తీసుకునేందుకు సుదీర్ఘ సంప్రదింపులు జరిపాం. ఈ క్రమంలో విదేశీ సైన్యాలను కూడా అధ్యయనం చేశాం. ఎటువంటి సవాళ్లనైనా స్వీకరించే శక్తి యువత సొంతం. కొత్త టెక్నాలజీని యువత త్వరగా అందిపుచ్చుకుంటోంది. మూడు విభాగాల్లో ప్రతి సంవత్సరం 17,600 మంది ముందస్తు రిటైర్‌మెంట్‌ అవుతున్నారు. కొవిడ్‌ వల్ల రెండేళ్లుగా ఆర్మీ నియామకాలు జరగలేదు. అందుకే ఈసారి ఎక్కువ మందిని నియమించుకోవాలని భావిస్తున్నాం. అగ్నివీర్‌లు సైన్యంలో కొనసాగేందుకు అవకాశాలు ఉన్నాయి’ అని లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ పూరీ స్పష్టం చేశారు.

మరిన్ని వివరాలు..

  • అగ్నివీరులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందిస్తాం
  • వారు బయటకు వెళ్లిన నెల రోజుల్లోనే వేరే ఉపాధి చూసుకోగలరు
  • సైన్యం తరపున అన్నిరకాల బెనిఫిట్స్‌ అందుతాయి
  • రూ.12లక్షలు తీసుకొని అగ్నివీరులు బయటకు వెళ్తారు
  • వారి క్రెడిట్‌ రేటింగ్స్‌ బాగుంటే బ్యాంక్‌లు రుణాలిస్తాయి
  • అగ్నివీరులకు రిటైర్మెంట్‌ తర్వాత పరిశ్రమల్లో పనిచేసేలా చర్యలు
  • నాలుగున్నరేళ్ల తర్వాత కొనసాగాలా వద్దా అనేది యువత ఇష్టం
  • నాలుగున్నరేళ్ల తర్వాత డిప్లొమా ధ్రువపత్రం ఇస్తాం
  • అనేక రంగాల్లో అవకాశాలు ఉంటాయి
  • ఈ నెల 24 నుంచి అగ్నిపథ్‌ దరఖాస్తులు ప్రారంభం
  • జులై 24న అగ్నిపథ్‌ ఫేజ్‌-1 పరీక్ష
  • ఈ ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి అగ్నివీరులకు శిక్షణ ప్రారంభిస్తాం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని