Tunnel: దిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు సొరంగం..!

దేశ రాజధాని దిల్లీ శాసనసభలో ఏళ్ల క్రితం నాటి సొరంగం ఒకటి తాజాగా బయటపడింది. ఈ సొరంగ మార్గం అసెంబ్లీ నుంచి ఎర్ర కోట వరకు ఉందట. అయితే దీన్ని

Updated : 03 Sep 2021 14:17 IST

 

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ శాసనసభలో ఏళ్ల క్రితం నాటి సొరంగం ఒకటి తాజాగా బయటపడింది. ఈ సొరంగ మార్గం అసెంబ్లీ నుంచి ఎర్ర కోట వరకు ఉందట. అయితే దీన్ని బ్రిటిష్‌ హయాంలో ఉపయోగించేవారని శాసనసభ స్పీకర్‌ రామ్ నివాస్‌ గోయల్‌ తెలిపారు.

‘‘1993లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఈ టన్నెల్‌ గురించి విన్నాను. ఇది ఎర్రకోట వరకు ఉంటుందని చెప్పేవారు. బ్రిటిష్‌ వారు స్వాతంత్ర్య సమరయోధుల తరలింపు కోసం ఈ రహస్య మార్గాన్ని ఉపయోగించేవారని చెప్పుకునేవారు. 1912లో అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం తమ రాజధానిని కోల్‌కతా నుంచి దిల్లీకి మార్చిన తర్వాత ఈ భవనాన్ని సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీగా ఉపయోగించేది. ఆ తర్వాత 1926లో దీన్ని కోర్టుకు మార్చారు. అప్పుడు స్వాతంత్ర్య సమరయోధులను కోర్టుకు తీసుకొచ్చేందుకు ఈ మార్గాన్ని ఉపయోగించేవారు. దీని చరిత్రను తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కచ్చితమైన సమాచారం లభించలేదు’’ అని స్పీకర్ గోయల్ వెల్లడించారు.

ఈ సొరంగం ప్రవేశమార్గం గురువారం బయటపడిందని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి తాము ఈ సొరంగ మార్గాన్ని తవ్వాలనుకోవడం లేదన్నారు. మెట్రో ప్రాజెక్టులు, డ్రైనేజీ వ్యవస్థలతో ఈ సొరంగంలో చాలా భాగం ఇప్పటికే ధ్వంసమై ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే స్వాతంత్ర్య పోరాటంలో గొప్ప చరిత్ర కలిగిన ఈ టన్నెల్‌ను పర్యాటక ప్రాంతంగా మారుస్తామని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని