వీసాల్లో మార్పులు.. అండర్‌ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి

యూకేలో వీసా నిబంధనల్లో మార్పులు అండర్‌గ్రాడ్యుయేట్ల కోసం తీసుకురాలేదని ఆ దేశ మంత్రి తారిఖ్‌ అహ్మద్‌ (Tariq Ahmad) తెలిపారు. భారత్‌ నుంచి మరింత మంది విద్యార్థులు తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Published : 30 May 2023 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విదేశీ విద్యార్థితో పాటు వారి కుటుంబ సభ్యులనూ దేశంలోకి అనుమతిస్తున్న వీసా విధానానికి బ్రిటన్‌ (Britain) ఇటీవల స్వస్తి పలకడంతో భారత్‌ నుంచి యూకే వెళ్లే విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై యూకే విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి తారిఖ్‌ అహ్మద్‌ (Tariq Ahmad) స్పందించారు. వీసా నిబంధనల్లో (Visa Rules) మార్పులు కేవలం పోస్టుగ్రాడ్యుయేట్‌ విద్యార్థులకేనని అన్నారు. అండర్‌ గ్రాడ్యుయేట్లనుద్దేశించి ఈ నిబంధనలు తీసుకురాలేదన్నారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆయన.. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘కేవలం ఏడాది కాలానికి బ్రిటన్‌ వచ్చే రీసెర్చ్‌, పీహెచ్‌డీ విద్యార్థుల కోసమే వీసా నిబంధనలను కఠినతరం చేశాం. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (Undergraduation) విద్య, పరిశోధనల కోసం వచ్చే విద్యార్థులను యూకే (UK) ఎల్లప్పుడూ స్వాగతిస్తుంది. చట్టపరమైన వలసలతో బ్రిటన్‌ను ప్రయోజకరమే. కేవలం అక్రమ వలసదారులను మాత్రమే మేం అడ్డుకోవాలనుకుంటున్నాం. భారత్‌ నుంచి చాలా మంది విద్యార్థులు మా దేశానికి వస్తున్నారు. ఇంకా చాలా మంది రావాలని కోరుకుంటున్నాం’’ అని తారిఖ్‌ అహ్మద్‌ వెల్లడించారు.

నాలుగు రోజుల పర్యటన నిమిత్తం తారిఖ్‌ ఆదివారం భారత్‌కు వచ్చారు. తొలుత రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో పర్యటించారు. తారిఖ్‌ కూడా భారత సంతతి వ్యక్తే. ఆయన తల్లి 76 ఏళ్ల క్రితం జోధ్‌పూర్‌ నుంచి పాకిస్థాన్‌కు వలసవెళ్లి.. ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో స్థిరపడ్డారు. దీంతో జోధ్‌పూర్‌ పర్యటన తనకెంతో ప్రత్యేకమని తారిఖ్‌ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం దిల్లీకి చేరుకున్న ఆయన.. భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌తో సమావేశం కానున్నారు. పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోనూ ఆయన పర్యటించనున్నారు.

విదేశీ విద్యార్థుల వీసాలను బ్రిటన్‌ మరింత కఠినతరం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నూతన విధానం (New Visa Rules) గురించి హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మన్‌ గతవారం కామన్స్‌ సభలో ప్రకటించారు. కొత్త నిబంధనల ప్రకారం పరిశోధనేతర పోస్టుగ్రాడ్యుయేట్‌ విద్యార్థులు తమ కుటుంబసభ్యులను బ్రిటన్‌ (Britain)కు తీసుకెళ్లడానికి వీల్లేదు. ఇక నుంచి కేవలం పరిశోధన విభాగానికి చెందిన పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సులను అభ్యసిస్తున్న విదార్థులు మాత్రమే తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లొచ్చు. విదేశీ విద్యార్థి చదువు పూర్తికాకముందు ఉద్యోగం చేయడానికి కూడా ఇక నుంచి వీల్లేదు. దేశంలో వలసల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రిషి సునాక్‌ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. 2024 జనవరి నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని