
ఇక్వెటోరియల్ గినియాలో భారీ పేలుళ్లు!
20 మంది మృతి
మలాబో: మధ్య ఆఫ్రికా దేశమైన ఇక్వెటోరియల్ గినియాలో భారీ పేలుడు ప్రమాదం చోటుచేసుకుంది. దేశ ఆర్థిక రాజధాని బాటాలోని కోమా న్కోయా సైనిక శిబిరం వద్ద ప్రమాదవశాత్తూ పేలుళ్లు సంభవించడంతో దాదాపు 20 మంది మరణించారు. వందలాది మంది గాయాల పాలయ్యారు. దీంతో బాటాలోని ఆస్పత్రుల్లో చికిత్స కోసం ఎదురుచూస్తున్న క్షతగాత్రులతో భయానక వాతావరణం నెలకొంది. మరోవైపు నగరంలోని చాలా భవనాలు పూర్తిగా అగ్నికి ఆహుతి కాగా.. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ ప్రాంతవాసులు ఇంకా చాలా మంది శిథిలాల కింద ఉండొచ్చని ఆ దేశ ఆరోగ్య శాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఇక్వెటోరియల్ గినియా అధ్యక్షుడు ట్యొడొరో ఓబ్యాంగ్ గెమా వివరించారు. ‘కోమా సైనిక శిబిరానికి సమీపంలో రైతులు తమ పొలాల్లో పంట వ్యర్థాలను దహనం చేపట్టగా.. మంటలు అదుపు తప్పి పేలుళ్లకు దారి తీసింది. సైనిక శిబిరంలో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన విభాగ ఇన్‌ఛార్జి నిర్లక్ష్యం కారణంగా నగరం ప్రమాదానికి గురైంది’అని ట్యొడొరో వివరించారు. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న తరుణంలో ఇప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుందని ట్యొడొరో తెలిపారు. ప్రపంచదేశాలు సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 20 మంది మరణించి ఉంటారని ఇక్వెటోరియల్ గినియా రక్షణ శాఖ వెల్లడించింది. మరో 600 మంది గాయపడి ఉంటారని పేర్కొంది. ఈ పేలుడు ధాటికి చాలా నివాసాలు నేలమట్టం అయ్యాయని తెలిపింది.
భారత్ సంతాపం
బాటాలో సంభవించిన పేలుళ్ల పట్ల ఇక్వెటోరియల్ గినియాలోని భారత రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ట్విటర్ ద్వారా సంతాపం తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.