IT Rules: ఎట్టకేలకు దిగొచ్చిన ట్విటర్‌!

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనల అమలు దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నేడు భారత్‌లో ‘రెసిడెంట్​ గ్రీవెన్స్​ అధికారి’(ఆర్‌జీఓ)ని నియమించింది....

Updated : 11 Jul 2021 15:00 IST

దిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనల అమలు దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నేడు భారత్‌లో ‘రెసిడెంట్​ గ్రీవెన్స్​ అధికారి’(ఆర్‌జీఓ)ని నియమించింది. భారత్‌కు చెందిన వినయ్​ప్రకాశ్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పింది. ఈ మేరకు సంస్థ వెబ్‌సైట్‌లో ఆయన వివరాలు ఉంచింది. అందులోని ఈమెయిల్ ​ఐడీకి వినియోగదారులు తమ ఫిర్యాదులను పంపించవచ్చని పేర్కొంది.

గత కొన్ని రోజులుగా నూతన ఐటీ నిబంధనల అమలు విషయమై కేంద్ర ప్రభుత్వం, ట్విటర్​ మధ్య తీవ్ర వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఐటీ నిబంధనలు పాటించడంలో ట్విటర్‌ విఫలమైందని ఇటీవల దిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ట్విటర్‌ తీరుపై దిల్లీ హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు అధికారుల నియామకంలో జాప్యం తగదని హెచ్చరించిన కోర్టు.. ఇంకెంత కాలం పడుతుందని ప్రశ్నించింది. అందుకు ఇటీవలే 8 వారాల గడువు కోరిన ట్విటర్​.. ఆలోపే ఆర్‌జీఓను నియమించింది.

నూతన ఐటీ చట్టం ప్రకారం 50లక్షల యూజర్లు దాటిన సామాజిక మాధ్యామాలు తప్పనిసరిగా ముగ్గురు అధికారులను (ఆర్‌జీఓ, చీఫ్ కంప్లయన్స్​ ఆఫీసర్, నోడల్ అధికారి) నియమించుకోవాలి. వారందరూ భారత్‌లో నివసిస్తూ ఉండాలి. కాగా, 1.75 కోట్ల మేర వినియోగదారులున్న ట్విటర్​ నిబంధనలు పాటించని కారణంగా గత నెల మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయింది. దీంతో పలువురు యూజర్లు చేసిన అభ్యంతరకర పోస్టులకుగానూ ట్విటర్‌పై కూడా కేసులు నమోదయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని