Updated : 16 Jun 2021 11:58 IST

Twitter: ‘మధ్యవర్తి హోదా’ కోల్పోయిన ట్విటర్‌

దిల్లీ: ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌కు భారత్‌లో గట్టి షాక్‌ తగిలింది. నూతన ఐటీ నిబంధనలను అమలు చేయనందుకు గానూ ట్విటర్‌ తన ‘మధ్యవర్తి’ హోదాను కోల్పోయినట్లు కేంద్ర  ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. దీంతో యూజర్ల అభ్యంతరకర పోస్టులకు ఇకపై ట్విటర్‌ కూడా క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

సామాజిక మాధ్యమాల్లో డిజిటల్‌ కంటెంట్‌పై నియంత్రణకు గానూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా ఐటీ నిబంధనల ప్రకారం వినియోగదారుల సంఖ్య 50 లక్షలు దాటిన సామాజిక మాధ్యమాలు ఓ ఫిర్యాదుల అధికారిని, ఓ నోడల్‌ అధికారిని, అనుసంధానకర్తగా మరో ప్రధాన అధికారిని నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ ముగ్గురూ భారత్‌లో నివసిస్తూ ఉండాలి. అయితే ఇతర సోషల్‌మీడియా సంస్థలు ఈ నిబంధనలు పాటించినప్పటికీ ట్విటర్‌ మాత్రం ఈ రూల్స్‌ను పాటించలేదని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై జూన్‌ మెదటివారంలోనే తుది నోటీసులు జారీ చేసింది.

అయినప్పటికీ ట్విటర్‌ అధికారుల వివరాలను వెల్లడించకపోవడంతో తన ‘మధ్యవర్తి హోదా’ను కోల్పోయినట్లు కేంద్ర వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. ఇకపై అభ్యంతరకర పోస్టులకు సంబంధించిన కేసుల్లో భారత చట్టాలకు అనుగుణంగా ట్విటర్‌ కూడా క్రిమినల్‌ చర్యలు ఎదుర్కోవాల్సిందేనని తెలిపాయి. అయితే మధ్యవర్తి హోదా రద్దుపై ఇంతవరకూ అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు.  కాగా.. భారత్‌లో ఈ హోదా కోల్పోతున్న తొలి సోషల్‌మీడియా ఇదే కావడం గమనార్హం.

అయితే భారత్‌లో అధికారులను నియమించినట్లు ట్విటర్‌ మంగళవారం వెల్లడించింది. ట్వీట్ల పరంగా తమకు వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు సంధానకర్తగా ఓ అధికారిని నియమించినట్లు నిన్న తెలిపింది. ఈ వివరాలన్నీ ఐటీ మంత్రిత్వశాఖకు త్వరలో తెలియజేస్తామని పేర్కొంది.

యూపీలో కేసు నమోదు..

మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో ట్విటర్‌పై కేసు కూడా నమోదైంది. జూన్‌ 5న ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఘాజియాబాద్‌ పోలీసులు ట్విటర్‌, కొందరు జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అభ్యంతరకర, ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని సామాజిక మాధ్యమం నుంచి తొలగించనందుకు గానూ ట్విటర్‌పై ఈ కేసు నమోదైంది.

ఏంటీ కొత్త నిబంధనలు..

భారత్‌లో సామాజిక మాధ్యమాలు, వార్తాసైట్లు, ఓటీటీ వేదికలకు సంబంధించి కొత్త నిబంధనలను కేంద్రం ఫిబ్రవరిలో ప్రకటించింది. వీటి ప్రకారం... ఆయా సంస్థలు...

* దేశంలో వీటి పేరు, చిరునామా, అధికారుల వివరాలు తమ యాప్‌ల్లో, సైట్లలో స్పష్టంగా తెలియజేయాలి.

* నెటిజన్ల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి దేశీయంగా అంతర్గత యంత్రాంగం ఏర్పాటు చేయాలి. నిర్దిష్ట గడువులోగా వాటిని పరిష్కరించాలి.

అభ్యంతరకరమైన కంటెంట్‌పై పర్యవేక్షణ, వాటి తొలగింపు... తదితరాల వివరాలు నెలకోసారి అందజేయాలి.

దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు సంబంధించిన కీలకాంశాలకు సంబంధించిన ఏదైనా సమాచారం, పోస్టింగులు పెడితే... వాటి మూలాలను (మెసేజ్‌లోని వివరాలు ఇవ్వకున్నా) ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది.
* ఎవరైనా వినియోగదారుల సందేశాలనుగానీ, వారి అకౌంట్లనుగానీ సామాజిక మాధ్యమం తొలగిస్తే వారికి తమ వాదన వినిపించుకోవటానికి తగిన సమయం కల్పించాలి.

* సామాజిక మాధ్యమాలపై వచ్చే ఫిర్యాదులను ప్రభుత్వంలోని ఓ ఉన్నత స్థాయి కమిటీ పర్యవేక్షిస్తుంది.

వాస్తవానికి ఈ నిబంధనలు ఫిబ్రవరిలోనే అమల్లోకి వచ్చినా.. దిగ్గజ సామాజిక వేదికలకు మాత్రం వీటి అమలుకు వీలుగా 3 నెలల సమయం ఇచ్చింది. ఆ గడువు మే 25తో ముగియడంతో మే 26 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. సామాజిక మాధ్యమ వేదికలన్నీ ఈ రూల్స్‌కు కట్టుబడి ఉండాలి. లేని పక్షంలో ఇన్నాళ్లూ వాటికి రక్షణ కుఢ్యంగా నిలుస్తున్న ‘మధ్యవర్తి హోదా’ రద్దవుతుందని కేంద్రం గతంలోనే హెచ్చరించింది. అంటే, ఈ హోదా వల్ల.. సోషల్‌మీడియాలో ఎవరైనా అభ్యంతరకర సమాచారం పెట్టినా.. దాన్ని తమ వేదికగా ప్రచారం చేసినా.. ఆ సంస్థకు ఏమీ కాలేదు. కేవలం పోస్టు పెట్టిన వారిపై మాత్రమే చర్యలు తీసుకునేవారు. కానీ మధ్యవర్తి హోదా రద్దయితే ఆయా సోషల్‌ మీడియా సంస్థలు కూడా క్రిమినల్‌ చర్యలు ఎదుర్కోవటానికి ఆస్కారం ఉంటుంది.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని