Twitter: కేంద్రంపై ట్విటర్‌ ‘న్యాయ’ పోరాటం..?

నూతన ఐటీ చట్టాల (IT Rules) విషయంలో ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ (Twitter), కేంద్రం మధ్య ఏడాదిగా నెలకొన్న విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఐటీ నిబంధనలను ట్విటర్‌ అమలు చేయాల్సిందేనంటూ

Published : 05 Jul 2022 18:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నూతన ఐటీ చట్టాల (IT Rules) విషయంలో ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ (Twitter), కేంద్రం మధ్య ఏడాదిగా నెలకొన్న విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఐటీ నిబంధనలను ట్విటర్‌ అమలు చేయాల్సిందేనంటూ ఇటీవల కేంద్రం ‘చివరి’ వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో తప్పనిసరై ట్విటర్‌ వాటిని అమల్లోకి తెచ్చింది. అయితే ఈ వ్యవహారంపై తాజాగా ట్విటర్‌ కేంద్రంపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వ ఆదేశాలను సవాల్‌ చేసేందుకు న్యాయపరమైన అవకాశాలను సమీక్షిస్తోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెప్పినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది.

డిజిటల్ మాధ్యమాల్లో కంటెంట్‌ నియంత్రణ కోసం కేంద్రం నూతన ఐటీ నిబంధనలు (IT Rules) తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలు గతేడాది మే 26 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఈ నిబంధనలను ఇతర సామాజిక మాధ్యమ సంస్థలు పాటిస్తున్నప్పటికీ.. ట్విటర్‌ (Twitter) మాత్రం అందుకు విముఖత చూపిస్తోంది. దీంతో ట్విటర్‌ (Twitter), కేంద్రం మధ్య గతేడాది విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలకు సంబంధించిన కొన్ని ట్వీట్లను తొలగించాలని కేంద్రం ఆదేశించగా.. అందుకు ట్విటర్‌ నిరాకరించింది. దీంతో వివాదం మరింత ముదిరింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న, నకిలీ వార్తలను ప్రసారం చేసేలా ఉన్న కొన్ని కంటెంట్లను, ఖాతాలను సామాజిక మాధ్యమం నుంచి తొలగించాలని ట్విటర్‌ను కేంద్ర ప్రభుత్వం పలుమార్లు అభ్యర్థించింది. అయితే వాటిని తొలగించేందుకు సామాజిక మాధ్యమం అంగీకరించడం లేదని కేంద్రం ఆరోపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే గత నెల ట్విటర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇదే చివరి నోటీసు అని, జులై 4వ తేదీ లోగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఆదేశాలను ట్విటర్‌ పాటించాలని లేదంటే మధ్యంతర హోదా కోల్పోవాల్సి వస్తోందని హెచ్చరించింది. ఆ హోదా కోల్పోతే ఈ వేదికపై నెటిజన్లు పెట్టే అభ్యంతరక పోస్టులకు సంబంధించిన కేసుల్లో భారత చట్టాలకు అనుగుణంగా ట్విటర్‌ (Twitter) కూడా క్రిమినల్‌ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ట్విటర్‌ ఆ ఆదేశాలను అమల్లోకి తెచ్చింది.

అయితే, కేంద్రం ఉత్తర్వుల్లో కొన్నింటిపై ట్విటర్‌ (Twitter) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ట్విటర్‌ ఆరోపిస్తోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.. కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీల అధికారిక ఖాతాల నుంచి పోస్ట్‌ చేసిన కంటెంట్‌ను కూడా తొలగించాల్సి వస్తోందని, ఇది వాక్‌ స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘించినట్లు అని ట్విటర్‌ పేర్కొన్నట్లు తెలిపాయి. దీనిపై న్యాయపరమైన సమీక్ష కోరాలని ట్విటర్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా.. తాజా కథనాలపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని