భారత్‌ హెచ్చరికలపై స్పందించిన ట్విటర్‌!

అసత్య సమాచారం వ్యాప్తి చేస్తోన్న వందల సంఖ్యలో ట్విటర్‌ ఖాతాలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ట్విటర్‌ స్పందించింది.

Updated : 09 Feb 2021 17:20 IST

ఉద్యోగుల భద్రతకే తొలి ప్రాధాన్యత అని వెల్లడి

దిల్లీ: అసత్య సమాచారం వ్యాప్తి చేస్తోన్న ట్విటర్‌ ఖాతాలను నిలిపివేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ట్విటర్‌ స్పందించింది. ఉద్యోగుల భద్రతకే మా తొలి ప్రాధాన్యం అని ప్రకటించింది. ట్విటర్‌ ఖాతాలను నిలిపివేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై చర్చించేందుకు కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖను సంప్రదించినట్లు పేర్కొంది.

‘ట్విటర్‌లో ఉద్యోగుల భద్రతే మాకు అత్యంత ప్రధానమైనది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో అధికారిక సంప్రదింపులకోసం ఇప్పటికే కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖను సంప్రదించాము’ అని ట్విటర్ అధికార ప్రతినిధి ప్రకటించారు. కొన్ని ట్విటర్‌ ఖాతాలను తొలగించాలని ప్రభుత్వం నుంచి నోటీసులు అందిన విషయాన్ని ట్విటర్ ధ్రువీకరించింది. అయినప్పటికీ వాటిపై ట్విటర్ ఇంకా‌ చర్యలు తీసుకోలేదు. ‘స్వేచ్ఛగా బహిరంగంగా సమాచారం మార్పిడి చేసుకోవడం ప్రపంచవ్యాప్తంగా సానుకూల ప్రభావం చూపుతుందని మేము దృఢంగా నమ్ముతున్నాము. అందుకే ట్వీట్‌లు చేయడాన్ని కొనసాగిస్తాం’ తాజా ప్రకటనలో ట్విటర్‌ అభిప్రాయపడింది.

ట్విటర్‌ ఉద్యోగి రాజీనామా..

అయితే, వ్యవసాయ చట్టాలకు మద్దతుగా చేసిన ట్వీట్‌‌లను ఆ సంస్థ‌ సీఈఓ కూడా లైక్‌ చేయడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై భారత ప్రభుత్వం కూడా అసహనం వ్యక్తంచేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ట్విటర్‌ ఇండియా పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ మహిమా కౌల్‌ తన బాధ్యతల నుంచి వైదొలిగారు. దీనికి వ్యక్తిగత కారణాలను చూపించినప్పటికీ, ప్రభుత్వం ట్విటర్‌పై ఆగ్రహంగా ఉన్న వేళ ఆమె నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ట్విటర్‌ తన ఉద్యోగుల భద్రతకే ప్రాధాన్యం అనే కోణంలో ప్రకటన చేసినట్లు నిపుణులు భావిస్తున్నారు.

ఇదిలాఉంటే, వ్యవసాయ చట్టాలపై దిల్లీలో జరుగుతోన్న రైతుల ఆందోళనలపై సామాజిక మాధ్యమం ట్విటర్‌ వేదికగా దుష్ర్పచారం జరుగుతోందంటూ కేంద్ర నిఘా సంస్థలు ప్రభుత్వానికి సూచించాయి. ముఖ్యంగా ఖలిస్థాన్‌, పాకిస్థాన్‌ సానుభూతిపరులు ఇలాంటి అసత్య వార్తల ప్రచారాన్ని చేస్తున్నట్లు పేర్కొన్నాయి. దీంతో అలాంటి 257 ఖాతాలను బ్లాక్‌ చేయాలని ట్విటర్‌ను ఆదేశించింది. అయితే, ప్రభుత్వ సూచనల మేరకు తొలుత వాటిని తొలగించిన ట్విటర్‌, కొన్ని గంటల్లోనే మళ్లీ ఆ ఖాతాలను పునురుద్ధరించింది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా రైతుల ఉద్యమంపై అసత్య ప్రచారానికి పాల్పడుతున్న మరో 1178 ఖాతాలను కూడా నిలిపివేయాలని తాజాగా ట్విటర్‌కు సూచించింది. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు ట్విటర్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఇవీ చదవండి..
ఆ 1178 ట్విటర్‌ ఖాతాలు బ్లాక్‌ చేయండి
ట్వీట్లు తొలగిస్తారా? చర్యలు తీసుకోవాలా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని