Twitter: ఆ ట్వీట్లు హానికరం కావు.. అయినా కేంద్రం బ్లాక్‌ చేయమంటోంది: ట్విటర్‌

ట్వీట్లు, అకౌంట్లు బ్లాక్‌ చేయమని చెప్పే విషయంలో భారత పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను కేంద్రం ఉల్లంఘిస్తోందని ట్విటర్‌ ఆరోపించింది.

Published : 26 Sep 2022 21:01 IST

బెంగళూరు: ట్వీట్లు, అకౌంట్లు బ్లాక్‌ చేయమని చెప్పే విషయంలో భారత పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను కేంద్రం ఉల్లంఘిస్తోందని ట్విటర్‌ ఆరోపించింది. తమను కంటెంట్‌ను తొలగించే ముందు ఉల్లంఘనలకు నోటీసులు కూడా పంపించడం లేదని కర్ణాటక హైకోర్టుకు తెలిపింది. ట్విటర్‌ ఖాతాలు, కంటెంట్‌, యూఆర్‌ఎల్‌ తొలగింపులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై ట్విటర్‌ కర్ణాటక హైకోర్టులోపిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం ట్విటర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అరవింద్‌ దతార్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ యాక్ట్‌కు అనుగుణంగానే ట్విటర్‌ నడుచుకుంటోందని చెప్పారు.

ప్రభుత్వం బ్లాక్‌ చేయమంటున్న ట్వీట్లలో 50-60 శాతం ఎలాంటి హానీ చేయనివే ఉంటున్నాయని దతార్‌ పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తున్న ఖాతాలను గంపగుత్తగా బ్లాక్‌ చేయాలని కేంద్రం కోరుతోందన్నారు. ఒక ట్వీట్‌ను మాత్రమే తొలగించాలని చెప్పాల్సిన చోట రాజకీయ కారణాల వల్ల ఏకంగా ఖాతానే బ్లాక్‌ చేయాలని సూచిస్తోందన్నారు. దిల్లీ వెలుపల రైతులు ఉద్యమం చేసినప్పుడు పత్రికలు, టీవీలు వాటిని ప్రసారం చేశాయని ఉదహరించారు. కానీ ఆ న్యూస్‌ ఆర్టికల్స్‌ను ట్వీట్‌ చేసిన ఖాతాలను పూర్తిగా తొలగించాలని కేంద్రం సూచించిందని చెప్పారు.

ఏదైనా తప్పు జరుగుతోందని తెలిస్తే ట్విటర్‌ స్వయంగా రంగంలోకి దిగి ట్వీట్లను తొలగించిన సందర్భాలు ఉన్నాయని న్యాయవాది చెప్పారు. ఖలిస్థాన్‌ను ప్రేరేపించే ట్వీట్లను ట్విటర్‌ స్వయంగా బ్లాక్‌ చేసిందని గుర్తుచేశారు. ఏదైనా ఖాతా నుంచి వచ్చే ట్వీట్లన్నీ చట్టవిరుద్ధమైనవి అయితేనే పూర్తిగా ఖాతాను తొలగించాలే తప్ప.. కేవలం ఒక్క ట్వీట్‌కు ఖాతాను బ్లాక్‌ చేయకూడదని గతంలో దిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ట్విటర్‌ వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్‌ 17కు వాయిదా వేసింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని