Twitter: ప్రత్యేక దేశంగా కశ్మీర్‌.. ట్విటర్‌ అతి!

భారత భూభాగాలను తప్పుగా చూపుతూ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ మరోసారి ధిక్కార చర్యకు పూనుకుంది

Updated : 28 Jun 2021 17:46 IST

మరోసారి ట్విటర్ ధిక్కార చర్య

దిల్లీ: భారత భూభాగాలను తప్పుగా చూపుతూ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ మరోసారి ధిక్కార చర్యకు పూనుకుంది. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ను వేరే దేశంగా చూపుతూ.. భారత దేశ పటాన్ని వక్రీకరించింది. ఇప్పటికే నూతన ఐటీ నిబంధనల విషయంలో కేంద్రం, ట్విటర్ మధ్య వివాదం నడుస్తోంది. తాజాగా చర్యతో ఈ సంస్థ ప్రభుత్వం నుంచి కఠిన చర్యలు ఎదుర్కోనుందని అధికార వర్గాలు అంటున్నాయి.

ట్విటర్‌లోని ‘ట్వీప్‌ లైఫ్’ సెక్షన్‌లో.. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ ప్రాంతాలను భారత్‌లో భాగంగా చూపలేదు. వాటిని వేరే దేశంగా పేర్కొంది. భూభాగాలను తప్పుగా గుర్తించిన భారతదేశ పటం నెటిజన్ల దృష్టిలో పడింది. దీనిపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో కూడా లేహ్‌ ప్రాంతాన్ని చైనాలో భాగంగా తప్పుగా గుర్తించిన సంగతి తెలిసిందే. 

నూతన ఐటీ నిబంధనలు పాటించనందుకు కేంద్రం ఇప్పటికే ట్విటర్‌పై చర్యలు ప్రారంభించింది. దాంతో ‘సురక్షిత ఆశ్రయం’(సేఫ్ హార్బర్) అన్న రక్షణ కవచాన్ని ఆ సామాజిక మాధ్యమం కోల్పోయింది. ఈ క్రమంలో ట్విటర్‌పై పలు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇది చాలదన్నట్టు ఇటీవల కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను కూడా గంటపాటు నిలిపివేసింది. ట్విటర్ ధిక్కార చర్యలపై తాను మాట్లాడినందుకే తన ఖాతాను బ్లాక్‌ చేసి ఉంటారని మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు