ఇద్దరు విద్యార్థులకు +ve.. యంత్రాంగానికి ‘పరీక్ష’

కేరళలో ఇటీవల నిర్వహించిన కేరళ ఇంజినీరింగ్‌ ఆర్కిటెక్చర్‌ మెడికల్‌ ప్రవేశ పరీక్షకు (కేఈఏఎం) హాజరైన ఇద్దరు విద్యార్థులకు కొవిడ్‌-19 నిర్ధారణ కావడం కలకలం రేగింది. దీంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు నుంచీ హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోకుండా తమ మాటలు పెడచెవిన పెట్టినందుకే ఈ పరిస్థితి........

Published : 22 Jul 2020 02:00 IST


ఈ నెల 16న తిరువనంతపురంలో ఓ పరీక్షా కేంద్రం వద్ద పరిస్థితి

తిరువనంతపురం: కేరళలో ఇటీవల నిర్వహించిన కేరళ ఇంజినీరింగ్‌ ఆర్కిటెక్చర్‌ మెడికల్‌ ప్రవేశ పరీక్షకు (కేఈఏఎం) హాజరైన ఇద్దరు విద్యార్థులకు కొవిడ్‌-19 నిర్ధారణ కావడం కలకలం రేగింది. దీంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు నుంచీ హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోకుండా తమ మాటలు పెడచెవిన పెట్టినందుకే ఈ పరిస్థితి తలెత్తిందని విపక్షాలు కేరళ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి.

తిరువనంతపురం జిల్లాలో వేర్వేరు కేంద్రాల్లో ·ఈ నెల 16న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు హాజరైన ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఆ జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు. ఒకరు 19 ఏళ్ల అమ్మాయి కాగా.. ఇంకొకరు 18 ఏళ్ల అబ్బాయి అని పేర్కొన్నారు. అబ్బాయి రాసిన పరీక్షా హాల్‌లో ఒక్కరే ఉండడం గమనార్హం. ఈ ఇద్దరితో పాటు పరీక్షా కేంద్రానికి తన కుమారుడిని తీసుకొచ్చిన వ్యక్తికి కూడా కొవిడ్‌-19 నిర్ధారణ అవ్వడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విద్యార్థిని హాజరైన హాల్లో పరీక్ష రాసిన 20 మంది విద్యార్థులను, ఇన్విజిటలేటర్లు, వాలంటీర్లను హోంక్వారంటైన్‌ అవ్వాల్సిందిగా సూచించినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. తమ పిల్లలతో పరీక్షా కేంద్రం నుంచి ఇంటికెళ్లిన తల్లిదండ్రులు కూడా హోంక్వారంటైన్లో ఉండాల్సిందిగా సూచించారు. ఎవరిలోనైనా కొవిడ్‌-19 లక్షణాలు కనిపిస్తే వెంటనే 107కి ఫోన్‌ చేయాలని సూచించారు.

మరోవైపు తాజా ఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. కొవిడ్-19 ఉద్ధృతం అవుతున్న నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయాలని ఇటీవల కేరళ ఎంపీ శశిథరూర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పినరయి విజయన్‌ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. అన్ని పరీక్షలనూ రద్దు చేయాలంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిని ట్విటర్‌లో కోరారు. తమ మాటలను సీఎం పెడచెవిన పెట్టారని, విద్యార్థుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టారని భాజపా నేత, కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్‌ విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని