Jammu and Kashmir: ఉగ్రఘాతుకం.. పేలుడులో ఐదుగురు జవాన్లు మృతి

ఉగ్రవాదులు జరిపిన పేలుడులో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లోని రాజౌరీ సెక్టార్‌లో ఈ ఘటన జరిగింది. 

Updated : 05 May 2023 19:57 IST

రాజౌరీ: జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లో ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. వారు జరిపిన బాంబు పేలుడులో ఐదుగురు సైనికులు మృతి చెందారు. మరో జవాను చికిత్స పొందుతున్నాడు. రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో ఆర్మీ ట్రక్కు పేలి ఐదుగురు సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. జవాన్లతో వెళ్తున్న ట్రక్కుపై ఉగ్రవాదులు గ్రనేడ్‌ దాడి చేయడంతో ఐదుగురు జవాన్లు సజీవ దహనమయ్యారు. భారీ వర్షాలు, విజిబులిటీ సరిగా లేకపోవడం వంటి పరిస్థితులను అనుకూలంగా మలచుకొని సైనికులు వెళ్తున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు దిగారు.

ఆ ఘటనకు పాల్పడిన ముష్కరులు  కాండి ఫారెస్ట్‌లోని ఓ గుహలో ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి ఆర్మీకి సమాచారం అందింది. దాంతో గురువారం నుంచి బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. శుక్రవారం ఉదయం ఉగ్రవాదుల జాడ గుర్తించడంతో.. ఇరువైపులా ఎన్‌కౌంటర్ మొదలైంది. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు పేలుడు పదార్థాన్ని ఉపయోగించారు. ఆ ఘటనలో ఇద్దరు ఆర్మీ అధికారులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఉధంపుర్‌లోని కమాండ్ ఆసుపత్రికి తలించారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఉగ్రవాదులు ఆ ప్రాంతంలోనే దాక్కొని ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజౌరీ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని