Baby: ఒకరి బిడ్డను మరొకరు కన్నారు.. ఐవీఎఫ్‌ కేంద్రంపై కేసు వేశారు!

సంతాన సాఫల్య కేంద్రం చేసిన పొరపాటు వల్ల ఓ తల్లి తమది కానీ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో 

Published : 12 Nov 2021 01:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంతాన సాఫల్య కేంద్రం చేసిన పొరపాటు వల్ల ఓ తల్లి తమది కానీ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో ఇప్పుడు ఆమె, ఆమె భర్త ఆ సంతాన సాఫల్య కేంద్రంపై కేసు వేశారు. వివరాల్లోకి వెళితే..

కాలిఫోర్నియాకి చెందిన డాఫ్నా కార్డినెల్‌, అలెగ్జాండర్‌ దంపతులు రెండేళ్ల కిందట సెంటర్‌ ఫర్‌ రీప్రొడక్టీవ్‌ హెల్త్‌ కేంద్రాన్ని ఆశ్రయించి.. కృత్రిమ గర్భాధారణ కోసం ప్రయత్నించారు. ఎట్టకేలకు డాఫ్నా గర్భం దాల్చి.. 2019 సెప్టెంబర్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. కొన్ని నెలల తర్వాత శిశువు రంగు, పోలికలు తమలా లేకపోవడంతో డాఫ్నా దంపతులకు అనుమానం కలిగింది. వెంటనే డీఎన్‌ఏ పరీక్షలు చేయించారు. దాంట్లో డాఫ్నా జన్మనిచ్చింది తమ బిడ్డకి కాదని తెలిసి ఖంగుతిన్నారు. మళ్లీ ఆ సంతాన సాఫల్య కేంద్రాన్ని సంప్రదించగా.. పొరపాటు జరిగినట్లు గుర్తించారు. వైద్యులు డాఫ్నా, అలెగ్జాండర్‌ పిండాన్ని మరొకరి గర్భంలో.. వారికి చెందిన పిండాన్ని డాఫ్నా గర్భంలో ప్రవేశపెట్టారట. వీరి పిండాన్ని ప్రవేశపెట్టిన మహిళ కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుసుకున్నారు. దీంతో రెండు జంటలు తమ బిడ్డల్ని పరస్పరం మార్చుకోవడమే కాదు.. నవమాసాలు మోసిన కడుపుతీపితో.. తరచూ కలుస్తూ పిల్లల్ని ప్రేమగా చూసుకుంటున్నాయి. మరోవైపు అసాధారణ పొరపాటు చేసిన సంతాన సాఫల్య కేంద్రంపై డాఫ్నా దంపతులు కేసు వేశారు. ‘మా బిడ్డను కడుపులో మోసే అవకాశాన్ని చేజార్చారు. నా బిడ్డ స్పర్శను కోల్పోయేలా చేశారు’’అని డాఫ్నా ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు