Nepal Border: అక్రమ ప్రవేశం.. 15 రోజుల మకాం.. సరిహద్దులో ఇద్దరు చైనీయుల పట్టివేత!

భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన ఇద్దరు చైనీయులను ఇండో- నేపాల్‌ సరిహద్దుల వద్ద భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీసా లేకుండానే వారు దేశంలోకి చొరబడి, దిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో దాదాపు 15 రోజులపాటు...

Published : 14 Jun 2022 01:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన ఇద్దరు చైనీయులను ఇండో- నేపాల్‌ సరిహద్దుల వద్ద భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీసా లేకుండానే వారు దేశంలోకి చొరబడి, దిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో దాదాపు 15 రోజులపాటు మకాం వేసినట్లు గుర్తించారు. తాజాగా నేపాల్‌కు పారిపోయేందుకు యత్నించగా.. సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ) సిబ్బంది వారిని గుర్తించి పట్టుకున్నారు. ఆ ఇద్దరిని అరెస్టు చేసినట్లు బిహార్‌లోని సీతామఢీ జిల్లా ఎస్పీ హర్‌కిశోర్‌ రాయ్‌ తెలిపారు. వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామన్నారు. సోమవారం కోర్టులో హాజరుపరిచి, జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లు చెప్పారు. ఇద్దరేనా? లేదా మరికొంతమంది వచ్చారా అనే విషయాన్ని కూడా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.

పట్టుబడిన ఇద్దరు చైనా జాతీయులను లూ లాంగ్(28), యువాన్ హై లాంగ్(34)గా గుర్తించినట్లు ఎస్ఎస్‌బీ 51 బెటాలియన్‌ కమాండర్‌ రాజన్‌ కుమార్‌ తెలిపారు. వీసాలు లేనప్పటికీ.. వారి వద్ద చైనా పాస్‌పోర్ట్‌లు లభ్యమైనట్లు చెప్పారు. కాలినడకన సీతామఢీ జిల్లాలోని భిట్టామోడ్‌ బార్డర్‌ ఔట్‌పోస్ట్‌ సమీపంలో సరిహద్దు దాటుతుండగా పట్టుబడినట్లు వెల్లడించారు. నేపాల్ మీదుగా భారత భూభాగంలోకి ప్రవేశించిన వారు.. నొయిడాకు వెళ్లి అక్కడ పరిచయస్తుల వద్ద ఆశ్రయం పొందినట్లు విచారణలో చెప్పారన్నారు. ఫోన్ రికార్డులు, ఇతర వస్తువులను తనిఖీ చేయగా.. ఆర్థిక నేరాల రాకెట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులుగా కనిపిస్తున్నారని ఎస్‌ఎస్‌బీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ అప్రమత్తమైందని స్థానిక అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని