Omicron: దేశంలో ఒమిక్రాన్‌ @ 200 కేసులు.. సగానికి పైగా మహారాష్ట్ర, దిల్లీలోనే..

యావత్‌ ప్రపంచానికి వణుకుపుట్టిస్తోన్న కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌.. దేశంలోనూ శరవేగంగా వ్యాపిస్తోంది. చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తోంది.

Updated : 21 Dec 2021 12:50 IST

దిల్లీ: యావత్‌ ప్రపంచానికి వణుకు పుట్టిస్తోన్న కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌.. దేశంలోనూ శరవేగంగా వ్యాపిస్తోంది. చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు పాకగా.. మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 200కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 54, దిల్లీలో 54 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14 కేసులు వెలుగుచూసినట్లు తెలిపింది. అయితే ఈ వేరియంట్ బాధితుల్లో ఇప్పటివరకు 77 మంది కోలుకున్నట్లు పేర్కొంది.

తొలిసారిగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్‌.. దాదాపు 100 దేశాలకు పాకింది. ముఖ్యంగా ఐరోపా దేశాల్లో ఒమిక్రాన్ ఉద్ధృతి విపరీతంగా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు బ్రిటన్‌లో వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు అక్కడ దాదాపు 40వేల కొత్త వేరియంట్ కేసులు నమోదవ్వగా.. 12 మరణాలు కూడా చోటుచేసుకున్నట్లు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది.

అటు అగ్రరాజ్యం అమెరికాలోనూ ఒమిక్రాన్ హడలెత్తిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే అక్కడ కొత్త వేరియంట్‌ కేసులు 73శాతానికి పెరిగాయి. అంతేగాక, ఈ వేరియంట్ కారణంగా టెక్సాస్‌లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు మళ్లీ ఆంక్షల బాట పట్టాయి. క్రిస్మస్, న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని కొన్ని దేశాలు లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు అమలు చేస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని