మునిగిన ఆశలకు సజీవ సాక్ష్యం.. ఈ యేటి మేటి చిత్రం

ఆశలన్నీ నీటమునగగ.. కన్నీళ్లన్నీ ఇంకిపోగా.. కాలం మిగిల్చిన కష్టాలతో.. నిస్సహాయతతో నిలబడి చూస్తున్న ఈ బాలిక పేరు పల్లవి. తీర ప్రాంతాల్లో ప్రకృతి ప్రకోపానికి సర్వస్వం నష్టపోతున్న ఎన్నో కుటుంబాలు, బాల్యాన్ని కోల్పోతున్న

Updated : 30 Dec 2021 13:00 IST

భారత ఫొటోగ్రాఫర్లకు యునిసెఫ్‌ ‘ఫొటో ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డులు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆశలన్నీ నీటమునగగ.. కన్నీళ్లన్నీ ఇంకిపోగా.. కాలం మిగిల్చిన కష్టాలతో.. నిస్సహాయంగా నిలబడి చూస్తున్న ఓ నిరుపేద బాలిక ఫొటో ఇది. తీర ప్రాంతాల్లో ప్రకృతి ప్రకోపానికి సర్వం నష్టపోతున్న ఎన్నో కుటుంబాలు, బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారుల దీనగాథకు సజీవ సాక్ష్యమైన ఈ చిత్రం.. యునిసెఫ్‌ ‘ఫొటో ఆఫ్‌ ది ఇయర్‌ 2021’గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల జీవన స్థితిగతులకు అద్దం పట్టే మేటి చిత్రాలకు యునిసెఫ్‌ అవార్డులు ప్రకటిస్తుంటుంది. ఈ ఏడాది కూడా అవార్డులను ప్రకటించగా.. వీటిలో తొలి రెండు బహుమతులు భారత ఫొటోగ్రాఫర్లను వరించడం విశేషం.  

ఆశలు మునిగిన వేళ..

పశ్చిమబెంగాల్‌లోని సుందర్‌బన్‌ అంటే అందమైన అటవీ ప్రాంతమనే చాలా మందికి తెలుసు. కానీ అక్కడ ప్రకృతి వైపరీత్యాలకు సర్వస్వం కోల్పోయి రోడ్డున పడుతున్న జీవితాలెన్నో..! అందులో 12ఏళ్ల పల్లవి కుటుంబం కూడా ఒకటి. గంగా నది పరీవాహక ప్రాంతమైన నంఖానా ద్వీపంలో పల్లవి కుటుంబం జీవిస్తోంది. తండ్రి ట్రక్కు నడుపుతూ వచ్చే సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. దీంతో పల్లవి సొంతంగా టీ దుకాణం పెట్టి కుటుంబానికి అండగా నిలిచింది. ఇలా సాగిపోతున్న వీరి జీవితాన్ని తుపాను అతలాకుతలం చేసింది. 2020లో పెను తుపాను కారణంగా గంగా నది ఉప్పొంగి ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలను ముంచేసింది. వరదల ధాటికి పల్లవి ఉంటున్న ఇల్లు, టీ దుకాణం కూడా ధ్వంసమయ్యాయి. వరద ప్రాంతాలను కవర్‌ చేసేందుకు వెళ్లిన ఫొటోగ్రాఫర్‌ సుప్రతిమ్‌ భట్టఛర్జీకి.. నిస్సహాయ స్థితిలో నిల్చున్న పల్లవి కన్పించడంతో వెంటనే ఆమె ఫొటో తీశాడు. 

ఈ ఫొటోను యునిసెఫ్‌ అవార్డులకు పంపించగా.. ఈ యేటి మేటి చిత్రంగా తొలి బహుమతి లభించింది. వాతావరణ మార్పుల కారణంగా చోటుచేసుకున్న ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో చిన్నారులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని యునిసెఫ్‌ విచారం వ్యక్తం చేసింది. ఆసియా, ఆఫ్రికాల్లోని తీర ప్రాంతాల్లో దాదాపు 530 మిలియన్ల మంది చిన్నారులు వరదల వల్ల విద్య, బాల్యానికి దూరమవుతున్నారని పేర్కొంది. 

చిన్న ప్రయత్నం.. మహమ్మారిపై పెద్ద విజయం

ఇక ఈ ఏడాది యునిసెఫ్‌ ఫొటో ఆఫ్ ది ఇయర్‌ ద్వితీయ బహుమతి కూడా భారత ఫొటోగ్రాఫర్‌కే దక్కడం విశేషం. మహారాష్ట్రకు చెందిన సౌరవ్‌ దాస్‌.. కరోనా సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల పరిస్థితులను తన కెమెరాతో బంధించారు. అందులో ఒకటి పైన కన్పిస్తున్న ఈ చిత్రం. మహమ్మారి తీవ్రత కారణంగా గతేడాది దేశవ్యాప్తంగా స్కూళ్లు మూతబడ్డాయి. ఆన్‌లైన్‌ విద్య మొదలైంది. అయితే, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు లేకపోవడం, అక్కడి టీచర్లు కూడా సరిపడా వసతులు లేకపోవడంతో విద్యార్థులకు పాఠాలు చెప్పడమే మానేశారు.

ఆ సమయంలో దీప్‌ నారాయణ్‌ అనే ఓ ఉపాధ్యాయుడికి వచ్చిన అద్భుతమైన ఆలోచన.. తన గ్రామంలోని విద్యార్థులకు వరంగా మారింది. పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించే వీలు లేకపోవడంతో దీప్‌ నారాయణ్‌.. తన గ్రామంలోని ప్రతి ఇంటి గోడలను బ్లాక్‌బోర్డుల వలే తీర్చిదిద్దారు. విద్యార్థులను దూరం దూరం కూర్చుబెట్టి తరగతులు బోధించారు. కరోనా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్నదానిపై అవగాహన కల్పించారు. అలా ఇంటి అరుగు మీద కూర్చుని విద్యార్థులు పాఠాలు వింటున్న దృశ్యాన్ని సౌరవ్‌ ఫొటో తీయగా.. అది రెండో మేటి చిత్రంగా నిలిచింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని